Sunday 28 August 2016

తెలుగుభాష



తెలుగుభాష
(సీసపద్యమాలిక)

సీ.      శ్రీకరంబై యెల్ల క్షేమంబు లందించి
వెలుగు చుండెడి భాష తెలుగు భాష
మధుర స్వరాలతో మమతలు గురిపించు
తేట తెల్లపుభాష  తెలుగుభాష
కన్నతల్లికి బోలె  కడు సౌఖ్యమందించి
దీప్తి పెంచెడి భాష తెలుగుభాష
పారుష్య మొకయింత పదములం జూపక
తీర్చి యుండెడి భాష తెలుగు భాష
మంచి గంధం బట్లు మహితమౌ హాయిని
కలుగ జేసెడి భాష తెలుగు భాష
టీక, తాత్పర్యంబు లేకుండ భావంబు
తెలియ గల్గెడి భాష తెలుగు భాష
ఆత్మీయతాభావ మందరికిని బంచు
దివ్యమౌ సద్భాష తెలుగు భాష
స్వరము లంతంబందు సౌందర్యమును గూర్చ
నిలిచి యుండిన భాష తెలుగు భాష
యతులు ప్రాసలతోడ నతులితవైభవం
బందుచుండెడి భాష యాంధ్రభాష
ముదమును గలిగించు పదబంధములతోడ
నంద మొల్కెడి భాష యాంధ్రభాష
అలతి శబ్దాలతో నలఘు తాత్పర్యంబు
నందించగల భాష యాంధ్ర భాష
తే.గీ.            అమ్మవంటిది మనభాష యాంధ్రభాష
కమ్మనైనది మనభాష కావ్యభాష
నిరుపమంబౌచు జగతిలో నిర్మలమగు
యశము నందెడు భాష యీ యాంధ్రభాష.

Monday 15 August 2016

నేను భారతీయుడి నైనందుకు గర్విస్తున్నాను




స్వాతంత్ర్యదినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు
భారతదేశం నా మాతృభూమి
నేను భారతీయుడి నైనందుకు గర్విస్తున్నాను
(ఉత్పలమాలిక)
భారతదేశవాసినగు భాగ్యము నాకు లభించె దీనినిన్
కారణ జన్మమంచు బహు గౌరవ చిహ్నముగాగ దల్చెదన్
వీరులు, ధీరసత్తములు, విజ్ఞవరేణ్యులు, మౌని వర్యులున్,
చారుగుణాఢ్యులై వెలుగు సాధుజనంబులు, దేశభక్తులున్,
కోరికమీర సత్యమును కూర్మిధరించుచు సంసేవకై
చేరుచునుండు వారలును, శ్రేష్ఠులు, సంతత సౌమ్యమూర్తులున్,
వారును వీరలం చసమభావము చూపని యున్నతోన్నతుల్,
సూరిజనంబులున్, పతియె సుమ్మిల దైవము సత్యమంచు సం
స్కారము జూపు సాధ్వులును, శాస్త్రము లారును, నాల్గువేదముల్,
సారభరంబులౌ యుపనిషత్తులు, పూర్వకథార్థసంముల్,
సౌరులు చిందు కావ్యతతి, సాధుజనావన దీక్ష, లెల్లెడన్
మేరలులేని సఖ్యతలు, మేలొనరించెడి శాంతికామనల్,
చారుతరంబులైన నశబ్దసుగంధము లందు భాషలున్,
స్వైర విచార యోగ్యములు చక్కని సంస్కృతు, లద్భుతంపు స
త్కారము జూపు క్షేత్రములు, కమ్మని సూక్తులు, నిర్మలంబులౌ
నీరము లందజేయుచును నిత్యసుఖంబులు గూర్చు వాహినుల్,
పారములేని త్యాగములు, భవ్యయశంబుల కాలవాలమీ
ధారుణి మూడువర్ణముల ధన్యత గూర్చు పతాకయుక్త నా
భారతభూమి పుణ్యనిధి భాగ్యనిధానము సర్వదా శుభా
కారముతోడ వెల్గునది గావున మోక్షద మెల్లరీతులన్.  

Sunday 14 August 2016

కృష్ణాపుష్కరాలు


 


శ్రీకరమీ పుష్కరవిధి
యాకరము సుఖాలకింక హర్షదమౌచున్
చేకుర జేయును సఫలం
బాకాంక్షలను పితృదేవతాశీస్సులతోన్.

పదిరెండు వత్సరంబుల
నదనెంచి ప్రవేశమందు నాపుష్కరుడీ
నదులందు క్రమత జూపుచు
సదయుండై శుభములొసగు సద్భావముతోన్.


గురు డాత్మగతిని జూపుచు
నరయంగా కన్యలోని కానందమునన్
సురుచిరముగ జేరినచో
నిరుపమయగు కృష్ణకగును నిత్యోత్సవముల్.


భవమంది పశ్చిమంబున
జవమున పూర్వంపు దిశకు సత్త్వోన్నతవై
స్తవనీయ వగుచు చేరెద
వవురా! కొను కృష్ణవేణి యభివాదములన్.


నీవేగు మార్గమందున
పావనమౌ క్షేత్రరాజి బహువరదముగా
భావింపబడుచు నుండును
దేవీ! నీసాహచర్య దీప్తిని గృష్ణా!


ఈపుష్కరకాలంబున
నీపంచను జేరు జనుల నిఖిలాఘములన్
కోపాది దుర్గుణంబుల
బాపంగా కృష్ణవేణి! ప్రార్థింతు నినున్.

Monday 1 August 2016

సమస్యాపూరణం-౪

 ఆగస్టు 01, 2016
 “ధారాదత్తము సేయ సంపదలు కాంతాదాసులే పూరుషుల్
శ్రీరాముం డలనాడు సీతకొరకై చేరెంగదా జింక నా
నీరేజాక్షి కటంచు కృష్ణు డమరానీకంబునుం దాకె దా
నీరీతింగన నాటినుండి భువిలో నేవేళ శౌర్యాదులన్
“ధారాదత్తము సేయ సంపదలు కాంతాదాసులే” పూరుషుల్.   ౧.


కారుణ్యం బొకయింత చూపక మహా కాఠిన్యతా పూర్ణయై
యా రామున్ వనగామి జేసి విభుగా నస్మత్తనూజాతు నిం
పారన్ జేయు మటంచు కైక యనగా నట్లే నృపుండాడె నౌ
ధారాదత్తము సేయ సంపదలు కాంతా దాసులే పూరుషుల్.     ౨.

"చేరంబోవను నీదు సన్నిధి కికన్, శ్రేయంబులం గోరగా
నేరం బోవ త్వదీయవైభవములన్ నిష్ఠన్ సమర్పింపకే
యే రీతిన్ సుఖమందబోవు విభుడా"! యిట్లెందు స్త్రీలాడగా
ధారాదత్తము సేయ సంపదలు కాంతా దాసులే పూరుషుల్?    ౩. 

ఆగస్టు 02, 2016
సమరశూరులు చీమల జంపువారు
ధర్మపత్నిని బోషింప దానవీరు
లోనమాలను నేర్చిన జ్ఞానధీరు
లౌర! కలికాల మిద్దాని నరయు డిచట
సమరశూరులు చీమల జంపువారు. ౪.


