Tuesday, 9 November 2021

భారతభూమి

 

భారతభూమి

(అష్టోత్తరశతపాదాత్మకోత్పలమాలిక)

 

శ్రీరమ నిత్యవాసమును జేయుచునుండెడి దేశరాజ మీ

భారతభూమి సత్యమిది పావనతన్ దన భాగ్యరాశిగా

దోరపు సంతసంబు మది దోపగ దాల్చిన దివ్యసీమ స

త్కారపు టర్హతన్ బహువిధంబుల విశ్వమునం దనాదిగా

గూరిమి బంచుచున్ దనకు గూడెడు పుణ్యము చేసికొన్న దా

శౌరికి, దేవరాజికిని స్థానముగా వెలుగొందు చుండి సం

స్కారము, శీలసంపదల చక్కని చోటుగ ఖ్యాతిగన్న, దా

ధారముగా వెలింగినది దానగుణంబున కెల్లవేళలన్,

మేరలులేని ధైర్యమున మీరిన దన్నిట నన్నిచోటులన్

నీరజపత్రనేత్రలకు, నిష్ఠ జరించెడి సజ్జనాళికిన్,

ధీరుల, కార్యవర్యులకు, దీనుల గాచు మహాత్మకోటికిన్

శూరులకున్, విధేయులకు, సూనృతవర్తననుండువారికిన్,

బౌరుషపూర్ణులై యతులవైభవమందిన దీప్తిమంతులౌ

వారికి పుట్టినిల్లు శుభ భావము నిండిన వేదభూమియై

వైరులకైన సత్కృతులవారితరీతిని జేయుచుండు, తా

నేరికినైన గాని కలహించుచు గీడొనరించ బూన ది

వ్వారలు బాంధవుల్ హితులు, వారలు శత్రు గణంబులంచు నె

వ్వారిని భేదభావమున బల్కగ జూడ దనేకతాస్థితుల్

మీరిన నైకమత్యమును మేదినిపై బ్రకటింపజేయు దా

నారయ భారతావనికి నందున నిందున నెందునైన నే

ధారుణి యైన తుల్యమయి తా నగుపించదు శ్వేత జాతులన్

గోరికదీర బొండనుచు గూళలనున్ గని శాంతమూర్తియై

దూరక హింస గైకొనక తొల్గగ జేసిన ధర్మరూప, దు

ర్వారమహోగ్రరుగ్మతల ప్రాభవమున్ దన యుక్తిచేత ని

స్సారము చేయగల్గిన స్వశక్తిని నమ్మిన యోగ్యభూమియై

పేరుకు దగ్గ రీతి నిట విస్తృత దీప్తుల నెల్ల వేళలన్

గోరక యంద జేయుచును, గోపమెరుంగక చేరదీయుచున్

జీరుచు వత్సలత్వమున శ్రేయము లందరు పొందునట్లుగా

వేరొక టాత్మ నెంచకయె విజ్ఞత దెల్పుచు నుండునట్టిదీ

భారతమాత నిచ్చలును బాడికి, బంటకు దాను వాసమై

పేరు గడించి యుండినది వేదచతుష్టయమున్, బురాణముల్,

సౌరులు చిమ్ము కావ్యములు, శాస్త్ర సమూహము, లాదరార్హమౌ

తీరును లోకమంతటికి దెల్పుచునుండ, మమత్వ గంధముల్

చేరగ బంపు దిక్కులకు, శ్రేష్ఠములై వెలుగొందు బంధముల్,

గౌరవమందజేసి, శుభ కామనలన్ సమకూర్చుచుండి సం

సారము లోని మాధురిని సన్నుత రీతిని జూపుచుండు నా

భారత గోత్ర యెల్లెడల భవ్యభవంబున కైన యోగ్యతల్,

కారణముల్ దురుద్ధతులు కల్గుటకున్ విశదంబుచేసి స

త్తారకపద్ధతుల్ దెలుపు, దైవము తోడను బ్రేమబంధముల్

దారయి దాల్చు వారలకు దారులు నేర్పును, పాపమందునన్

గూరుకు పోయి మానవుడు కుందుచు నుండిన నుద్ధరింపగా

గోరుచు సద్ధితం బెపుడు క్రోధము చూపక తెల్పుచుండు నా

భారత ధర్మముల్, గతులు భాగ్యదముల్, సుఖదంబు లీయెడన్

నీరము, నిప్పు, వాయువులు, నేలయు, నింగియు, వృక్షసంతతుల్,

క్రూర మృగాదులున్, బహుళ రూపము లందిన జంతుజాలముల్,

చారుతరంబులౌ గిరులు, సంద్రములున్, నదులున్ సమస్తమున్

బ్రేరణ నిచ్చు దైవపదవిన్ గొని నట్టివి, యేదియైన నీ

భారతమందు గన్పడిన భాసిలు చూడగ నన్యభూమిలో

జేరగ బోవ వేవియు విశేషము లీభువి పైనలేనిచో

వీరత కాశ్రయం బగుచు వేల్పులకైన జయంబు గూర్చగా

పారము లేని దక్షతను భాసిల జేసిన చక్రవర్తులన్,

వైరిసమూహభీకరశుభప్రద నిర్మలచిత్త శోభితా

కారుల గన్నభూమి, వరకామ్యద, సౌమ్యగుణప్రభావ, నా

నారుచిరాచ్ఛభావయుత, నవ్య పురాతన సంస్కృతీప్రభా

 

