మిత్రశతకము
ఉ.
శ్రీకరముల్ ధరాస్థలికి శ్రేయము లందగజేయు వాక్యముల్
లోకపుపోకడల్ కలిని లుప్తములైనటువంటి భావనల్
చేకొని నూరుపద్యములు చెప్పగ దైవము బల్కినట్లుగా
నాకొక యాజ్ఞయయ్యె నిట నాది ప్రయత్నము నమ్ము మిత్రమా! 1.
చం.
పదముల శక్తిలేదు, శుభభావసుగంధములొల్కు
వాక్యముల్
ముదమును గూర్చునట్లుగను పోడిమి జూపుచు బల్కలే నికన్
సదమలమలమైన ఛందముల సౌరులు గూర్చగలేను దైవ మీ
యదనున దారి జూపవలె నాగని రీతిగ నాకు మిత్రమా! 2.
చం.
వరములనిచ్చి భక్తులకు పావనతన్ బొనరింప విఘ్నముల్
సురుచిరవత్సలత్వమున శూన్యము జేసి జయంబు గూర్చగా
నిరతము దల్చుచుండు మహనీయుడు లోకుల గావబూని యీ
ధరణికి జేరు విఘ్నపతి తథ్యము మ్రొక్కెద నిప్డు మిత్రమా! 3.
ఉ.
కోరినరీతి శబ్దములు గూర్చుచు భావపరీమళత్వముల్
తీరుగ జేర్చి యీకృతికి దీప్తులు నింపగ శారదాంబకున్
తోరపు భక్తి మ్రొక్కు లిడుదున్ మహనీయశుభానురాగ! నా
కోరిక దీర్చుమా యనుచు కోమలమానస నిప్డు మిత్రమా! 4.
చం.
తిరుమలకొండపై కొలువు దీరి మహత్తరవత్సలాఢ్యుడై
నిరతము భక్తకోటులకు నిస్తుల శక్తిని భాగ్యరాశులన్
వరముగ నిచ్చి బ్రోవగల వానిని శ్రీపతి వేంకటేశ్వరున్
స్థిరమతి నౌచు మ్రొక్కెదను చిన్మయునిన్ నుతియింతు మిత్రమా! 5.
చం.
పరమ దయామయుం డతడు భాగ్యము బంచగ భక్తకోటికిన్
ధరపయి చేరుచుండు సతతంబు ప్రణామము చేయుచుండెదన్
“హరహర రక్షరక్ష”యని యంచు జలంబులధార పోయుచున్
వరమగు బిల్వపత్రమును భక్తి నొసంగుచు నుండి మిత్రమా! 6.
ఆతడు తల్లిదండ్రుల మహత్వ మెరింగినవాడు,
వారికిన్
బ్రీతిని గూర్చ సౌఖ్యమును వీడగ సంశయ మందకుండువా
డాతతకీర్తిసంయుతు డహర్నిశలున్ జనులందు హర్షముల్
బ్రాతిగ గోరువా డతడె రాఘవు
డాతని గొల్తు మిత్రమా! 7.
చం.
జగతికి జ్ఞానదీధితుల సవ్యపథంబును జూపి చిత్తమం
దగణితమై వికాసమున కడ్డుగ జేరిన ధ్వాంతరాశులన్
వగగొన జేసినట్టి భగవానుడు
తానిట కృష్ణమూర్తి యా
నిగమనుతున్ పరాత్పరుని నిష్ఠ నుతించెద నెప్డు మిత్రమా!. 8.
చం.
ధరపయి జన్మ నాకిడిన తల్లిని దండ్రిని నమ్రతాస్థితిన్
నిరతము గొల్చుచుండెదను నిష్ఠగ నీకృతిలోన నాకిటన్
వరమగు సత్వముం బొడమి వాంఛ ఫలించెడి రీతి జూడగన్
స్థిరమతి సత్ప్రణామములు చేసెద శబ్దములందు మిత్రమా! 9.
ఉ.
నాదె యదృష్టమం చనెద నన్నొక యల్పుని జ్ఞానశూన్యునిన్
స్వాదుతరాచ్ఛశబ్దముల జక్కగ బిల్చుచు ‘సత్య’మంచు
నా
కాదరమొప్ప విద్య లిట నందగ జేసిరి సద్గురూత్తముల్
మోదము నందుమా యనుచు మ్రొక్కెద వారలకెల్ల మిత్రమా! 10.
మ.
హరినామంబు జపించువాడు, సతతం
బత్యంతభక్తిస్ఫుర
త్పరమానందమనోవికాసగరిమన్ త్ర్యక్షున్ బ్రణామించుచున్
ధరపై నిల్చెడి వాడు సౌఖ్యవితతిన్ తథ్యంబుగా గాంచు, తా
నరయం గల్గును సద్యశోవిభవ మత్యంతంబుగా మిత్రమా! 11.
చం.
నిరుపమమైన జ్ఞానమును నిర్మలభావముతోడ నిచ్చలున్
వరగుణులౌచు ధాత్రిపయి వర్ధిలునట్లుగ శిష్యకోటికిన్
నిరతము బంచుచుండుటయె నిష్ఠగ నెంచి చరించువారలౌ
గురులకు వందనంబు లిట గూర్చెద నమ్రతతోడ మిత్రమా!. 12.
శ్రీలు వరించు, సద్యశము చేకురు నాయతగౌరవంబు స
చ్ఛీలమహత్వయుక్తునకు జీవనమందున హర్షసంపదల్
మేలగు శక్తు లె ప్డమరు మేదిని గావున మానవుండు సౌ
ఖ్యాలకు నర్రు చాచక శుభాత్మకుడౌ టుచితమ్ము మిత్రమా! 13.
చం.
సముచితవర్తనంబునకు చక్కని ఠావయి వెల్గుచుండువా
డమలినభావదీప్తులకు నాస్పదుడై విలసిల్లువాడు స
త్క్రమము నెరింగి భాషణము రమ్యగతిన్ బొనరించువా డిటన్
క్షమపయి సౌఖ్యసంపదల గాంచును సందియమేల మిత్రమా! 14.