గండు చీమలబారులీ మండపమున
నిండి యుండెను ధైర్యమే మండనముగ
రండు యోచింపు డెట్టులో ఖండనంబు
సమరశూరులు చీమల జంపువారు.  ౫.



హిట్టు, లక్ష్మణరేఖయు చుట్టు జల్లు
నా గమాక్సిను లెవ్వార లబ్బి! చెప్పు
మనిన గురువున కొకఛాత్రు డాడెనిట్లు
సమరశూరులు, చీమల జంపువారు.   ౬.

  ఆగస్టు 04, 2016
మరుభూమిన్ లభియించు గాదె విలసన్మాణిక్య రత్నావళుల్.
స్థిరచిత్తంబును, సత్ప్రయత్న, మవనిన్ సేవించు భావంబుతో
నరు లెవ్వారలు స్వార్థదూరు లగుచున్ నానాప్రదేశంబులం
దరుసం బందుచు సంచరింతు రనిశం బవ్వారి కవ్వేళ బ
ల్మరు భూమిన్ లభియించు గాదె విలసన్మాణిక్య రత్నావళుల్.   7.



నిరతానందముతో బ్రయత్నపరులై, నిష్ఠాగరిష్ఠాత్ములై,
ధరణీచక్రము నుద్ధరించు పనిలో ధన్యత్వముం గోరు నా
గురులం జేరరె దీక్షబూని యటకే కోరంగ శిష్యోత్తముల్
మరుభూమిన్ లభియించు గాదె విలసన్మాణిక్య రత్నావళుల్. 8.

 ఆగస్టు 05, 2016
 కవనం బయ్యెను లుప్తసత్త్వ మది శ్లాఘ్యంబౌట బొంకే సుమా!
అవురా! యెంతటి దుస్థితుల్ గలిగె నీయాంధ్రావనిం జూడగా
నవజాతంబగు బిడ్డకైన విధిగా నవ్వుల్, సమస్తార్థముల్
స్తవనీయంబని యెంతు రాంగ్లఫణితిం దానింక నస్మాకమౌ
కవనం బయ్యెను లుప్తసత్త్వ మది శ్లాఘ్యంబౌట బొంకే సుమా! 9.


అవనీగర్భములోని వారినిధు లేహర్షంబు నందించలే
కవి క్షీణించుచునుండె నౌర! సకలం బత్యుగ్రసంఖ్యాకులౌ
బువివారింగని, వీరలేమొ నదులన్ పోకార్చుచున్నార లిం
క వనంబయ్యెను లుప్తసత్త్వ మది శ్లాఘ్యంబౌట బొంకే సుమా. 10.

 
 ఆగస్టు 05, 2016
సత్య మింక కవనము నిస్సత్త్వమయ్య 
విషయ సంక్రమణార్థంబు విస్తృతముగ
పలురకంబుల నవ్యంపు పద్ధతులిల
ననిశ మాకర్షణీయంబు లగుచునుండ
సత్య మింక కవనము నిస్సత్త్వమయ్య  11.

 ఆగస్టు 06, 2016
వరుణదేవుడు కరుణించె గరువు వచ్చె.
ఎల్ల నదులింకె, సస్యంబు లెండిపోయె
పసులకైనను గ్రాసంపు పరక లేని
సరణి వర్ణించె వ్యంగ్యాన సరసు డొకడు
వరుణదేవుడు కరుణించె గరువు వచ్చె.12


కోర్కి కనుకూలమౌ వృష్టి కురిసి యపుడు
సస్యముల వృద్ధి హర్షాన జరుగుచుండ
ధరణి కంపించె, కృములన్ని దాడిచేసె
వరుణదేవుడు కరుణించె, కరువు వచ్చె.13.


 వానదేవుడు చూపగా దయ వచ్చె గాటక మెల్లెడన్. 
కాననయ్యె సమాజమందున కన్నుగానని స్వార్థముల్
మానుచుండిరి యాత్మధర్మము మానవాళి, ధరిత్రియున్
దానిచేత వికాసహీనత దాల్చె, నాగ్రహ మిప్పుడా
వానదేవుడు చూప గాదయ, వచ్చె గాటక మెల్లెడన్.
  14.


 ఆగస్టు 07, 2016
కవి సన్మానము సేతుమంచు బలుకం గంపించె భీతాత్ముడై.
నవజామాత యొకండు పండుగకునై నారీసమాయుక్తుడై
స్తవనీయశ్వశురాలయం బరుగగా స్వశ్యాలకుం డచ్చటన్
భవనాగ్రంబున వృశ్చికాది గణముం బల్మారు చూపించి, నీ
కవి సన్మానము సేతుమంచు బలుకం గంపించె భీతాత్ముడై.15.


వివిధంబైన స్వకావ్యరాశి యొక డావిర్భూత మోదంబు తో
నవనిన్ సద్యశమందగోరి కరమం దావేళ తాబూని సా
గువిధిం గొందరు దండధారు లచటన్ గుర్తించి యవ్వాని నో
కవి! సన్మానము సేతుమంచు బలుకం గంపించె భీతాత్ముడై. 16.


 ఆగస్టు 08, 2016
 రక కల్గు భోగములు యోగము గూడినవారి కిద్ధరన్. 
ధీరతనుండి, సవ్యగుణదీప్తిని గల్గియు, సత్యనిష్ఠులై
వారును వీరలం చసమభావము చూపక సంఘసేవకై
చేరగ సిద్ధమైన శుభశీలుర, కార్యుల కన్నివేళలం
దూరక కల్గు భోగములు యోగము గూడినవారి కిద్ధరన్.  17.


ఊరక భోగములు గల్గు యోగులకు ధరన్
కోరక భక్తజనాదులు
చేరుదురు విశిష్టమైన సేవల కొరకై
కూరిమి బంచుచు నుండెద

రూరక భోగములు గల్గు యోగులకు ధరన్.18.
 ఆగస్టు 09, 2016
భారత యోధులన్న రిపువాహినికిన్ దృణకల్పులే కదా.
మీరుచునుందు రెల్లపుడు మేరలు కాశ్మిరమందు నిత్యముం
గోరుచునుందు రాహవము కూర్మి యొకింతయు జూపరౌర! య
వ్వారలు “పాకు సైనికులు” వారియభీష్టము లెంచి చూడగా
భారత యోధులన్న రిపువాహినికిన్ దృణకల్పులే కదా.19


 భరతయోధులు చీమలు పగతురకును.
ఒకరు భాగ్యంబు దోచినా రొకరు మతము,
ఒక్క రీనేల సంస్కృతి నిక్కువముగ
ఔర! యీతీరు చూడంగ నవగతమగు
భరతయోధులు చీమలు పగతురకును.  20.


 ఆగస్టు 10, 2016
 రాముడు ధర్మమున్ జెఱచె రాజులు యోగులు సంతసింపగన్. 
క్షేమము గోరి రాజ్యమున కేవల మొక్కని మాటకోసమై
భూమితనూజ నాత్మసతి బోవిడిచెం గద కాననంబులం
దేమి విచిత్రమో! యతివ నివ్విధి రోయుట నెంచి చూడగా
రాముడు ధర్మమున్ జెఱచె రాజులు యోగులు సంతసింపగన్.  21.


