Tuesday, 18 February 2014

అశ్వత్థామ

ద్రౌపది యశ్వత్థామను
పాపివి నీవంచు చూచి బహువిధములుగా
కోపోద్రేకభవంబగు
తాపంబున పలికెనిట్లు తానా వేళన్. 1
.

చిన్నవారల నిద్రనున్నట్టివారలన్
..........సంహరించుట నీకు సముచితంబె?
నీవిరోధులుగారు, నిందింపగా రారు
..........వారి జంపుట కేమి కారణంబు?
గురుపుత్రుడవు నీవు కరుణ యించుక లేక
..........పుత్రతుల్యుల నెట్లు పొడిచినావు?
ద్రోణపుత్రుడవౌచు దురితమిట్లొనరించ
..........చేతులెట్లాడెనో ఆతతాయి?
శస్త్ర ధరులు కారు, సమరంబు నొనరింప
దలచి రమ్మటంచు బిలువబోరు
భద్రమూర్తులౌచు పవళించి యున్నట్టి
వారి జంపి యేమి బడసినావు? 2.


అని ద్రౌపది పలుకంగా
విని, పార్థుని యత్నమరసి వెన్నుం డనియెన్
ఘనతరమగు దురితంబును
చెనటితనంబును వహించి చేసె నితండున్. 4.


క్షమియింపరానట్టి కలుషమీతడు చేసె
..........హంతవ్యు డనుమాన మింతలేదు,
శిశులజంపుట జేసి పశుసమానుండయ్యె
..........బాపడా యీతండు పాపిగాని,
దుర్మార్గుడైన యీ ద్రోణపుత్రుని జంప
..........నుద్యమించుట పార్థ! యుచితమయ్యు
బ్రాహ్మణుండై యుంట ప్రాణాపహరణంబు
..........తగని దీతనిపట్ల దాన నిపుడు
పొగ రణంగు నట్లు తగురీతి యోచించి
వీని పనికి తగినదాని నరసి
రాక్షసాత్ము నితని శిక్షింపవలె గాన
వీరవర్య! యిద్ది వినుము విజయ! 5.


శిరముపైన వెలుగు శ్రేష్ఠమౌరత్నంబు
పెఱకివేసి శిఖను తఱుగు పనియె
అర్హమైన దట్టి యవమానభారంబె
చాలు నితని కిపుడు సవ్యసాచి! 6. 


సిగలో రత్నముఁ దరుగుట
యగునిక సరియైన శిక్ష యర్జున! ద్రౌణిన్
తెగటార్చ వలదు విప్రుం
డగుటను వినుమంచు బలికె నచ్యుతు డపుడున్. 

Monday, 17 February 2014

అమ్మ ఒడి

అమ్మ ఒడి - తొలిబడి
నవ్వు నేర్పును, వేలంది నడక నేర్పు
తినుట నేర్పును, బుద్ధిగ మనుట నేర్పు
అత్త, తాతలు నేర్పు తాననవరతము
తల్లియొడి యది తొలిబడి యెల్లరకును                1.


మమత బంచును, భావాన సమత బెంచు,
మంచి చెడుగులు బోధించు మాట నేర్పు,
తారతమ్యము లెరిగెడి తీరు జూపు
తల్లియొడి యది తొలిబడి యెల్లరకును                2.


కోప మొకయింత యైనను చూపకుండ
ఉగ్గుపాలను పోయుచు నుర్విలోని
సంగతులనన్ని వినిపించి శక్తి గూర్చు
తల్లియొడి యది తొలిబడి యెల్లరకును                3.


కథలరూపాన విశ్వంబు కలియద్రిప్పు
జ్ఞానదాయిని యెల్లెడ తాన యగుచు
పలుకు పలుకున సకలంబు తెలియ జెప్పు
తల్లియొడి యది తొలిబడి యెల్లరకును                4.