మ.కో.
ఎల్లవేళల ధర్మకార్యము లిచ్ఛతోడను జేయుటల్
తల్లిదండ్రుల యందు భక్తిని దాల్చి సేవలు సల్పుటల్
కల్లలాడక సత్యమందున గాంక్షజూపుచు నుండుటల్
ఫుల్లమానసు లౌట ధర్మము భూజనాళికి మిత్రమా! 15.
మ.
నను గన్నారలు పెంచినార లెపుడున్ నవ్యానురాగమ్ముతో
జనసంఘబులతోడ గూడి మనుటన్ సవ్యప్రకారమ్ముగా
తనయా! విన్మని తెల్పినారు జనకుల్ తథ్యంబుగా వారలే
మన కారాధ్యులు పూజ్యులంచు మదిలో మన్నించుమా మిత్రమా! 16.
మ.
తన సౌఖ్యంబును గోరుచుండుట,
మహద్దౌష్ట్యంబు చూపించుటల్,
ఘనసంతాపము స్వీయకార్యములచే గల్గించి లోకమ్మునన్
జనులన్ శోకమునందు నెట్టుటయు,
నిస్సంకోచభావమ్ముతో
ననృతంబాడుట నిత్యకృత్యము లయెన్ హా! నేడిలన్ మిత్రమా! 17.
మ.
తన జన్మస్థితి కారణంబయిన యిద్ధాత్రిన్ శుభస్వాంతుడై
జను డెవ్వాడు భజించు తద్గతమతిన్ సత్కార్యమున్ జేయుచున్
మనుచున్ గాలము బుచ్చు వానికి సదా మాన్యత్వముం గూర్చి త
జ్జననంబున్ సఫలం బొనర్చును
గదా సర్వేశు డో మిత్రమా! 18.
పలుకులందున మార్దవంబును, భావమందున
శుద్ధియున్,
కలిమి బంచెడి మానసంబును,
కార్యదీక్షితబుద్ధియున్,
చెలిమిలోనను నిర్మలత్వము,
చిత్తదీప్తియు ధాత్రిలో
నలఘు సద్యశ మందజేసెడి వౌను సత్యము మిత్రమా! 19.
చం.
పనిగొని వాదు లాడుటయు,
వారిని వీరి నమానుషంబుగన్
ఘనతరమైన కష్టములు గాంచెడిరీతిని జేయుచుండుటల్,
జననుతులైన సజ్జనుల సచ్చరితంబున మచ్చగూర్చుచున్
మనియెడి భావ మీకలిని మానవనైజము లయ్యె మిత్రమా! 20.
ఉత్సాహము.
దైవమందు భారముంచి తన్మయత్వమందుచున్
భావశుద్ధితోడ సతము వర్తనం బొనర్చుచున్
చేవ జూపి స్వీయవిధులు చేయబూనుచుండినన్
తావకీన మౌను జయము తథ్యమోయి మిత్రమా! 21.
మ.కో.
పెద్దవారల పట్ల భక్తియు,
పిన్నలం దనురక్తియున్,
వద్దు కాదని ధర్మరీతిని బాయకుండుట,
లెల్లెడన్
సద్దయాహృదయంబుతో జనసంఘదీప్తిని గోరుటల్,
హద్దు మీరక సంచరించుట లౌను సభ్యత మిత్రమా! 22.
శా.
నేనే శ్రేష్ఠుడ నీధరిత్రిపయి సన్దేహమ్ము లేదింతయున్
జ్ఞానౌన్నత్యమునందు నాకెవరు విశ్వంబందు తుల్యత్వమున్
గానం జాలరటంచు
నిచ్చ లిచటన్ గర్వంబునన్ బల్కుటల్
తానౌ మూర్ఖత వాని కంద విట గల్యాణంబు లోమిత్రమా! 23.
పం.చా.
మహానుభావులైనవారి మార్గమందు నేగు టి
మ్మహీస్థలంబు నందునుండు మానవాళి కన్నిటన్
మహత్వ మందజేయుచుండు మాట సత్య మద్దియే
యిహస్థసౌఖ్యవృద్ధి జూపు నెల్లవేళ మిత్రమా! 24.
శా.
విద్యల్ నేర్చిన, విస్తృతంబుగ
నిటన్ విత్తంబులన్ గూర్చినన్,
సద్యశ్శక్తిని జూపి యన్ని యెడలన్ సాధించినన్ గార్యముల్,
హృద్యంబై వెలుగొందు సభ్యత కళా హీనత్వముం గాంచినన్
సద్యోగంబులు గూడునే? దొరకునే సంతోష?
మోమిత్రమా! 25.
ఉత్సాహము.
ఛాత్రులైనవారు నిత్య సత్యభాషణంబుతో
పాత్రతన్ వహించి యొజ్జవద్ద చేరి విద్యలన్
రాత్రులున్ దివంబులందు లక్ష్యమంది నేర్చుచున్
జైత్రయాత్ర చేయనౌను సంతతమ్ము మిత్రమా! 26.
ఉత్సాహము.
వినతులౌచు శ్రద్ధతోడ విద్యనేర్చువారికిన్
ఘనత కూడు జయము లందు కాంక్ష దీరు నంతటన్
జనులలోన నగ్రతాది సంపదల్ ఘటించు తా
మనుదినంబు హర్షదీప్తు లందు దప్పకుండగన్. 27.
మ.కో.
స్వీయధర్మము వీడకుండుట క్షేమదంబని యెంచుచున్,
ధ్యేయమందున ధార్మికత్వపుదీప్తి నింపి చరించుచున్
న్యాయమార్గపుటార్జనంబును నమ్మియుండిన లోకమం
దాయతంబుగ శ్రేయ మందెడు నన్నిరీతుల మిత్రమా! 28.
మ.