 ఆగస్టు 11, 2016
పద్యము కాలకూటవిషభాండము గాదె కవిత్వవేదికిన్
మద్యము ద్రావువానివిధి మానవకోటిని దిట్టుచుండి, యే
విద్యయు సౌఖ్యహీనమని విస్తృతరీతిని దుష్టభావ సం
పాద్యముగా కవిత్వమును పల్కగ బూనిన నెల్లవేళలన్
పద్యము కాలకూటవిషభాండము గాదె కవిత్వవేదికిన్.22.


 ఆగస్టు 12, 2016
 తల్లికి దండ్రికిన్ దగ ప్రదక్షిణ సేయగరాదు సంతుకున్
తగదు ప్రదక్షిణము సేయ తలిదండ్రులకున్
ఉల్లము సంతసించునటు లుండక పెద్దతనంబులోన దా
నెల్ల విధాల సాయపడ కించుకయుం దయ లేక మిమ్ము నే
నొల్ల నటంచు బోవిడిచి యుర్విజనంబుల మెప్పుకోసమై
తల్లికి దండ్రికిన్ దగ ప్రదక్షిణ సేయగరాదు సంతుకున్. 23.

అగణితమగు సద్భక్తియు
భగవన్నిభులన్న భవ్యభావము మరియున్
తగినంత శ్రద్ధబూనక
తగదు ప్రదక్షిణము సేయ తలిదండ్రులకున్.  24.


ఆగస్టు 13, 2016
భారత యుద్ధరంగమున పార్థుడు సచ్చెను భీము డేడ్వగన్
భారతయుద్ధమున నోడి పార్థుడు సచ్చెన్
మేరలు మీరి యొక్కరుడు మిక్కిలి మద్యము ద్రావి దూలుచున్
చేరి యసంగతంబు లిటు చెప్పుచు నుండెను రావణాసురుం
డారఘురాము గూల్చె విను డందరు నీ యితిహాస వాక్యముల్
భారత యుద్ధరంగమున పార్థుడు సచ్చెను భీము డేడ్వగన్.25.


తోరంపు సంతసంబున
రారాజు సుయోధనుండు రాణికి దెలిపెన్
కోరగ స్వప్నోదంతము
భారతయుద్ధమున నోడి పార్థుడు సచ్చెన్. 26.

  
ఆగస్టు 14, 2016
కుంజరయూధమ్ము, దోమ కుత్తుక జొచ్చెన్
రంజను డనువా డొక్కరు
డంజనపురి నావముక్క లానందముగా
నంజుచు జూడగ వచ్చిన
కుంజరయూధమ్ము, దోమ కుత్తుక జొచ్చెన్.  27.

 ఆగస్టు 15, 2016
స్వాతంత్ర్యమ్మున లాభ మందిరి గదా స్వార్థంపు నేతల్ ఘనుల్
భీతిం జెందక దాస్యముక్తియె సదా విధ్యుక్త ధర్మంబుగా
చేతంబందు దలంచి పోరి రపుడున్ క్షేమంబులం గూర్చి యీ
జాతిం గావగ వర్తమానము గనన్ సర్వత్ర దుష్టాత్ములై
 
స్వాతంత్ర్యమ్మున లాభ మందిరి గదా స్వార్థంపు నేతల్ ఘనుల్.  28.

 ఆగస్టు 17, 2016
 భగణంబున గురువు నాస్తి పండితులారా!
అగుపించవు శుభవేళలు
జగమున వైవాహికాది సత్కర్మలకున్
గగనం బందున గాంచుడు
భగణంబున గురువు నాస్తి పండితులారా! 29.


 ఆగస్టు 18, 2016
 ధాన్యము వద్దురా మనకు ధాన్యము గావలె ధన్యతం గనన్. 
అన్యములైన కార్యముల నందగ నేల కుమార! నీవు రా
జన్యునిఠీవి కోసమయి సత్తువ కోల్పడ నేలనోయి యీ
మాన్యము దున్నుకున్న మన మానము ప్రాణము దక్కుగాదె ప్రా
ధాన్యము వద్దురా మనకు ధాన్యము గావలె ధన్యతం గనన్.  30.


ఆగస్టు 19, 2016
గాడిద! వచ్చి చొచ్చె నట కర్ణపుటంబున జోద్యమయ్యెడిన్
వేడుకతోడ నీ విభుడు విన్నపమున్ వినిపించుకోడు తా
జూడడు నాయవస్థ యనుచున్ మది నాగ్రహ మందనేలరా!
గోడకు నున్న మక్షికము కోరి హఠాత్తుగ లేచి యప్పు డో
గాడిద! వచ్చి చొచ్చె నట కర్ణపుటంబున జోద్యమయ్యెడిన్.31.

  
 ఆగస్టు 20, 2016
దోమల్ గుట్టిన రాత్రి, జీవితము నిర్దోషంబు నారోగ్యమున్
క్షేమం బన్నది సందియంబు గద దాక్షిణ్యంబు లేకుండగా
దోమల్ గుట్టిన రాత్రి, జీవితము నిర్దోషంబు నారోగ్యమున్
ధూమంబుం బ్రసరింప జేయుఫణితిం దోరంబు గానప్పుడున్
భూమిన్ వానిని బారద్రోలుట సదా పొందంగ సౌఖ్యంబులన్.  32.


 ఆగస్టు 21, 2016
రామా! రమ్మని కేలుసాచి బిలిచెన్ రమ్యంబుగా రాధయే
శ్రీమన్మాధవ! మోహనాంగ! సుదతీచేతోహరా! కేశవా!
నీమంబొప్పగ నిన్ను దల్తు సతమున్ నీవేల రావైతి వో
స్వామీ! పద్మ దళేక్షణా! ప్రియసఖా!భక్తాళి హృత్పీఠికా
రామా! రమ్మని కేలుసాచి బిలిచెన్ రమ్యంబుగా రాధయే 33.


ఆగస్టు 21, 2016
రామ! రమ్మటంచు రాధ పిలిచె
వందనీయు, మిత్రు, నందాంగనా పుత్రు,
సతత హర్ష భరితు, సాధుచరితు
ప్రేమమీర జూచి క్షేమంబె సుగుణాభి
రామ! రమ్మటంచు రాధ పిలిచె 34.


ఆగస్టు 22, 2016
 భర్తను బైటకున్ దరిమె భారతనారి కళాప్రపూర్ణయై
వార్తల కెక్కగావలయు వైభవ ముంగని సంఘమందు స
త్కీర్తిని పొందగావలయు కేవల మింటవ సించు టేల నీ
వర్తనమార్చుకొమ్మనుచు భవ్యహితంబుల యత్నహీనుడౌ
భర్తను బైటకున్ దరిమె భారతనారి కళాప్రపూర్ణయై.35.


 ఆగస్టు 24, 2016
 నీరు చాలక దీపము లారిపోయె
పైరు లెండెను క్షేత్రాల సౌరు లుడిగె
నీరు చాలక, దీపము లారిపోయె
తైలహీనము లయి శంకరాలయమున
ధరణి నీజంట జీవనాధారము గద. 36.