అలుక నేర్పును, ప్రేమగా పలుక నేర్పు,
అడుగ నేర్పును, బట్టలు తొడుగ నేర్పు,
రుచులు నేర్పును, శబ్దసంరచన నేర్పు
తల్లియొడి యది తొలిబడి యెల్లరకును               5.


దయయు, సత్యంబు, ధర్మంబు, భయము నేర్పు,
యశము లందుటలో గల్గు హాయి నేర్పు
సర్వవిధముల న్యాయానుసరణ నేర్పు
తల్లియొడి యది తొలిబడి యెల్లరకును              6.

జయ పాండురంగ

ఔరా! భువనావనుడగు
కారుణ్యాత్ముండు ప్రభుడు కమలదళాక్షుం
డీరీతి యాత్మరక్షణ
గోరుచు ఛత్రంబు నందె కూరిమి నిండన్.


మెండుగ వరముల నొసగుచు
ఖండించుచు కల్మషంబు ఘనతరముగ మా
కండగ నన్నిట నిల్తువు
దండం బో పాండురంగ! దయజూపవయా!(ధర్మోద్ధారా)

Saturday, 15 February 2014

మంథర-కైకేయి

శ్రీరామున కారాజ్యపు
భారంబును కట్టబెట్టు భాగ్యమునందున్
ధీరుడు దశరథభూపతి
తోరపు హర్షాతిశయముతో నున్నపుడున్ 1.


చెనటి మంథర కైకను చేరి యిట్లు
పలుకసాగెను క్రోధాన పడతి నీవు
లెమ్ము నిద్రింపగానేల యిమ్మహినిక
కష్టకాలము మున్ముందు కాంచ గలవు. 2.


నాప్రాణనాథుండు నాదైవ మాతండు
..........ప్రేమానురాగాల ధామ మతడు,
సవతులందరిలోన సన్మానమందించి
..........గౌరవించును నన్ను ఘనముగాను,
నామాట జవదాట కామోదమును దెల్పి
..........యేమి కోరినగాని యిచ్చుచుండు,
నేనె సర్వస్వంబు నిక్కమియ్యదియంచు
..........సంతసించెదవేల సన్నుతాంగి!
మూర్ఖురాలవు బేలవై మోదమంద
దగునె? యాతడు నాథుండె? పగతునివిధి
నిన్ను వంచించు చున్నాడు నిజము కనుము
భర్త రూపాన నున్నట్టి వైరి యతడు. 3.


యువరాజపీఠాన నవనీశుడక్కటా!
..........రామచంద్రుని నిల్ప రయముతోడ
ఆదేశములు చేసె నభిషేక కార్యంబు
..........జరుగనున్నది రేపు తరుణి! వినుము
మాయమాటలు చెప్పి మమకారమును జూపు
..........కైకేయి! యాతండు కపటి నిజము
రమణి! భావిని నీకు రాబోవు కష్టముల్
..........తలచి యోర్వగలేని దాన నగుట
హితము కోరుచుండి సతతసౌఖ్యము గూర్చు
తలపుతోడ నేను పలుకుచుంటి
రామచంద్రమూర్తి రాజ్యాభిషేకంబు
జరుగనీయ రాదు సర్వగతుల. 4.


అనుచు మంథర వచియించ నమితముగను
హర్షమందుచు విలువైన హార మొకటి
అందుకొనుమంచు కైకేయి యామె కొసగి
మంచివార్తను తెలిపినావంచు బలికె. 5.


రామచంద్రునికన్న రమణీయగుణుడెవ్వ
..........డతడు పుత్రుడునేను నంబగాదె?
భరతుడెట్టులొ నాకు పావనచరితుడౌ
..........రాముడట్టులె భేదమేమి లేదు,
పరమాత్మతుల్యుడై సరసుడై వెలుగొందు
..........శ్రీరామచంద్రుని సేవలోన
తరియించు భాగ్యంబు భరతుని కబ్బిన
..........ధన్యుడై వెలుగు నా తనయు డవని
నింతకంటెను వేరొక్క టిహమునందు
సౌఖ్యదాయక మగునేమి? సర్వగతుల
రామ పట్టాభిషేకంబు భూమిజనుల
కన్నివేళల శుభకర మనెను కైక. 6.