ఒకనా డిచ్చట స్వీయసంపదలు తా ముత్సాహపూర్ణాత్ములై
యకలంకోన్నతభావనాసహితులై యర్పించి దేశంబునన్
సకలానందము నెంచి స్వేచ్ఛను భళా! సాధించి యున్నార లి
ప్డకటా! స్వార్థమె మూలమై ప్రబలె నన్యాయంబుగా మిత్రమా! 29.
శా.
ఎన్నోజన్మల పుణ్య మీభువిని నా కీరీతి నుత్కృష్టమై
యెన్నం జాలిన మానవత్వ మిడె నే నిద్దానినిన్ జిత్తమం
దెన్నం డైనను విస్మరించక
మదీయేచ్ఛన్ సమాజంబునం
దన్నింటన్ శుభసిద్ధి యందుకొరకై యర్పింతు నో మిత్రమా! 30.
శా.
నాదేశంబిది కర్మభూమి యిచటన్ నానాప్రకారంబులై
మోదంబున్ గలిగించు సంస్కృతులు సంపూర్ణాచ్ఛభాగ్యోన్నతిన్
నేదంపూర్వవిధాన గూర్చును గదా నిత్యమ్ము నేనిట్టి యీ
వేదస్థానమహత్వమున్ దెలిపెదన్ విశ్వాని కోమిత్రమా! 31.
చం.
అలయుట పాడి కాదు, సుఖమందున
నిత్యము దేలియాడు టీ
యిలపయి కూడబోదు, మహదిచ్ఛను
జూపి పరోపకారమున్
దలపున నింపి దీక్షనిట దాల్చి చరించుచు సంతసించుటే
వలసిన కార్యమన్న శుభభావన యుక్తము నమ్ము మిత్రమా! 32.
చం.
పరులకు ధర్మసూత్రము లపారజవంబున బల్కుచుండి యీ
ధరణిని గాచుచుండగల దార్ఢ్యత గల్గిన వారమంచు తా
మురుతర దక్షతన్ దెలుపుచుండెడివారలె స్వార్థజీవులై
తిరుగుట సాజమీ కలిని దీనిని మార్చుట యౌనె మిత్రమా! 33.
చం.
ఒకనికి సంతసంబులవి యొప్పగురీతిని గల్గుచున్నచో
నొకడది చూచి యోర్చుటకు నొప్పడు నేటియుగంబునందు నే
నకలుషభావనుండ నని యచ్చట నిచ్చట బల్కుచుండు వా
నికిగల సాధుతన్ జనులు
నిక్క మెరుంగకపోరె మిత్రమా!
34.
ఉ.
పద్దియ మొక్కటేని శుభభావము నిండ సలక్షణంబుగా
పెద్దలు పండితోత్తములు భేషని యంతట మెచ్చునట్లుగా
నొద్దిక జూపి వ్రాయగల యొప్పొకయింతయు లేని కొంద రి
ప్డద్దిర! సత్కవీశ బిరుదాంకితు లీయిల జూడ మిత్రమా ! 35.
మ.కో.
మూడురంగులు దేహమందున
మోద మీయగ దాల్చి మీ
రేడ కేగిన భారతీయత కెల్లరీతుల శ్రేష్ఠమౌ
పోడిమందెడిరీతి నుండుడు పూజ్యులై విలసిల్లు డం
చాడు భవ్యపతాక మియ్యది యస్మదీయము మిత్రమా! 36.
మ.కో.
వేదరాశి భవంబు నందెను విస్తృతోపనిషత్తులున్
మోద మిచ్చు పురాణ సంఘము పుట్టె నిచ్చట నిచ్చలున్
శ్రీదమై వెలుగొందు ధర్మము
చేర్చె గౌరవ మంతటన్
రాదొకండిల సాటి భారత రమ్యభూమికి మిత్రమా! 37.
మ.కో.
హైందవేయులు మహ్మదీయులు నంత క్రైస్తవ సిక్కులున్
సుందరాశయు లైన జైనులు శుద్ధభావులు బౌద్ధు లె
ప్డంద రిచ్చట నన్నదమ్ములు హర్షసంయుతు లారయన్
వందనీయసుమందిరంబిది భారతావని మిత్రమా! 38.
మ.కో.
కర్మభూమిగ నెల్లవారల కాంక్ష దీర్చెడి భారతిన్
దుర్మదాంధులు కొంద రారయ దుష్టభావను లౌచు స
ద్ధర్మదీప్తిని గాంచకుండెడి దానిగా నొనరించుచున్
నిర్మితాతులహాని నెల్లెడ నిల్పుచుండిరి మిత్రమా! 39.
ఉత్సాహము.
జన్మభూమి నన్నిచోట్ల సన్నుతించుచుండుటే
మన్మనోగతాశయంబు మాన్యకార్య మంచు దా
సన్మతిన్ వహించి యుండు సాధుమూర్తి కన్నిటన్
తన్మయత్వ మందుచుండు తప్పకుండ మిత్రమా! 40.
ఉత్సాహము.
అనృత మెప్పు డాడువాడు, నఘసమూహ
మాత్మలో
ఘనతరంబు గాగ నిల్పి కదలుచుండు వాడు స
జ్జనుల గాంచి గేలిసేయ సాగుచుండు వాడిలన్
కనగలేడు మంగళమ్ము కాంక్షలందు మిత్రమా! 41.
చం.
అకలుషవాయువీచికలు, నత్యతినిర్మలసజ్జలంబులున్,
బ్రకటితదాతృభావలగు భవ్యమహీరుహరాజి,
సౌఖ్యముల్
సకలజగంబువారలకు సన్మతి నిచ్చుచునుండు పచ్చికల్
ప్రకృతి యొసంగు కానుకలు వానిని భావ్యమె కూల్చ మిత్రమా! 42.
చం.