 ఆగస్టు 26, 2016
 కలలం గాంచెడు గండశైలములు పల్కంగల్గు స్పష్టమ్ముగన్
ఉలి చేతంగొని యున్నతాశయముతో నుత్సాహముం బూని యా
జలజాతోద్భవ శంకరాది సుమనస్సంఘంబునుం దల్చి యే
ఫలమాశించక మూర్తులన్ మలచు నా భాగ్యాఢ్యుడౌ శిల్పికిన్
కలలం గాంచెడు గండశైలములు పల్కంగల్గు స్పష్టమ్ముగన్.  37.


 కలలు గనెడి శిలలు పలుకగలవు.
శ్రద్ధబూని నిరత సద్భావసహితుడై
దేవతార్చనమున దివమురాత్రి
రచన చేయుచుండు శుచియైన శిల్పికి
కలలు గనెడి శిలలు పలుకగలవు. 38.


 ఆగస్టు 27, 2016
నిదురించినవాడు కీర్తినే గడియించున్
ముదమందుచు తనదేశపు
సదమలయశమునకు జేయు సత్కార్యంబౌ
కదనంబున శాశ్వతముగ
నిదురించినవాడు కీర్తినే గడియించున్.  39


నిద్దురపోవువాడు ధరణిన్ ఘనకీర్తి గడించి మించెడిన్
గద్దరిదైన వర్తనము క్రౌర్యము మోసము లీధరాస్థలిన్
వద్దు సహించబో మికను స్వార్థము చెల్లదటంచు నెంతయున్
పెద్దరికాన దుష్టులకు భీతిని గొల్పుచు వారి గుండెలన్
నిద్దురపోవువాడు ధరణిన్ ఘనకీర్తి గడించి మించెడిన్.40.

  
 ఆగస్టు 29, 2016
పాలే కారణ మన్నినష్టములకున్ భద్రమ్ము దుర్యోధనా
నీలో దుర్మతి యిట్టులేల కలిగెన్ నిత్యంబు ధర్మాత్ములై
యీ లోకంబున సంచరించు ఘనులౌ యీ ధర్మరాజాదులన్
శ్రీలం దోచి వధింప జూచుట కులక్షేమంబె? నీచేయు పా
పాలే కారణ మన్నినష్టములకున్ భద్రమ్ము దుర్యోధనా! 41.

పాలవలన నష్టమే లభించు.  
విద్యతోడ సద్వివేకంబు సుతులకు
మంచి వర్తనాన మసలు రీతి
క్షితిని నేర్పనట్టి మితిమీరు నా మురి
పాలవలన నష్టమే లభించు.  42.


ఆగస్టు 30, 2016
తండ్రి ధనహీనత కతన తనయు డెదిగె
ధ్యానమును ద్రుంచు నా దూరదర్శనాది
వస్తుజాలము లేవింట వాస్తవముగ
తండ్రి ధనహీనత కతన, తనయు డెదిగె
చదువులను నేర్చి సల్లక్ష్యసాధకుడయి.43.


 ఆగస్టు 31, 2016
అరిషడ్వర్గము మానవాళికి హితం బందించు నెల్లప్పుడున్
పరమానందము, స్వార్థహీనత, సుహృద్భావంబు, సంతృప్తియుం
బరసేవాగుణ, మీశ్వరార్చనము, సద్వాక్యాను లాపంబులన్
స్థిరతం బూనుచు నంతరంగమును స్వాధీనంబుగా నుంచ నా
యరిషడ్వర్గము మానవాళికి హితం బందించు నెల్లప్పుడున్.  44.



అరిషడ్వర్గమ్ము హితము నందించు సదా
పరహితము సాధుశీలము
సురుచిర వాక్యానువృత్తి శుభకామనయున్
దరహాసము శాంతియు కా
వరిషడ్వర్గమ్ము హితము నందించు సదా.45.


 సెప్టెంబర్ 01, 2016
 మార్తాండుం డుదయాద్రి గ్రుంకె నదిగో మధ్యాహ్న కాలంబునన్. 
వార్తం జూడగ రండు మిత్రు లిచటన్ భారీ ప్రయత్నంబుతో
కీర్తిం బొంద విహాయసంబున సదా క్షేమంకరం బౌచు మా
యార్తిం దీర్చు నటంచు బంపి రకటా! యాకృత్రి మాకారమౌ
మార్తాండుం డుదయాద్రి గ్రుంకె నదిగో మధ్యాహ్న కాలంబునన్.  46.


 సెప్టెంబర్ 02, 2016

వారక ప్రాణముల్ గొనెడువాడు గదా పరమాత్ముడన్నచో.
కోరిక దీర జన్మమును గూర్మి నొసంగి యనేక బంధముల్
చేరగ జూచి సౌఖ్యముల సిద్ధిని జూపుచు జీవనాఖ్యమౌ
తీరగు నాటకంబునను దీర్చిన పాత్ర ముగించువేళలో
వారక ప్రాణముల్ గొనెడువాడు గదా పరమాత్ముడన్నచో.47.
(వారక=ఎల్లప్పుడు)

 సెప్టెంబర్ 05, 2016
                                        భాద్రపదమ్మున శుక్లపక్షపుం
జవితిని జంద్రదర్శనము సర్వశుభమ్ము లొసంగు మానవా

ధ్రువమగు భక్తి బూనుచును తోరపు శ్రద్ధ గణాధినాయకున్
శివసుతు గొల్చి యాపయిని శ్రీప్రదమైన శ్యమంత సత్కథన్
భవ హర గావుమంచు విన భాద్రపదమ్మున శుక్లపక్షపుం
జవితిని జంద్రదర్శనము సర్వశుభమ్ము లొసంగు మానవా48.


 సెప్టెంబర్ 09, 2016
పాలం జూచిన పిల్లి పాఱె భయసంభ్రాంతుల్ మదిన్ గ్రమ్మగన్
పాలు న్నేతులు భోజ్యవస్తుతతులం బల్మారు దండించినన్
నేలం ద్రోతువు, పాడుచేసెదవిట న్నీకంత్యకాలం బిదే
లే లెమ్మంచును వేత్రహస్తులయి మళ్ళించంగ నవ్వారి కో
పాలం జూచిన పిల్లి పాఱె భయసంభ్రాంతుల్ మదిన్ గ్రమ్మగన్.  49.



 సెప్టెంబర్ 10, 2016
మల్లియతీగకున్ గలిగె మామిడికాయలు మేలనన్ జనుల్
కల్ల యొకింత గాదు విను కర్షకు డొక్కరు డద్భుతంబుగా 
వల్లులు కొన్ని పెంచె నొక వైపు పొలాన విదేశజంబులన్
పల్లెకు దెచ్చియౌర! తన భాగ్యమటంచును వాటిలోపలన్
మల్లియ! తీగకున్ గలిగె మామిడికాయలు మేలనన్ జనుల్ 50.



 సెప్టెంబర్ 11, 2016
మత్తేభమ్మును దోమ కూల్చ నదియే మండ్రాడె దైన్యమ్మునన్.  
సామజ! మును గూల్చె దోమ యొకటి
చిత్తంబందున దుష్టభావయుతయై చేరెంగదా బాలునిన్
క్షుత్తుం దీర్తునటంచు పూతన మహాక్రూరాత్మ, తత్ప్రాణముల్
మొత్తంబున్ హరియించె నాత డవురా! మున్నా ప్రదేశంబునన్
మత్తేభమ్మును దోమ కూల్చ నదియే మండ్రాడె దైన్యమ్మునన్.  51.