పూరితదివ్యదేహ, రసపూర్ణసుధామయసవ్యవాగ్ఝరీ

సారమహత్వశోభిత, యజస్ర సహస్రసుకర్మ ధర్మ దీ

క్షారత నాదుభారతము, సన్నుతి చేసెద జేలు పల్కుచున్

నారికి నున్నతత్వమును నైజ మతంబుగ నిల్పుచుండు, దా

నీ రమణీయభూమి సతతేచ్ఛను జూపును నమ్రతాస్థితిన్

మీరని రీతి బౌరుల కమేయ బలంబును నింపు కార్యమం,

దోరిమిలోన నీ భువికి నొక్కటి తుల్యముగాదు, సభ్యతా

సౌరభ మెల్లకాలమును సర్వజగంబున నిండునట్లు వి

స్తారమహత్ప్రయత్నమును దానొనరించును, సోదరత్వసం

స్కారముతోడసర్వమత సామ్యత దెల్పుచు, హర్షదీప్తులన్

బౌరులలోన దేశమున భక్తిని బెంచెడి రీతి నిల్పుచున్,

సూరి జనంబులన్ గొలుచు సుస్థిరసద్వ్రత నిష్ఠనందరున్

గారవ మిం దటంచు గొను కాంక్షను బూనుచు బ్రత్యహమ్ము సం

చారము చేయు సత్వమును చక్కగ నింపుచు నుండుచోటు నా

భారత మాస్తికత్వవిభవంబున నున్నతి నంది యున్న దా

మారహరున్ భజించు జనమాన్యుడు మాధవు డీధరాస్థలిన్

మీర నధర్మ మాగతిని మించిన శౌర్యముతోడ ద్రుంచుచున్

గూరిమి తోడ ధర్మమును గూలగ నీయక యుద్ధరింపగా

చారు దశావతారములు సంతస మందుచు దాల్చియుండె, దే

వారులు వేల్పులిచ్చట సుధార్థము గూడిరి పాలసంద్రమున్

గోరిక దీర ద్రచ్చగను, గూలి రధర్మము నందియుండుటన్

గౌరవు లీధరాస్థలిని, గైటభ మర్దను డీస్థలంబునన్

గ్రూరుల ద్రుంచె, స్వాస్త్రమున రుద్రుడు క్రీడి ననుగ్రహించె, వా

ణీరమణుండు నర్థులకు నిత్యవరంబుల నందజేసె, నా

భారతియున్ గవిత్వఝరి పారగ జేసెను, పార్వతీరమల్

పారము లేని హర్షము లవారితరీతిని బంచి రిందు, బృం

దారకబృంద మందరకు దానిట గూర్చును హాయి భారతం

బీ రమణీయతా గరిమ, యీ మహనీయత, లీ శుభాశయ

ప్రేరణ, లీపరాక్రమము, విస్తృతవాగ్విభవాతిరేకముల్

కారణ జన్మయౌ భరత ఖండగురుత్వమహత్వతత్వమున్

జేరగ జేసె నగ్రమున, శ్రేష్ఠతరంబిది మార్గదర్శియం

చారయు చుండె విశ్వ మెపు డాయతకాంక్షల, నిందు జన్మమున్

వారసులౌచు గాంచు శుభభావులు, ధార్మిక సత్వయుక్తులౌ

భారత పౌరు లందరును బాయని దీక్షను మాతృభూమి స

ద్గౌరవ వృద్ధికై సతము కర్మఠులై చరియించగావలెన్

మీరక ధర్మ పద్ధతిని మేలు దలంచుచు నార్యులార! నే

డూరక యుంట కా దుచిత మొప్ప దుపేక్షయు స్వీయధర్మమం

దౌరసబాధ్యతల్ మరువ మంచు ప్రతిజ్ఞల నాత్మసాక్షిగా

ధీరవరుల్ కొనందగును దేశము నందవినీతి కార్యముల్,

నారిని గృంగజేయుటలు, నమ్మిన వారిని మోసగించుటల్,

పోరుట లన్యసంపదలు పొందగగోరుచు, సాధుకర్మలన్

దూరుట, లన్నికోణముల దోరపు స్వార్థము బూనియుండుటల్,

మేరలు లేని దౌష్ట్యములు మిక్కిలి సత్వము నందియున్న, వా

చారములన్ని మారినవి, సన్మతి నేడిట సన్నగిల్లె, సం

స్కారవిహీనతల్ బలిసి సాగుచునున్నవి, కల్మషంబు లే

పారుచు విస్తరించినవి హాస్యము కాదిది యిప్డు నిమ్మకున్

నీరము నెత్తి నట్లుగ మనీషను వాడక చూచుచుండినన్

దోరపు హాని కల్గునిట దుఃఖము గూడు టవశ్యమందు నో

భారత మాతృ పుత్రులగు భాగ్యవిశేషఫలాఢ్యులార! యీ

ధారుణికన్ని రీతులను దన్మయతన్ గలిగించుకృత్యముల్

మారని దీక్ష జేకొనుచు మాన్యత నందగ రండు సచ్చుభం

బీ రఘురామ రాజ్యమున నెల్లవిధంబుల నిండియుండు, సా

కారములౌను స్వప్నములు గ్రన్నన యంచును విశ్వసించు డీ

భారత మాతకత్యతుల వత్సల పూర్ణకు మ్రొక్క నిల్చుచున్.

 

హ. వేం. స. నా. మూర్తి.

09.11.2021