తనదుకులంబు, భాషయును, ధర్మము, సంస్కృతి
వేషభూషలున్
జనునకు మాన్యముల్ నిజము సర్వవిధంబుల నంతె కాని భా
వనముననైన నన్యులను వారికి చెందినవాని నిందలన్
గొనకొని చేయుచుండుటది కూడదు లోకమునందు మిత్రమా! 43.
చం.
సలిలసమీరముల్ నభము సర్వజగత్స్థిత వస్తుజాలమున్
తలపులు వాక్కులున్ బనులు తత్ఫలసిద్ధికరప్రయత్నముల్
కలుషపరంపరాస్థితిని గైకొను స్థానములయ్యె నేడు నీ
యిలపయి పావనత్వమది యేడ గనంబడు నోయి మిత్రమా! 44.
మ.
తనధర్మం బది యేమియో ధరణిపై తానెందు కేరీతిగా
మనుచున్నాడొ గ్రహించలేని స్థితి క్రమ్మన్ నేడు సంస్కారముల్
గొనలేకుండెను మానవుం డకట సంకోచింప డన్యంబులే
యనిశం బంద కలిప్రభావమొ, విశాలాజ్ఞానమో
మిత్రమా! 45.
మ.
ఇది నాదేశపతాక మిందు గనగా నింపారు మువ్వన్నెలున్
బదిలంబై వెలుగొందు భారతశుభస్వాంతమ్ము లోకమ్మునన్
ముద మందించగ దెల్పుచుండు సతతంబున్ యోగ్యభావమ్ముతో
మది నిద్దానికి గూర్చెదన్ బ్రణతి సమ్యగ్రీతి నోమిత్రమా! 46.
శా.
స్వాతంత్ర్యంబు ఘటింపజేయు కొరకై సర్వార్థసంపత్తులన్
ప్రీతిన్ వీడి తృణానురూపములుగా విస్తారకష్టంబులన్
చేతోమోద మటంచు నోర్చి యమలస్వీయాసువుల్ బాసి సు
ఖ్యాతిన్ బొందిన వీరులన్ దలతు సంస్కారాఢ్యులన్
మిత్రమా! 47.
ఉ.
ఎందరొ త్యాగమూర్తులు వరేచ్ఛను దాల్చుచు భారతావనీ
నందను లౌట భాగ్యముగ నమ్ముచు మాతకు దాస్యముక్తికై
నిందలు తీవ్ర కష్టములు నిచ్చలు నోర్చిరి సుందరాత్ములా
యందరికిన్ ప్రణామముల నందగ జేసెద నెప్డు మిత్రమా! 48.
చం.
అతులితనిష్ఠ జూపి సత మచ్యుతునిన్ గిరిజాధినాథునిన్
క్షితిపయి గొల్చుచుండెదరు కేవలభక్తులమంచు కొందరా
స్తుతమతు లెంచలేరె దయ జూపక కావక దీనకోటులన్
వెతలు తొలంగవం చెపుడు వేల్పులు మెచ్చ రటంచు మిత్రమా! 49.
చం.
వరమగు కర్మభూమిపయి భాగ్యవశంబున జన్మమెత్తి సు
స్థిరతరధర్మసంపదకు, శ్రీకరసంస్కృతి,కార్షశక్తికిన్
సరియగు వారసత్వమున సాగుచు నుండియు నీతిదూరులై
నరులు చరించుచుండు టిట న్యాయమె, సవ్యపథంబె
మిత్రమా. 50.
ఉ.
దానము చేయబోవుట లుదారత జూపుచు బల్కరించుటల్
దీనులపాలి బంధువుగ దెల్పుచు నిత్యము సంచరించుటల్
జ్ఞానము గూర్తునం చనుచు జాతురితోడను మాటలాడు నా
వైనములందు కొందరికి స్వార్థమె నిండెను నేడు మిత్రమా! 51.
చం.
తనమదిలోన లోకమును దన్మయతన్ దనబంధువర్గమం
చనయము విశ్వసించుచును హర్షితమానసుడైనవాని నీ
మనుజులు నేటికాలమున మైకము గ్రమ్మిన మూర్ఖుడందు రే
మనవలె వీరి మానసమహత్తరరుగ్మత జూచి మిత్రమా! 52.
చం.
అతులితమైన నమ్రతయు, నన్నిట
శ్రద్ధనుదాల్చి జ్ఞానమున్
సతతము పొందు కాంక్షయును, సత్యపథంబున
సంచరించుచున్
నుతిగొను దక్షతల్ గురుమనోహరసత్కృతిచేత గాంచుటల్
క్షితిపయి ఛాత్రసంతతికి క్షేమకరంబులు నమ్ము మిత్రమా! 53.
మ.
గురుశుశ్రూష మహత్ప్రభావయుతమై కూడంగజేయున్ సదా
పరమానందము, జ్ఞానసంపద, మహద్భాగ్యంబు, సత్కీర్తి
సు
స్థిరతాదీప్తియు ఛాత్రకోటికి శుభశ్రేయంబు లేవేళనన్
వరభావంబున శిష్యులుండ జయముల్ ప్రాప్తిల్లు నో మిత్రమా! 54.
చం.
కులమతవర్గముల్ భువిని గూడవటంచును సత్వయుక్తులై
పలుకుచు వేదికాస్థలి నవారితవిజ్ఞత చూపుచుండు వా
రలఘుతరప్రభావమున నన్నిట భేదము మానసంబునన్
దలచుట సాధుకార్యమని తాము భ్రమింతురు నేడు మిత్రమా! 55.
చం.
కనులను మూసి వస్తువుల గాంచ నటంచును మానసంబునం
దనుపమదీప్తితో వెలుగు నాభగవానునిపైన ధ్యానమున్
గొనకొని నిల్పబూనుతరి కోట్లుగ చిత్తమునందు యోచనల్
గనబడి లాగుచుండుటకు కారణ మా కలి యౌనె మిత్రమా! 56.
ఉ.