విత్తంబున్ బహుమూల్య వస్తుతతులన్ విస్తారరూపంబుగా
నుత్తేజంబున బంచి యెన్నికలలో నుద్దండు డాతండు తా
జిత్తైపోవగ నూతనాగతునకున్ జిజ్ఞాసు లిట్లాడి రా
మత్తేభంబును దోమ కూల్చ నదియే మండ్రాడె దైన్యమ్మునన్. 52.


మాననీయ! గాంచు మానంద పురమందు
మశకరాజి యందు భృశము దిరుగ
కరచి వ్యాధి గూర్చి ఘనుడగు నాతని
సామజ! మును గూల్చె దోమ యొకటి 53

 సెప్టెంబర్ 12, 2016
జనకుని దిట్టె నాత్మజుడు, చయ్యన గార్చుచు మోదబాష్పముల్
కుని దూషించె సుతుడు సజలనయనుడై 
ఘనతర మాంగ్లభాషయగు గావున నేర్వు మటంచు బంప నా
దినమున కక్ష్యలో సఖులు దెల్పిన “ఫూల”ను మాట బల్కుచున్
జనకుని దిట్టె నాత్మజుడు, చయ్యన గార్చుచు మోదబాష్పముల్
తనయుని మెచ్చె తండ్రి విని తాను నిరక్షరకుక్షి కావునన్.54.


తనతండ్రిని నపహర్తలు
కొనిపోవగ వారిజేరి కోరిన యట్టుల్
ధనమిడి తిట్టుమటన్నను
జనకుని దూషించె సుతుడు సజలనయనుడై.55.


కనికరము చూపకుండగ
ననుచితములు పలుకునట్టి యబలను సతిగా
తన కంటగట్టి యుండిన
కుని దూషించె సుతుడు సజలనయనుడై 56.
సెప్టెంబర్ 13, 2016

అక్కనుఁ బెండ్లియాడె నొక డందరు సంభ్రమ మంది చూడఁగన్"
"అక్కనుఁ బెండ్లాడె నొక్కఁ డందరు చూడన్"


చక్కదనంబు లేదు, పరిచర్యలు చేయగ శక్తి లేదికన్

ముక్కలుగాగ శల్యములు మేదినిపై చరియించలేక తా


నొక్కట శయ్యపైన పడియుండిన వృద్ధను భర్తృకాంక్షి న


చ్చక్కను బెండ్లియాడె నొక డందరు సంభ్రమ మంది చూడగన్. 57.



చక్కని చుక్కై దిరుగుచు

మక్కువతో బలుకరించు మహితగుణాఢ్యన్


మిక్కిలి సంతసమున సీ

తక్కను బెండ్లాడె నొక్క డందరు చూడన్. 58.


సెప్టెంబర్ 14, 2016

కోతికి జాబు వచ్చెనని గొల్లున యేడ్చుట యుక్తి యుక్తమా

కోతి కొక జాబువచ్చిన గొల్లు మనియె

ఆతడు నాహితైషి నను హాస్యము బంచుచు మర్కటంబనున్

చేతము సంతసించు పని చేయును బంధువు లేని నాకు తా


నూతము సత్య మొక్కదిన ముత్తర మొక్కటి యందుకొన్న నీ


కోతికి జాబు వచ్చెనని గొల్లున యేడ్చుట యుక్తి యుక్తమా 59.



టాను వచియించ సాధ్యంబు గాని యొకడు

కోటి తనమిత్రు డన్నింట తోటివాడు


పత్రమును జూచి దు:ఖించ బలికె నిట్లు


కోతి కొక జాబువచ్చిన గొల్లు మనియె.60.



సెప్టెంబర్ 14, 2016


బీరును గని త్రాగుబోతు భీతిం జెందెన్"


"బీరుం గాంచిన త్రాగుబోతు మిగులన్ భీతుం డయెన్ జూడుమా

సారా త్రాగుట హానికారకమురా సర్వంబు గోల్పోదు వా

దారా పుత్రులు వైరులయ్యెదరికన్ తథ్యంబు నామాట నీ


వీరీతిన్ జరియింప జత్తువని తానిట్లాడు చున్నట్టి స


త్బీరుం గాంచిన త్రాగుబోతు మిగులన్ భీతుం డయెన్ జూడుమా. 61



సెప్టెంబర్ 15, 2016
తల్లీ! యంచు, సుతుండు బిల్చె నదిగో తండ్రిన్ ముదం బొప్పగన్

తల్లీయని పిలుచునంట తండ్రిని సుతుడే. 

ముల్లోకంబుల నేలుచుందువు గదా! మోదంబులం గూర్చుచుం

కల్లోలంబుల ద్రుంచు దానవగుచుం గైవల్యసంధాయినీ!


తల్లీ! యంచు, సుతుండు బిల్చె నదిగో తండ్రిన్ ముదం బొప్పగన్


ఫుల్లాబ్జానన బార్వతిం గొలువగా పుణ్యాత్ము డవ్వేళలోన్. 62



ఎల్లప్పుడు నాటకముల

నుల్లంబులు మోదమంద నువిదల పాత్రల్


పెల్లుగ జేసెడి వానిని


తల్లీయని పిలుచునంట తండ్రిని సుతుడే. 63.



అల్లీఖానుకు పుత్రు డొక్కడగుటన్ హర్షాతిరేకంబుతో

నల్లా! త్వత్కృప జూపుమా యనుచు మాటాడంగ నేర్పించినన్


సల్లాపంబుల నొక్కనాడు వినరే చాపల్యభావంబు చే


తల్లీ! యంచు, సుతుండు బిల్చె నదిగో తండ్రిన్ ముదం బొప్పగన్ 64.



సెప్టెంబర్ 16, 2016
రాముడు రాక్షసుండుగను రాక్షస కాంతగ సీత యయ్యెడిన్.

రాముడు రాక్షసుడు సీత రక్కసి యయ్యెన్.

నీమ మొకింత లేక యనునిత్యము దుర్మతులై, మదాంధులై

ధీమతులైనవారలను దిట్టుచు నాస్తిక భావయుక్తులై


భూమి జరించునట్టి యెనుబోతుల దృష్టికి సద్గుణాఢ్యుడౌ


రాముడు రాక్షసుండుగను రాక్షస కాంతగ సీత యయ్యెడిన్ 65



నామములు వారి కున్నవి

రాముడు, సీతయుననంగ రంగస్థలిపై


నీమమున నటన జేయగ


రాముడు రాక్షసుడు సీత రక్కసి యయ్యెన్. 66


కామము క్రోధమున్ మదవికారము మత్సర లోభమోహముల్

నీమముదప్పి వర్ధిలెఢు నిత్య కుకర్ములచెంత నీకలిన్


తాము వసించబూని చను ధార్మికవర్తను లైన మారరే


రాముడు రాక్షసుండగును రాక్షస కాంతగ సీతయయ్యెడిన్ 67.



సెప్టెంబర్ 18, 2016
పడతికి నాతితోడనె, వివాహము గావలె శాస్త్రపద్ధతిన్

పడతి! నాతి! నే పెండ్లాడవలెను వలచి.