అని పలికిన కైకేయిం
గని మంథర మూర్ఖురాల! ఘనతాపమునన్
మునుగం దగు సమయంబున
ననుపమమగు రీతి హర్ష మందెదవేలా? 7
.

రాజ్యాధిపతి యౌచు రామంచంద్రుండుండ
..........బంటౌను సర్వదా భరతు డికను
కౌసల్య మాతయై గౌరవంబును పొందు
..........దాసివౌదువు నీవు తథ్యమిద్ది
వర్ణింప దరమౌనె వసుధలో దాస్యాన
..........కలుగబోయెడి తీవ్ర కష్టతతులు?
నీపట్టి రాజైన నిత్యసౌఖ్యము గాంచి
..........హాయినందగవచ్చు ననవరతము
అనుచు మంథర దుష్టయై యామె హృదిని
విషము నింపంగ కైకేయి విస్తృతమగు
క్రోధమును బూని రయమున కోపగృహము
చేరె భర్తను సాధించు కారణమున. 8.

సినీ ప్రముఖులు

రావుత్రయమును(రావులు మువ్వురు) గాంచుడు
ధీవైభవనిధులు భువిని స్థిరయశులగుచున్
జీవనము కళల కర్పణ
గావించిన వారు వీరు ఘనులన్నింటన్. 1.


వరుస నందమూరివంశాబ్ధి చంద్రుండు
యావదాంధ్రభూమి ననుపమమగు
ఖ్యాతి నంది తెలుగుజాతికి జగతిలో
ఘనత గూర్చిపెట్టు కర్మఠుండు. 2.


తారకరామారావను
పేరున నటుడౌచు వెలిగి విపులాదరమున్
గౌరవము గాంచి నాయక
ధీరుండై యవనిఁ దెలుగు తేజము చాటెన్. 3.


రాముడై కృష్ణుడై రణరంగభీముడై
..........సోముడై సన్మునిస్వామి యౌచు,
పౌరుడై వ్యవసాయదారుడై వీరుడై
..........శూరుడై సంగీతకారుడౌచు,
నేతయై భువనాల జేతయై మిత్రుడై
..........త్రాతయై విశ్వవిఖ్యాతుడౌచు,
పేదయై దాతయై విజ్ఞసత్తముడౌచు
..........మోదకారకుడై వినోది యౌచు
ఒక్కటననేల పాత్రలు పెక్కులిట్లు
చిత్రములయందు పోషించి సిరులు గాంచి
ఆంధ్రదేశాన "నటరత్న"మౌచు యశము
లంది యున్నట్టి యాంధ్రుండు నందమూరి. 4.


పౌరాణికములైన చారిత్రకములైన
..........సామాజికములైన సత్యమిద్ది
పాత్రలెట్టివియైన వాటిలో లీనుడై
..........ప్రియముగూర్చెను సదా ప్రేక్షకులకు
వచనమాధురితోడ రుచిరాభినయముతో
..........దేహసౌందర్యంపు దీప్తితోడ
నటనలో మేటియై నవ్యమార్గములంది
..........హర్షమందించువా డక్కినేని
అతడు నాగేశ్వరుండు తానభినయమున
ఘనుడు, "సమ్రాట్టు"గా కీర్తి గాంచినట్టి
నటశిఖామణి సత్కళానైష్ఠికుండు
మాన్యుడౌచును బ్రతికిన ధన్యజీవి. 5.