సుందరభావజాలమును శుద్ధమనంబున జూపునట్టి యీ
హైందవధర్మతుల్యమగు నట్టి దొకండిల లేదు దీనినిన్
పొందియు వారసత్వమున పూజ్యత గాంచక యన్యధర్మ మిం
దందెడి రీతి మూర్ఖత మహాపద గూర్చెడి దౌను మిత్రమా! 57.
చం.
సదయులతోడ స్నేహమును,
సన్నుతవర్తనులైనవారితో
ముదమును గాంచ గూడుటయు,
పుణ్యజనావళితోడ నిచ్చలున్
బదిలముగాగ బల్కుటయు,
భాగ్యదమై విలసిల్లు సత్యమున్
సదమలరీతి నాడుట యశస్కరముల్ పరికింప మిత్రమా! 58.
మ.
ఎవడేవేళ బరోపకారరతుడై యింపారుభావమ్ముతో
స్తవనీయాచ్ఛమనఃప్రకాశయుతుడై సాగున్ సదా వాని కీ
యవనిన్ సౌఖ్యములందు నిస్తులగతిన్ యత్నంబు లన్నింటిలో
నవచైతన్యము గూడు
సత్ఫలములున్ బ్రాప్తించు నో మిత్రమా! 59.
ఉ.
సంపద పంచకుండినను సాధుమనంబున నాదరోక్తులన్
సొంపుగ బల్కి కష్టముల చొప్పు హరించెడి రీతి మిత్రులన్
పెంపును గాంచ జేయుటయు విస్తృత సత్కృతి యౌను వానికిన్
నింపు శుభాశయంబులను నిచ్చలు దైవము జేరి మిత్రమా! 60.
ఉ.
వేదములున్ బురాణములు విస్తృతశాస్త్రసుకావ్యరాజముల్
నాదమయోన్నతాఖిలజనప్రభు, వత్సలు
లోకనాథునిన్
మోదము గూర్చు దైవమును ఫుల్లదయాకరు దెల్పుచుండగా
నాది మహోన్నతత్వమని నమ్మును వెఱ్ఱినరుండు మిత్రమా! 61.
చం.
అనిశము శుద్ధభావమున నాయతదీక్షను బూని యెల్లెడన్
ఘనతరకష్టపంక్తుల ముఖంబున జేరెడి వారికోసమై
తనధనశక్తులన్నిటిని దానము చేయగలట్టివానికే
జననుతి జన్మధన్యతయు సత్యముగా సమకూరు మిత్రమా! 62.
చం.
తనయుదరంబులో ధనము ధాన్యము భూషణసంచయంబు తా
మనయము చేరుచుండుట
యనంతసుఖప్రదమంచు నెంచుచున్
ఘనతరమైన స్వార్థమున కన్నులుగానక సంచరించువా
డనుదిన దుఃఖసంతతుల నందక తప్పదుగాక మిత్రమా! 63.
ఉ.
అందనిదానికై సతత మఱ్ఱులు చాచక కూడినంత యా
నందముతోడ చేకొనుచు నమ్మక ముంచుచు దైవశక్తిపై
చంద మెరింగి దీనులకు సాయముచేసెడి వాడు దీప్తికిన్
మందిరమై వెలుంగుచును మంగళముల్ గన గల్గు మిత్రమా! 64.
ఉ.
దైవము రాతిబొమ్మ కద తాను కనంగలడే జగమ్ములన్
నావిధ మెట్టులుండినను నాకగు హాని యదేమిలేదు నా
భావము నెవ్వడెంచగలవాడని
క్రౌర్యము జూపు వానికిన్
కావరమేదు నాహరుడు కానగ
మూడవ కంట మిత్రమా! 65.
ఉ.
అందరికంటె దానొకడె యద్భుతవిజ్ఞత నొప్పిదంబుగా
నందినవానిగా మనుజు డాత్మమహత్వము నెంచుచుండి దై
నందినచర్యగా దలచు నైజమతంబును నిల్పు టెల్లెడన్
నిందలుచేయు నన్యులను నిత్యము గర్వితుడౌచు మిత్రమా! 66.
మ.
అపచారంబు ఘటింపజేసి విపులాహంకార సంయుక్తుడై
విపరీతోక్తులు బల్కి దైవబలమున్ ద్వేషించు నజ్ఞాని తత్
కృపలేకుండిన వేళ దాను మనునే? క్షీణించ కీనేలపై
నెప మీరీతిగ జేయు శక్తి గనునే నిత్యంబుగా మిత్రమా! 67.
మ.
ధనసంపాదన జీవనాశయముగా దానెంచి యీమానవుం
డనయంబున్ జరియించు,
గోట్లు గొనినన్ హర్షంబు భావించ డే
మనగానౌను తదీయసంపదలతో నచ్చోట నాలోకమం
దున సౌఖ్యంబు ఘటించునే పరమునందున్ నిల్వ నో మిత్రమా! 68.
చం.
ఇది కలికాల మీభువి నహీనబలంబున సాటివారలన్
వదలక నిత్యకష్టముల పాలికి
ద్రోయుట, కర్కశంబులౌ
పదములతోడ స్వాంతము లపారముగా విలపించునట్లుగన్
మదమును జూపుచుండుటలు మాన్యము లయ్యెను జూడ మిత్రమా!. 69.
మ.
స్థిరచిత్తంబున దేవదేవుని హరిన్ శ్రీకంఠునిన్ గొల్చుచున్
పరమానందము నొందుచుండి బహుళవ్యాపారముల్ మానగా
నురుయత్నంబును చేయుచున్నను మనం బొక్కింతయుం గూడ దే
కరణిన్ దీనిని నిల్ప గల్గుటయొ వక్రవ్యాప్త నో మిత్రమా! 70.
చం.
అనుపమరీతి ఛాత్రగణ మచ్ఛయశస్సుల నందుచుండుటే
తన విజయంబుగా దలచి తన్మయతన్ బులకించిపోవుచున్
ఘనతరమైన దక్షిణయగా మనమందున నెంచుచుండు పా
వనచరితుండు నొజ్జయన భక్తిగ నాగురు గొల్తు మిత్రమా! 71.