పుడమిని జన్మవృద్ధులును, పోడిమి నింపెడి ప్రేమబంధముల్

కడకిక నత్త రూపమున కట్నముపేరిట నిత్యపీడలున్


పడతికి నాతితోడనె, వివాహము గావలె శాస్త్రపద్ధతిన్


ముడిపడువేళ యింతులకు మోదము గూర్చెడి బాసలందుచున్. 68



సుందరాంగివి, దరహాస శోభితవిక

మధురవాక్కులతోడ నా మానసమున


నిలిచి యున్నావు సత్యంబు నిన్నె వినుము


పడతి! నాతి! నే పెండ్లాడవలెను వలచి.69



సెప్టెంబర్ 19, 2016
తనపార్టీ గెలువంగ నెన్నికలలో దానేడ్చె సాజమ్ముగా. 

తన పార్టీ గెల్చినంత దానేడ్చె నయో

వినుడా మంత్రి వరేణ్యు డన్నిగతులన్ విజ్ఞప్తులం జేసి నా

ధనమానంబులు మీవి, యండయగుదున్ తథ్యంబు గెల్పించు డో


జనులారా!యని నమ్మబల్కి బహుళైశ్వర్యంబులం బంచి సీ


తనపార్టీ గెలువంగ నెన్నికలలో దానేడ్చె సాజమ్ముగా. 70



అనిలుడు హర్షం బందెను 

తన పార్టీ గెల్చినంత దానేడ్చె నయో


ఘనుడా నాయక వర్యుడు


తనయోటమి దలచికొనుచు ధరనొంటరియై.
71


కొనినా డెంతొ మెజారిటీల నతడున్ గోప్యంపుటోటింగులో

ననుమానం బొకయింత లేక తనకాహా వచ్చు మంత్రిత్వమం


చనుకొన్నా డటుకాకపోవ గనరే యానాయకుం డప్పుడుం


దన పార్టీ గెలువంగ నెన్నికలలో దానేడ్చె సాజమ్ముగా. 72



సెప్టెంబర్ 20, 2016
సత్కవులెల్ల, మూఢులయి చాలక పోయిరి పూరణమ్ములన్

త్వత్కృపచేత నీశ్వర! సుధామయ సూక్తుల బద్యరత్నముల్

చిత్కమలాన నాటునటు చెప్పుచు నుందురు సర్వకాలమున్


సత్కవులెల్ల, మూఢులయి చాలక పోయిరి పూరణమ్ములన్


సత్కృతులందరైరి గద శ్రద్ధయొకింతయులేక మాదృశుల్. 73




సత్కవులు పూరణములకు జాలరైరి. 

భోజనరపతి సభలోన పురుషు డొకడు

వచ్చి “యప్రశిఖ” యనుచు పలుకు చుండ

నచట కాళిదాసుడు దక్క యన్యులైన

సత్కవులు పూరణములకు జాలరైరి. 74

సడ్డం బూనుచు భక్తిపూర్ణమతులై సద్భావసంయుక్తులై
వడ్డీకాసులవాని! వేంకటపతిన్! భాగ్యప్రదున్! శ్రీపతిన్!
గడ్డౌకాలము ద్రోచి సౌఖ్యములతో గావంగ ప్రార్థించినన్
వడ్డీకట్టగ డబ్బులేని యతడే వర్షించు నైశ్వర్యముల్.75.

వడ్డీ కాసులవాడయి
యడ్డంకులు తొలగద్రోచి యందరికి సదా
విడ్డూరం బనిపించును
వడ్డీ చెల్లింపలేడు వర్షించు సిరుల్.    76.


భవ హర శంకరా బహుళ భాగ్యవిధాయక నీలకంఠ నా
స్తవమును స్వీకరించుమని తన్మయు డౌచు మృకండుజుండు తా
నవిరళభక్తిభావయుతుడౌచును గొంకక నిత్యమాయుమా
ధవుని పదమ్ములం గొలిచి ధన్యత గాంచె నతండు వింటిరే  77.

జవరాలు మంజుభాషిణి
యవనతయై దీక్షబూని యనవరతంబున్
భువి నాదైవం బితడని 
ధవుని పదమ్ములను గొలిచి ధన్యత గాంచెన్ 78.

కురు సైన్యంబులు ద్రోణు సంరచనచే ఘోరాహవంబందు తా
మురులీలన్నిలువంగ గూల్చుటకునై యుత్సాహి యైధ్యానత
త్పరుడై చేరుట విన్ననొక్కరుడనెన్ ధైర్యాన్వితుండాత డో
ధరణీశా! యభిమన్యు డుద్ధతిని బద్మవ్యూహముం గెల్చెబో.  79.

నిరతాభ్యాసుడు విశ్వనాథు డవురా! నిష్ఠాగరిష్ఠాత్ముడై
ధరనత్యున్నతులై వెలుంగు ఘనులన్ దాటంగ వ్యూహక్రియన్
భరతోర్విం జదరంగపుం బ్రియులిటుల్ భావించి యన్నార లో
ధరణీశా! యభిమన్యు డుద్ధతిని బద్మవ్యూహముం గెల్చెబో 80.
పుట్టలు చెట్టుచేమలును పోడిమి నిండిన క్షేత్రరాజి యా
పట్టున నుండగా నచట పంటను గావగ చేరినట్టివా
డట్టె వినోదకాంక్షి యొక డంతట మంచెను నన్యులెవ్వరుం
జుట్టును లేనివాడు తన జుట్టును దువ్వెను మాటిమాటికిన్. 81.


ధర్మపత్ని, తాను కర్మణ్యులైయుంట
బిడ్డ గావ నొకని బెట్టుకొనిరి.
నీళ్ళు బోసి యతడు నిష్ఠతో శిశువుకు
జుట్టు లేనివాడు జుట్టు దువ్వె. 82.
అకట సమీప వస్తుతతి యంతయు కంటికి దల్లక్రిందులై
ప్రకటితమౌవిధిన్ సురను బానము చేసినవాడు ప్రేలుచున్
వికటముగా వచించెనిటు వింటిరె మిత్రులు యుద్ధభూమిలో
నకులుని జంపె రామనరనాథుడు జానకి సంతసింపగన్83.
రాణివాసమందు రాత్రివేళను దూరి
పరుగు లిడుచు నచట తిరుగుచుండి
పత్ని కెంత యేని భయమును గొల్పెడి
నకులు జంపె రామ! నరవిభుండు.  84.

అవినీతిం గొని సంచరించుటయు హేయంబైన మద్యంబు నా
నవనాడుల్ మునుగంగ ద్రాగుటయు మానంబెంచ కేనిత్యమున్
భువిలో బల్కుచు నుండుటల్ యశములం బోకార్చునో మర్త్య! నీ
కవియేగా మఱి చేటు దెచ్చు నిలలో గాఠిన్యమే చిందుచున్.  85.

ముద్దులు గూర్చు వర్ణముల, మోహనమై వెలుగొందు శైలిలో 
కొద్దిధనానికే బయట కోరిన పూర్ణ శరీర త్రాణముల్
పెద్దలు పిన్నలందరకు విస్తృత రీతి లభించుచుండగా
వద్దిక ఛత్రముల్ గొనుట వర్షము వచ్చిన గుండపోతగన్. 86.