మధుబిందునిభములై మానసంబులు దోచు
..........నెవ్వాని వచనంబు లెల్లవేళ,
అమృతోపమానమై హాయిగొల్పుచునుండు
..........నెవ్వాని గాన మీ యిలను జూడ,
నిత్యప్రసన్నమై నిర్మలంబై వెల్గు
..........నెవ్వాని ముఖసీమ యింపుమీర,
సన్నుతి కర్హముల్, సద్భావపూర్ణంబు
..........లెవ్వాని కృత్యంబు లెల్లగతుల
అతడు మహనీయచరితుడై యవనిలోన
ననుపమంబైన యశముల నందియున్న
సద్గుణాఢ్యుడు సంగీతచక్రవర్తి
ఘనుడు సుందరహృదయుడు ఘంటసాల. 6.

నోరు తెరచిన సంగీతసౌరభంబు,
పలుకులందున మధువులు చిలుకునట్టి
మధురగాయకు డన్నింట మహితగుణుడు
వేంకటేశ్వరరాయు డా విజ్ఞవరుడు. 7.


నందమూరిని సంతతానందయుతుని,
అక్కినేనిని నాగేశ్వరాఖ్య ఘనుని,
ఘంటసాలను నిత్యమింటింట జనులు
స్మరణ చేయుట సర్వథా సముచితంబు. 8.

Thursday, 13 February 2014

మేడారం జాతర









 
                                                    




సమ్మక్కకు సారక్కకు
సమ్మతముగ గిరిజనాళి శ్రద్ధాన్వితులై
అమ్మా! రక్షణ చేయగ
రమ్మని ప్రణమిల్లు విధము రమ్యం బచటన్. 1.



ఏకశిలానగరంబది
యాకరమై వెలుగుచుండు నాంధ్రావనిలో
శ్రీకరమౌ శిల్పాఢ్యత
కేకాలము తత్సమీప మీమేడరమున్. 2.


కానలలో మేడారము,
మానితముగ నచట జరుగు మహనీయంబౌ
నానందదమగు జాతర
దానిని వర్ణింప దరమె ధరవారలకున్. 3.


గిరిజనులు చేయు జాతర
పురవాసులకైన గాని భోగదమగుటన్
నరసాగర మగుపించును
సురుచిరమగు సంబరంబు చూచుటకొఱకున్. 4.


తెలగాణా సంస్కృతినట
పలురకముల గాంచవచ్చు పరమప్రీతిన్
తులలేని హర్ష మొదవును
నిలిచిన నొకయింతసేపు నిష్ఠాగరిమన్. 5.

నమశ్శివాయ


 
సురగంగ తలను దాల్చెడి
ధరవారల బ్రోచునట్టి దైవము తానా
కరుణామయు డిచ్చోటను
సరసుండై నిలిచియుండె జలమధ్యమునన్. 1.


జలమించుక శిరమందున
చిలికిన పరితుష్టుడౌచు సిరులొసగెడి యా
నెలవంక దాల్చు దేవర
జలమధ్యమునందు నిలిచె సర్వార్థదుడై. 2.


సర్వోన్నతుడై వెలిగెడు
సర్వేశుడు లింగమూర్తి జలసంస్థితుడై
యుర్వీతలమున హర్షము
పర్వంగా నిలిచియుండె పరమప్రీతిన్. 3.

జలమే ప్రాణాధారము,
జలమయ మీ కువలయంబు, జలమంతటికిన్
బల మొసగు ననుటకేమో
జలమధ్యమునందు నిలిచె శంకరు డిచటన్. 4.


లింగాకారా! శర్వా!
మంగళములు కూర్చుకొరకు మనుజుల కిలలో
నంగీకరించి యుంటివి
సంగంబుల ద్రుంచి యిమ్ము సత్పదము శివా! 5.


శివ! శంకర! యభయంకర!
భవబంధము తొలగద్రోచి భక్తజనాలన్
భువిపై కావంగా దగు
నవతేజ మొసంగుచుండి నానాగతులన్. 6.


వందన మార్యాసన్నుత!
వందనమో జగదధీశ! వందనము హరా!
వందనము చంద్రశేఖర!
వందనములు స్వీకరించు ప్రమథాధిపతీ! 7.