మ.
తనధర్మంబును గౌరవించుచు
సుహృద్భావంబుతోనుండి స
జ్జనమాన్యత్వము గాంచుచుండిన నరుల్ సర్వప్రయత్నంబునన్
విను డీతండొక జాతివాది యితనిన్ విస్తారమౌఢ్యంబు తా
కనుగప్పెంగద యండ్రు నేడిచటి సంస్కారోన్నతుల్ మిత్రమా! 72.
ఉ.
జీవనసౌఖ్య మీభువిని జెప్పగ నొక్క క్షణంబులోపలన్
చేవను గోలుపోవు నది క్షీణత నంది నశించు సత్యమం
చావిధి తానెరింగియు నహర్నిశ లాయతమత్సరంబుతో
చేవను జూపు మానవుని చేష్టలు చిత్రము చూడ మిత్రమా! 73.
ఉ.
ఒక్కడు తిండి లేక క్షుధ నోర్వగ లేక మహోగ్రబాధకున్
జిక్కగ నొక్క డీభువిని శ్రీలకు నాథునిగా జెలంగుచున్
మిక్కిలి సంతసంబుల సమీకరణంబుల దేలుచుండు నా
దిక్కయి బ్రోచువాని పనితీరును బోల్చగలేము మిత్రమా! 74.
చం.
పురహితకార్య మెంచుకొని ఫుల్లమనంబున లోకదీప్తికై
నిరతము సంచరించగల నిర్మలభావులు భూసురాళి యా
పరమమనోహరాకృతుల బావనకీర్తుల దర్శనమ్ముచే
నరయగనౌను మంగళము లన్నిట నీభువిలోన మిత్రమా! 75.
చం.
అనృతము లాడలేడు, మహదాశయముల్ విడనాడబోడు, తా
ననయము దీనకోటులకు హర్షదసన్నుతసాధుకృత్యముల్
గొనుటకు నీరసించ డిక కోవిదులై విలసిల్లువారికిన్
వినమితుడౌట వీడ డొక విజ్ఞత
కల్గినవాడు మిత్రమా! 76.
చం.
యువజను లీసమాజమున నొప్పిది యంచు మహోత్సవంబుగా
జవమున వింతపోకడల సంద్రమునందున మున్గితేలుచున్
వివిధవినూత్నచేష్టలకు వేదికలై చరియించుచుండి రీ
యవనిని దీని మార్చగల యట్టి సమర్ధులు లేరె మిత్రమా! 77.
చం.
పలుకులలోన మార్దవము,
భావమునందున నిర్మలత్వమున్,
చలనమునన్ ఋజుత్వమును,
సత్కృతులందున ధైర్యదీప్తియున్,
కలిమిని బంచిపెట్టగల కాంక్ష,
సమాజ హితైకదీక్షయున్
వలయును ధాత్రిపై మనెడి వారికి ధన్యతగాంచ మిత్రమా! 78.
ఉ.
ఎవ్వడు మాతృభాషపయి ఎల్లవిధంబుల ప్రేమజూపునో
యెవ్వడు మాతృభూమికయి యీశ్వరసత్కృప పొందగల్గునో
యెవ్వడు జన్మదాతలకు నింపగురీతిని సేవచేయునో
యవ్వరభావు జేరు సత మాయతసద్యశ మెంచి మిత్రమా! 79.
ఉ.
తాను వచించు వాక్యములె తథ్యము,
లట్లె స్వకీయకార్యముల్
మానితసత్కృతుల్,
శ్రుతిసమానము వర్తనమంచు నెంచి యీ
మానవు డెల్లెడన్ తనకు మాన్యత గోరు,
బుధోత్తమాళినిన్
గాన డహంకరించుచు వికారము చూపుచునుండు మిత్రమా! 80.
మ.
భవమోహంబును వీడినాడను మహద్వాంఛాపరిత్యాగమున్
స్తవనీయంబుగ జేసినాడ ననుచున్ సన్న్యాసి వేషమ్ముతో
నవనిన్ సాగుచు నందుచుండు సుఖముల్ వ్యాపారముల్ సేయు మా
నవు డీకాలమునందు దైవ మతనిన్ మన్నించునా మిత్రమా! 81.
చం.
కవివర, సత్కవీశ్వర, ప్రకాండమహత్కవిసార్వభౌమ, సం
స్తవశుభవాక్యశోభిత, లసన్నవసన్నుతకీర్తిపూర
యం
చవిరళమైన దీర్ఘ బిరుదాదిక మీజగమందు నేడు సం
భవములు కొట్లలోనగల వస్తువు లట్టుల నమ్ము మిత్రమా! 82.
శా.
వ్యాపారస్థలులైన వౌర కనగా భక్త్యాశ్రయస్థానముల్
ప్రాపున్ జూపుచునున్న వన్నిగతులన్ స్వార్ధైకభావాలకున్
శ్రీపత్యాదులదర్శనార్చనవిధుల్ చేకూరు మార్గమ్ములన్
జూపన్ దప్పకపోవుచుండె సిరులన్ నొవ్వంగ నో మిత్రమా! 83.
చం.
ధరణిని జన్మమందుటయు, తత్క్రమమందున
వృద్ధిచెందుటల్,
వరసుఖసంతతుల్ గనుట, వైభవదీప్తులు
గాంచుచుండుటల్
నరునకు దైవదత్తములు నమ్మక దీని నహంకరించుచున్
మురియుట నాబలం బనుట మూర్ఖత కాక మరేమి మిత్రమా! 84.
చం.
ప్రకృతిని గాంచ మోదమగు భాగ్యదవృక్షసమూహసంతతుల్
సకలమునందు నందమును చక్కగ నిల్పు ప్రసూనరాజియున్
ప్రకటితసుందరత్వమున రమ్యములై యలరించు నాలతా
నికరము లొప్పుమీర నిల నిత్యము శోభిలుచుండు మిత్రమా! 85.
చం.