అగజానాథుని వింటి నమ్మిథిలలో నానాడు భంజించి యీ
జగతిన్ సద్యశమందియున్న ఘనుడౌ సత్త్వాఢ్యు డాసీతకున్
మగడై యొప్పును రాము డింపెసగ, నా మండోదరీ భామకున్
తగువా డెందును రాక్షసాధిపతియే తథ్యమ్ము ముమ్మాటికిన్.  87.

స్వైరవిహార జీవనము స్వార్థము నిండిన నిత్యకర్మలున్
కూరిమి లేని పల్కులును కొంతయు నీశ్వర భక్తిలేమి వి
స్తారపు డాంబికంబులును ధర్మము దప్పుట లున్నచో భువిన్
వైరి స్వదేహ మౌట యనివార్యపు శాపము దీర్ఘజీవికిన్.  88.

అనుచితమగు వర్తనముల
ననుదినమును గోరినట్టు లతిభోజనముల్
ఘనుడై చేసెడి జనునకు
తన దేహమె వైరి యగుట తథ్యము ధరణిన్.  89.

కలికాలం బిదియైన గూలునుగదా కారుణ్య సంపూర్ణ నా
యలిమేల్మంగను వేంకటేశమహిషిన్ హర్షప్రదన్ శాశ్వతన్
తులసీ! మాతను గొల్చినన్ దురితముల్, దోరంబులై యబ్బురా
యలఘుప్రాభవముల్ నిరంతర యశం బత్యంత సౌఖ్యంబులున్. 89.
నాలుగు పాదాలను 'వనము'తో ప్రారంభించి
దేవీ నవరాత్రులను గురించి 
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి

వనములలోని పుష్పములు భక్తిగ దెచ్చుచు గొల్చువారి జీ
వనమున సౌఖ్యసంపదలు వైభవవృద్ధులొనర్చుచుండి పా
వనమగు సద్యశంబులిడి పాలన జేసెడు తల్లి నాదు భా
వనమును శుద్ధి చేయునిది వాస్తవ మీనవరాత్రిదీక్షతోన్. 90.

జయుడను వానికొక్కనికి స్వప్నమునందగుపించె సూర్యుడే
రయమున దాకె చంద్రుని దురమ్మున నాకసమందు గావునన్
భయమును గొల్పురీతిని శుభంకర సాధుజలప్రదాత యా
మొయిలు తటాలునన్ గురిసె భూమిపయిన్ రుధిరం బుదగ్రతన్. 91.

సుందరాంగుల నిద్దరి జూచి సఖియ
లిద్ద రిట్లాడు కొనుచుండి రింపుమీర
నతడు నాపతి మఱి మగడౌనితండు
నీకు బలుకరింతము పద నిక్కువముగ 92.

ఆతడు నామగండు, పతియౌ నిత, డూరికి బోయె భర్త, యే
మాతని భార్యసోయగము, హర్షిణి నందన కెంతయందమో!
చూతము రండురండనుచు సుందర రూపలు కాంతలందరుం
జేతము లుల్లసిల్లు నటు చేరి రొకానొక విందు కోసమై. 93.



సురసంఘంబుల గావగ
నురుతరకరుణాలవాల యుమ సకలద యా
గిరిరాజ నందన శుభం
కరి సింహము నెక్కి దైత్య గణముం జంపెన్.94.

సురసంఘంబుల సన్నుతుల్ గొనుచు నా శుద్ధాఘసంపూర్ణులన్
ధరణీజాతుల కిష్టకామ్యద సమస్తంబైన లోకంబునం
దురువాత్సల్యము చూపునట్టి శివ సర్వోపాస్య సద్యశ్శివం
కరి హర్యక్షము నెక్కి దైత్యులను సంగ్రామంబునం గూల్చెరా.95
తిధుల వరుస లోన దివ్యమై వెలుగొందు 
చుండు నెల్లవేళ సుందరమయి
మెండు శుభము లొసగు రెండవ దయినట్టి
విదియ, నేడు వచ్చె విజయదశమి. 96

ముదము గూర్చు నెల్లగతుల ముఖ్యమైన దౌచు తా
నెదలలోన, దివ్యజయము లిచ్చుచుండు కార్యముల్
సదమలంపు భావమూని శ్రధ్ధతోడ జేసినన్
విదియ, నేడు వచ్చె గనుడు విజయదశమి పర్వమే.97

లీలావతి యొకరోజున
బాలకులకు వర్ణమాల వ్రాయించుటకై
చాలవు మరికాసిని బల
పాలిమ్మని సుతుని భర్త పాలికి బంపెన్. 98.

చాలా యలసిన ప్రియసఖి
బాలుని బహురోదనంబు బాపెడి యట్టుల్
లాలించుచు ముద్దులు మురి
పాలిమ్మని సుతుని భర్త పాలికి బంపెన్.99

శ్రీలం బంచవు క్షేమముల్ తెలియగా చేరంగ రాకుంటి వా
శీలాకాంతయె సర్వమంచు సతమున్ సేవించుచున్నా వటన్
చాలింకన్ భవదీయ నాటకము నీ సంపత్తిలోనుండి మా
పాలిమ్మంచును భర్తపాలికి సుతుం బంపెన్ సతీరత్నమే. 100.

ఆంధ్రుడ! వినరా సత్యం
బాంధ్రంబున సంస్కృతాన నలుపెరుగక యీ
యాంధ్రులు నిరతము చేసెడి
రంధ్రాన్వేషణము కవిత రాణించుటకే. 101

రంధ్రాన్వేషణ యనగా
రంధ్రంబులు వెదుకు పనియె రసికులు తామీ
యాంధ్రులు సతతము చేసెడి
రంధ్రాన్వేషణము కవిత రాణించుటకే 102.

ఆంధ్రాహార మదెట్టులౌను కనమే నాయావకాయన్ సదా
యాంధ్రత్వం బది యెట్టులబ్బు మదిలో హర్షంబు లేకుండగా
నాంధ్రంబౌనె సమస్త బంధు సఖులం దాప్యాయతల్ లేనిచో
రంధ్రాన్వేషణ చేయకున్న కవితల్ రాణించునే యిద్దరన్ 103

సంగతములౌచు బహువిధ
మంగళములుగూర్చు నట్టి మహితములగు సత్
సంగతులు తెలుపుటకు పం
చాంగమ్మును చేతబట్టి యాడిరి విబుధుల్. 104

సంతు లేనట్టి యొక్కర్తె సద్గతికయి
పెంచుకొనగోరి యర్థింప విజ్ఞ యపుడు
స్వీయ పుత్రుని దత్తత చేతు మనగ
మగడు, ప్రసవించి శిశువును మగువ కిచ్చె. 105



వినయము సాధువర్తనము విస్తృతసుందరతా నిధానముల్
ఘనదురితాపహారములు కామిత సత్ఫలదాయకంబులున్
వనజపరీమళంబు లవి భామల కందముగూర్చునట్టివౌ
స్తనములు లేని పూరుషుడు సంస్తవనీయుడు గాడు ధాత్రిలో. 106
అతులిత మగు రుగ్మతచే
సతమతమయి వదనసీమ సౌరు లడంగన్
వెతతో నద్దమునన్ రఘు
పతి! ముఖదర్శనము సేయ పార్వతి వెఱచున్. 107

చేతను డనియెడి ఛాత్రుడు
కాతరుడయి గురువులడుగ గడగడ పలికెన్
పోతన భారత రచయిత
సీతను బెండ్లాడి శివుడు శిశువుం గనియెన్. 108

కడుశక్తి జోడించి ఘనతరంబయిన
నక్షత్రశాల నా నగరంబులోన
నిర్మించి యున్నారు నిష్థాత్ము లందు
నడిరేయి రవిగాంచి నవ్వె నుత్పలము. 109

వడి నక్షత్రపుశాల కేగి తలచెన్ బాలుం డవాక్కై యటన్
నడిరేయిన్ రవిగాంచి, యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్
కడిమిన్ రాత్రులలోన గాదె యిచటం గన్పించ దొండైన దా
ముడుసంతానము లోషధీశుడు ముదం బున్నార లీవేళలోన్.110.

ఆ కమలాయతాక్షి గళహారము లన్నియు త్రుంచివేసి బ
హ్వాకులచిత్తయై గురుజనావళి చేరువ నేడ్చియేడ్చి య
స్తోకముగాగ పెల్లుబుకు దుఃఖము కన్నుల నడ్డగింప నీ
రై, కనువిప్పి డాసె సమరంబున గూలిన ప్రాణనాథునిన్. 111.

అనుమానం బొకయింత లేదు భువిలో నత్యంత దౌష్ట్యంబుతో
ననిశం బత్యవినీతులై మనుచు దేశాభ్యున్నతిం గూల్చుచున్
ధనదాహంబున సంచరించు ఘనులన్ దండించగా బూను న
మ్మునికిన్ గోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్. 112

ధర్మయుక్త మైన కర్మంబులం గూల్చి
సాధుజనుల నెపుడు బాధపెట్టి
సంచరించు జనుల శపియించగా బూను
మునికి గోపమె కద భూషణంబు. 113

దూడల బాలుద్రాపగను, దూపిలి యుండిన గోగణాలకున్
బేడను దీసి గ్రాసమును వేసిన పిమ్మట తౌడు నీరముల్
గోడకునున్న గాబునను గూరిమితో మిళితంబు సేయ నా
కోడలు మామ జూచి కనుగొట్టెను రమ్మని సైగ జేయుచున్.114.

గోడకు బ్రక్కన గట్టిన
దూడలు గోవులకు సేవ తోరపు బ్రీతిన్
వేడుకగా జేయుటకై 
కోడలు కనుగొట్టె మామకున్ రమ్మనుచున్. 115.

గోడను జాటు చేసుకొని కూర్చొని మిక్కిలి హర్షమందుచున్
మేడను గోసినట్టిదగు మేలిమిజామఫలంబు మెక్కగా 
నాడగ పాడగం బిలిచె నచ్చట నుండగ నమ్మతమ్ము డా 
కోడలు మామజూచి కనుగొట్టెను రమ్మని సైగ జేయుచున్. 116.

అమోఘమైన యత్నమున్, మహత్సులక్ష్యకాంక్షయున్'
క్రమానుసారవర్తనం బగణ్యభావదీప్తియున్
సమాదరంబుతో ధరించు సజ్జనాళి నెప్పుడున్
ప్రమాదముల్ ప్రమోద మిచ్చి రక్షసేయు నెల్లరిన్. 117.

సవ్యమార్గానుసారియై సర్వగతుల
జన్మభూమిని రక్షించు సవనమునకు
నడుము కట్టిన శ్రేష్ఠుడౌ నరుని కెపుడు
పెను ప్రమాదములు ప్రమోదమునకె సుమ్ము. 118.



అప్రతిమప్రభావుడయి యద్భుతవాక్యవిశేషయుక్తుడై
క్షిప్రగతిన్ సమాజమున శ్రేయములన్ సమకూర్చగల్గు వా
డప్రియముల్ దలంచని మహామహుడైన జగత్ప్రసిద్ధుడౌ
విప్రకులావతంసునకు బేరగు జంధ్య మదేల వేయగన్. 119

నవ్యభావాలు జీర్ణించ నరములందు
కులమతంబుల భేదంబు దలచకుండ
నుండు నీతండు పెండ్లాడ నుత్సహించె
విప్ర! వరునకు యజ్ఞోపవీత మేల.120

నీగమ్యంబగు సద్వివేకి వగుటల్, నిష్ఠాగరిష్ఠుండవై
రాగాత్మం బఠియించి సర్వజగతిన్ రాణించరా యన్న వా
డా గోపాలుడు బుద్ధిహీను డొకనా డాడెన్ స్వమిత్రాళితో
నాగేంద్రాభరణుండు చంపె నరకున్ నాకౌకసుల్ మెచ్చగన్. 121

వేగంబుగ నా విషమును
త్రాగిన వాడెవ్వ డింక తా నా కృష్ణుం
డాగక చేసిన దేమన
నాగాభరణుండు, కినిసి నరకుని జంపెన్ 122

అందరికి దీపావళి పర్వదినోత్సవ శుభాకాంక్షలు

ఆవిద్యార్థికి జన్మమాస మగుటన్ హర్షంబుతో మిత్రులన్
రావించున్, బహుదీపపంక్తు లచటన్ రమ్యంబుగా నుంచుచున్
వేవేల్ దీవెన లందుచుండి పలుకున్ విన్నాణ మేపారగా
దేవా!ఫాల్గుణమందు వచ్ఛును గదా దీపావళీ పర్వమే. 123

వత్సరాంతంబు నిజముగ వత్స! వినుము
ఫాల్గుణమున, దీపావళి పర్వము గద
యాశ్వయుజమున, కార్తీకమందు పిదప
శివుని గొల్చిన నబ్బును స్థిరసుఖంబు. 124 

రావా మిత్రుని బెండ్లికైన నిటకున్ రమ్యంబులౌ జ్ఞాపికల్
దేవా ఫాల్గుణమందు? వచ్చును గదా దీపావళీ పర్వమే
బావా! యాశ్వయుజంబులోన నపుడే వత్తున్ హరీ! నమ్ము నా
భావం బంచును సాగె వారి నడుమన్ బల్మారు సల్లాపముల్. 125

గుణముల్ దాల్చుట, సజ్జనాప్తు లగుటల్, కూర్మిన్ సదాచారులై 
యణుమాత్రం బవినీతి లేక సతతం బంతస్థమౌ వైరి షట్
గణమున్ సత్త్వవిహీనమౌ విధముగా గావించి యద్దాని మా
రణమేగా సుఖశాంతు లిచ్చి మనకున్ రంజిల్ల జేయున్ మదిన్. 126

రణములకు చేరకుండుట
గుణహీనులతోడ చెలిమి కోరక భువిలో
ప్రణతులు గొనదగు గుణధా
రణమే సుఖశాంతు లిచ్చి రంజిల జేయున్. 127

గణుతిం బొందని స్వాస్థ్యహీనత, కికన్ క్షామంబు వాటిల్ల, ధా
రుణిపై నిత్య మవార్యదుఃఖములకున్, రోగాలకున్ జూడ కా
రణ మా వృక్షము లెందు గూల్చుట గదా రాగాత్మతో తన్నివా
రణమేగా సుఖశాంతులిచ్చి మనకున్ రంజిల్ల జేయున్ మదిన్. 128