నీవే సర్వేశ్వరుడవు,
నీవే మము బ్రోవగలవు నిర్మలమూర్తీ!
కైవల్యద! మృత్యుంజయ!
రావా మముగావ బూని రయమున నేడున్. 8.


క్రమముగా నినుగొల్తు నమకమంత్రాలతో
..........కామితంబులు దీర్చు వామదేవ!
సద్భక్తి గీర్తింతు చమకపాఠముతోడ
..........సంతోష మందించు సర్వగతుల
పురుషసూక్తంబుతో నిరతాభిషేకంబు
..........జరుపుచుండెద నీకు వరములిమ్ము
వేయినామాలతో వినుతింతు నిన్నెంతొ
..........అభయ మందగజేసి విభవమిమ్ము
ఎల్లవేళల నీనామ మేను దలతు,
నిన్నె భావింతు, సేవింతు,సన్నుతింతు
సత్త్వ మందించి సర్వథా సాకుమయ్య
ప్రణతులనుగొని కైలాసవాస! శూలి! 9.


మహితలింగమ వౌచు మానవాళిని బ్రోవ
..........యుర్విపై స్థిరుడవై యున్న నిన్ను
ఆడంబరములేని యల్పసంతోషిగా
..........ఘనమైన సత్కీర్తి గన్న నిన్ను
బిల్వపత్రములూని పిలుచుచుండెద నయ్య!
..........పలికి కావుము దేవ! నిలిచి నన్ను
ఆకాశగంగతో నభిషేక మొనరింతు
.........నభయమిచ్చుచు ద్రుంచు మఘములన్ని
హర! మహాదేవ! సర్వావయవములందు
నిష్ఠబూనుచు భావింతు నిన్ను సతము
హృదయ నైర్మల్యమును గూర్చి సదమలమగు
భావసంపత్తి చేకూర్చి కావుమయ్య!

Monday, 10 February 2014

మన పల్లెలు

మన పల్లెలు

మన తెలుగు జనపదంబులు
ఘనతరమగు శోభతోడ కమనీయములై
మనముల కాహ్లాదము గూ
ర్చునుగద! నిలయంబు లౌచు సుఖసంతతికిన్. 1.


మనసంస్కృతి మనవిభవము
మనమనముల నిండియున్న మమకారంబుల్
కనదగు గ్రామంబులలో
మనయాంధ్రమునందు సతము మాన్యత నిండన్. 2.


ఉదయమె నిద్రను మేల్కొని
ముదమందుచు పశులసేవ ముఖ్యమటంచున్
సదమలహృదులై చేసెడి
సుదతుల కార్యంబులెంతొ శోభాన్వితముల్. 3.


అద్దిర! మనయాంధ్రమునం
దెద్దుల బండ్లన్ని పూన్చి యింటికి పంటల్
ముద్దుగ కొనితెచ్చెద రే
ప్రొద్దది హర్షంబు నొసగు పురవాసులకున్. 4.


పల్లెల నెచ్చట చూచిన
నుల్లంబుల నలరజేయు చుండెడి పశువుల్
చల్లని గాలులు, పైరుల
కెల్లరు ముదమందుచుందు రీయాంధ్రమునన్. 5.


మనములలో నాత్మీయత
జనములలో సమత మమత సభ్యత లెందున్
తనువులలో నైర్మల్యత
జనపదముల గాంచదగును సకలాంధ్రమునన్. 6.


గుడిసెల సౌందర్యంబును,
వడివడిగా పనులుచేయు వనితల నేర్పున్
కడు రమ్యమైన పరిసర
మడుగడుగున కానిపించు నాంధ్రంబందున్. 7.


ఇచ్చట సంస్కృతి కనబడు
నిచ్చట ధర్మంబు, సుఖము లీపల్లెలలో
నచ్చపు బాంధవ్యంబులు
సచ్చరితయు కాంచదగును సకలాంధ్రమునన్. 8.