కోరకయే నిరంతరము కూరిమి జూపక కూల్చువారికిన్
తీరగు సత్ఫలంబు లడి తియ్యదనంబును బంచుచుండి సం
స్కారమునేర్పు భూజములు,
సర్వహితంకరగోసమూహముల్
పౌరజనాళికిన్ సుఖము పంచెడి దైవము లెంచ మిత్రమా! 86.
ఉ.
హిందువునంచు చెప్పుకొను టిచ్చట నే డపరాధమయ్యె నే
మందుము ధర్మకార్యముల నడ్డుట, దైవపుటున్కి
లోకమం
దెందని ప్రశ్నసేయుటయు, నీశ్వర సేవకు
సేయు యత్నమున్
నిందకు ద్రోయుచుండుటయు నిత్యములయ్యె నిదేమి మిత్రమా! 87.
చం.
ఫలములలోని మాధురియు,
పత్రములందలి పావనత్వమున్,
జలములలోని స్వాదుతయు, సౌరభదీప్తి
లతాంతసంతతిన్
కొలనులలోని యందమును, కోమలతల్
వరపల్లవంబులన్
దలచిన మానసం బలరు తన్మయతల్ ఘటియించు మిత్రమా! 88.
మ.
మహనీయుండనువాని దేవగణముల్ మన్నించి నాకమ్ములో
మహిమల్ గూర్చి ధరాతలంబునకు సమ్మానప్రభాభారమున్
వహియింపంగను బంప రెప్పుడును సవ్యంబైనమార్గంబునన్
మహదానందదకార్యముల్ సలుపగా మాన్యుండగున్ మిత్రమా! 89.
ఉ.
ఎంతయొ శాస్త్రసంపద, యహీనతపోగతశక్తియుక్తులున్,
సంతతభక్తిభావమును, సర్వజనోపరినాయకత్వమున్,
చింతలులేని సౌఖ్యమిడు శ్రీలును, శౌర్యము లున్ననేమి తా
నంతము గాంచు మానవు డహంబున మున్గిన వేళ మిత్రమా! 90.
శా.
ముక్తిం గూర్చెడి తీర్థరాజి యనుచున్ మోక్షార్థులై మానవుల్
భక్తిందాల్చుచు క్షేత్రదర్శనమహద్వ్యాసంగులై నిచ్చలున్
శక్తిం బొందుచు
బుణ్యదేశములకున్ సాగింతు రయ్యాత్రలన్
త్యక్తేచ్ఛాఘనసంగహీనుల కదౌనా సాధ్య మో మిత్రమా! 91.
చం.
పలికినదెల్ల వేదమగు,
భవ్యమనోహరసాధుకార్యమై
నిలుచు మహాధ్వరంబుగతి నిక్కముగా గొనునట్టి కృత్యమున్
తలపున సర్వమంగళను తన్మయతన్ స్మరియించుచుండి యా
యలికసునేత్రు గొల్చు మహదాత్మున కీయిలలోన మిత్రమా! 92.
మ.
తనసంతానము సభ్యతాగరిమతో ధాత్రిన్ మహద్దీప్తులన్
ఘనతన్ గాంచగ గోరువాడు సిరులన్ నానాప్రకారంబుగా
గనుమమంచున్ సమకూర్చుటౌనె విధి? సంస్కారమ్ము
నిత్యమ్ముగా
మనుజత్వార్థము గాంచ బంచవలయున్ మన్నించుచున్ మిత్రమా! 93.
ఉ.
దేహ మశాశ్వతంబు కద, దీనిని
మెచ్చి యలంకరించుచున్
మోహము జూపుచున్ సతము మోదపుటబ్ధిని మున్గుచుండి 'దా
సోహ'మటంచు నిల్చుటది యొప్పునె? శాశ్వతమోక్షదాతయౌ
యాహరినిన్ దలంచుటయెయౌ నుచితం బిహమందు మిత్రమా! 94.
చం.
అకలుషభావజాలమున నందెడి సౌఖ్యము లంతులేనివై
ప్రకటము చేయు నెల్లెడల భవ్య జయంబును,
సాధుయోగ్యతా
నికరము, నంత గూడు
మహనీయత కావున మానవాళిలో
సకలహితానురక్తియును,
సన్నుతభావన లొప్పు మిత్రమా! 95.
చం.
అగణితమైన ఛందముల నద్భుతపద్యసుకావ్యరాజముల్,
సుగమములైన భావముల శోభిలు గద్యమనోహరత్వముల్,
నిగమసమానసత్కథలు, నిస్తులగేయగతానురాగముల్
భగవదనంతతన్ దెలుగుభాషకు జూపినవోయి మిత్రమా! 96.
ఉ.
మాయ యొకింతయుండ, దిక మాటలు చూడగ తేనెలట్టు లా
ప్యాయతనింపు మానసములందున, చీకులు చింత లన్నచో
నేయవియో యెరుంగ మియు, నించుక యేనియు
భేదభావముల్
ఛాయలకైన రావుగద సత్యము బాల్యమునందు మిత్రమా! 97.
శా.
నాపూజల్ ఫలియించి యీశ్వరుడు నన్మన్నించి నాముందటన్
జూపట్టన్ బ్రణుతించి
ముక్తికొరకై శుద్ధాంతరంగమ్ముతో
నోపాపాపహ! యంచు వేడెదను కాదోరీ యనంగా శివా!
యీపృథ్విన్ భదీయసేవను సదా యిమ్మందు నోమిత్రమా! 98.
చం.
అవనిని జీవహింస విపులాఘదమంచును జెప్పుచుందు రీ
నవయుగమమందు మానవు డనారత మెన్నియొ ప్రాణికోటులన్
జవమున జంపు, భక్షణకు
జాలిన దేమియు లేనిరీతిగా నీ
భవమున వానికంటదొకొ పాపము చిత్ర మిదేమి మిత్రమా! 99.
చం.
పరిపరివృష్టిపాత మొక ప్రక్కన నేరులు బారజేయుచున్
వరదలముంచ, వేరొకట
వానలులేక మహోగ్రతాపముల్
నిరతము
బాధపెట్టుటలు నిత్యము లయ్యె నధర్మవృద్ధి కీ
ధరను నిదర్శనం బిదియె తథ్యముగా ననిపించు మిత్రమా! 100.
ఉ.
ఒక్కని కష్టపంక్తులకు నొక్కడు బాధ్యుడుగాడు, పూర్వమం
దిక్కడ నెక్కడైన బను లేగతి జేసిన నేరికేనియున్
జిక్కక యున్న దైవమది క్షిప్రమె కాంచడె వాని కిప్పు డీ
దిక్కున లెక్క జూడకయె తెల్పునె సౌఖ్యము గాంచ మిత్రమా! 101.
శా.
ఈనా డిమ్మహి బంధుమిత్రులయి తా మెన్నేని నిమ్నోన్నతుల్
నానారీతుల గూర్చువారి కిచటన్ బాంధవ్య మేనాటిదో
జ్ఞానిశ్రేణులకైన దాని నెరుగన్ సాధ్యంబె మన్నించుచున్
వానిన్ జేకొనుటే శుభప్రదమగున్ భావించ నోమిత్రమా! 102.
చం.
మనుజుడు సంఘజీవి కద,
మానక సభ్యత సాధువర్తనం
బనయము తోటివారలకు నన్నివిధంబుల సద్ధితైషియై
మనుటయె యొప్పు నట్లయిన మాన్యత గాంచును, బంధుమిత్రులై
తనకడ కేగుదెంచెదరు తారె సమాజమువారు మిత్రమా! 103.
చం.
ఒకనిని దిట్టి యెల్లెడల నున్నతకీర్తిని బొందగోరు దా
నొకరుడు వానివర్తనల నుల్లమునంగల భావజాలమున్
సకలజగంబువారలును సర్వవిధంబుల నెంచలేరె? తా
నకలుషమానసుం డగునె యాగతి నాడుటచేత మిత్రమా! 104.
మ.
మడులన్ గట్టితి మంటబోకు డనుచున్ మాన్యత్వమున్ దల్చుచున్
గుడులందున్ గృహసీమలందు నలఘుల్ కోపంబు జూపింతు రే
యెడలన్ పెద్దలు చెప్పగావలయు తామీభావ ముల్లమ్ముకో
యొడలం గప్పిన వస్త్రసంఘమునకో యుర్విన్ గనన్ మిత్రమా! 105.
మ.
సత మాహారముపెట్టువానికి కృతజ్ఞత్వంబు చూపించుచున్
క్షితి సంచారము చేయు జంతువితతుల్ చేతఃప్రకాశమ్ముతో,
నతులాహంకృతి జూపు మానవు డసహ్యంబౌ కృతఘ్నత్వమున్
వ్రత మన్నట్టుల దెల్పుచుండెడి నసద్భావమ్ముతో మిత్రమా! 106.
మ.
అరిషడ్వర్గము నాత్మసంస్థితము నత్యంతావివేకమ్ముతో
నరయంజాలక వానికిన్
వశుడగున్ హా! మానవుం డీయెడన్
పరులం దెంచును శత్రుతన్ కటకటా భావింప డన్నింటికిన్
గురు తీవర్గమె యంచు నిత్యమిచటన్ మోహమ్మునన్ మిత్రమా! 107.
ఉ.
విద్యయు వైద్యమున్ జగతి విస్తృతదీప్తికి కారణంబులై
అద్యతనోన్నతత్వముల నాయతసౌఖ్యము లందజేయుచున్
సద్యశ మందుకోదగిన శక్తిని గూర్చుచునుండు నేడిటన్
వేద్యము లైన వవ్వి యవినీతికిస్థానములంచు మిత్రమా! 108.
ఉ.
పాలకు లన్నవారు శుభభావము నిండిన మానసమ్ముతో
తాలిమితోడ నుండవలె, ధైర్యము నూనుచు సాగుచుండి యే
వేళను ధర్మమార్గమును వీడక యించుక పక్షపాతమున్
వాలగనీక నిల్వవలె పౌరులు మెచ్చెడిరీతి మిత్రమా! 109.
చం.
అతులితభక్తిభావమున నాహనుమానుని, దానమందునన్
వ్రతధరు గర్ణనామకుని, పౌరుషశౌర్యములందు
నర్జునున్,
క్షితిపయి ధర్మవర్తనకు శ్రీరఘురాముని మానవుండు సం
తతమును స్వీకరించవలె తత్తదుదాత్తత లంద మిత్రమా! 110.
చం.
“జననియు,
జన్మభూమియును స్వర్గము కన్నను మిన్న”యంచు నా
మునివరు డాడె మానవుడు పొందగ ధన్యత వారిసేవచే,
మనుజులలోన నెందరిది మన్ననచేసి చరించుచుండిరో
యనిశము విత్తకాంక్షులయి యార్జనలోన మునింగి మిత్రమా! 111.
మ.
ఇతిహాసంబు లెరుంగ బోవడు గదా యింపౌ పురాణంబులన్
శ్రుతులన్ గావ్యములన్ మహత్సుకథలన్ సూక్తిప్రకాశమ్ములన్
మతిమంతుల్ వినిపింప నించుకయినన్ మన్నించి తానందగా
నిత డీ యాధునికుండు చూడడు కదా యేవేళ నోమిత్రమా! 112.
మ.
శతపద్యంబులు చెప్పబూనితి నిటుల్ సమ్యగ్విధానమ్ములన్
మతికిం దోచినవాని లోకమునకున్ మానాథునిన్ శంకరున్
నుతులన్నిల్పుచు వారిసత్కరుణతో నూత్నేచ్ఛతో నీయెడన్
వ్రతమం చెంచగ బూర్తి యయ్యె నివినాభాగ్యమ్మునన్ మిత్రమా! 113.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి