Wednesday 31 December 2014

నూతనసంవత్సర(౨౦౧౫) శుభకామనలు



నూతనసంవత్సర(౨౦౧౫) శుభకామనలు

ఆ.వె. శ్రీల నందవలయు చిరకాలవాంఛలీ

        నూత్నవత్సరాన  యత్నమునను

        చేతమలరునట్లు సిద్ధించవలెగాత

       క్రమత మీకటంచు కాంక్షజేతు            ౧.

ఆ.వె. స్వాస్థ్యవర్ధనంబు చక్కగా నుండుచు

        సంతసంబు గలిగి సతత మొదవు

        నూతనాబ్దమందు నూతనోత్సాహంబు

       క్రమత మీకటంచు కాంక్షజేతు             ౨.

ఆ.వె. ఇనుమడించు దీప్తి యీవత్సరంబంత

        అందుచుండవలయు ననుపమముగ

        సద్యశంబు లొసగు సత్కార్యములచేత

       క్రమత మీకటంచు కాంక్షజేతు            ౩.

ఆ.వె. సర్వదిశలలోన సంవత్సరంబంత

        విజయ మొసగునట్లు విస్తృతముగ

           నలముచుండ వలయు  ననుకూలపవనాలు

       క్రమత మీకటంచు కాంక్షజేతు            ౪.

ఆ.వె. మీకుటుంబ మందు మిగుల హర్షంబబ్బి

        బందుజనులసంగ వైభవంబు

       క్రొత్తవత్సరాన కూడంగవలె గాత
         క్రమత మీకటంచు కాంక్షజేతు                 ౫.


ఆ.వె. సన్నుతించదగిన సద్భావభాగ్యంబు

        శుభము లొసగునట్టి సూక్తిపంక్తి

        కార్యకరణశక్తి కలుగు నీయబ్దాన

        క్రమత మీకటంచు కాంక్షజేతు            ౬.

ఆ.వె. జగతివారలంద రగణిత సౌఖ్యంబు

        లందవలయు ననెడు సుందరమగు

           భావ మీయ వలయు భగవంతు డీయేడు

        క్రమత మన కటంచు కాంక్షజేతు         ౭.


ఆ.వె.  దేశభక్తి మరియు దివ్యానురాగంబు

         సాటివారిపట్ల సవ్యమైన

         ఆత్మసదృశభావ మందునీ యబ్దాన

         క్రమత మనకటంచు కాంక్షజేతు         ౮.

ఆ.వె.   విజయనగర దివ్య విద్యాలయంబందు

          విజయపంక్తి సతము విస్తరించ

              హర్షమబ్బు నూత్నహాయనంబంతయు

         క్రమత మన కటంచు కాంక్షజేతు.       ౯.


ఆ.వె.   హృద్యమైన రీతి విద్యార్థిలోకాన

          వినయదీప్తి గలుగ ననయమిచట

          సంతసంబు గూడు సంవత్సరంబంత
           క్రమత మనకటంచు కాంక్షజేతు            ౧౦.

హేపీన్యూ ఇయరు టూ యు ఆల్



హేపీన్యూ ఇయరు టూ యు ఆల్
(Happy New Year to you all)
కందపద్యరత్నమాలిక
హేనవభారత సంస్థిత
       మానవ సోదరులు! వినుడు, మహివారలలో
       జ్ఞానోదయమై యీయే
       డానందము కలుగవలయు ననుపమరీతిన్.                                   .
 పీడలు తొలగంగావలె
      నేడంతట నలమియున్న నిఖిలాఘంబుల్
      పోడిమిచెడి పోవలె నీ
      యేడిలకబ్బు శుభము లెల్లవిధాలన్.                                             ౨.
న్యూనత సత్కార్యములం
       దేనాడును చేరవలవ దీవర్షమునన్
       మానితమౌ సత్కారము
       మానవులకు కలుగవలయు మహి నెల్లెడలన్                                  ౩.
 ఇలలో నిత్యసుఖంబుల
      బలమందగవలెను సతము భాగ్యోదయమై
      యలఘు యశంబుల సిద్ధులు
      కలుగవలెన్ వర్షమంత ఘనతరఫణితిన్.                                          ౪.
జమానులు పనివాండ్రను
        నిజపరభేదములులేక నిఖిలజగానన్
        ప్రజలీ యబ్దంబతయు
        విజయంబుల నందవలయు విస్తృతరీతిన్.                                     ౫.
రు జలీ వత్సరమంతయు
       నిజమిది చేరంగబోవు నిష్ఠాగరిమన్
       యజనంబులు చేయుటచే
       ప్రజలందగవచ్చు శుభము, భవ్యసుఖంబుల్.                                  ౬.
టూకీ మాటలికేలా?
         నాకనిభంబౌచు జగతి నానావిధమౌ
         వ్యాకులగతులను దాటుచు
         చేకొనవలె సద్యశంబు చిన్మయ మగుచున్.                                   ౭.
యువతీయువకుల మనముల
            నవభారతరచనగోరు నవభావంబుల్
            జవసత్త్వాదుల వ్యాప్తులు
            స్తవనీయపు హాయనాన జరుగంగవలెన్.                                     ౮.
ఆలంబనమై సత్తువ
            కేలాగుననైన ధర్మ మీభువిలోనన్
            మేలని చూపించుట కీ
            కాలంబిక సాక్షియగుచు నమందవలెన్.                                  ౯.

నూతన సంవత్సర(౨౦౧౫) శుభాకాంక్షలు



నూతన సంవత్సర(౨౦౧౫) శుభాకాంక్షలు
సీ.             శ్రీమంతమై యొప్పి క్షేమంబులం గాంచి
బహుసౌఖ్య మీనేల పడయవలయు
సస్యానుకూలమౌ సద్వృష్టి యీయేట
కురియుచుండగవలెన్ భరతభువిని,
కర్షకుల్ కార్మికుల్ వర్షమంతయు ముదం
బందుచుండగవలె నన్నిగతుల
పండు పంటలకెల్ల మెండైన మూల్యంబు
లందంగవలె నూత్న హాయనమున
విద్యార్థి హృదయాలు విమలసద్భావాల
పరిమళంబులతోడ వరలవలయు
యీవత్సరంబంత యిమ్మహీస్థలిలోన
సత్కృతుల్ నిరతంబు సాగవలయు
గురుజనంబుల హృదుల్ సురుచిరవాత్సల్య
పూర్ణంబులై తృప్తి పొందవలయు
సౌభ్రాతృభావంబు సర్వమానవులలో
వ్యాపింపవలె నూత్న వత్సరమున
ధర్మమార్గంబులో ధరణీతలంబంత
వర్తిల్లి కనవలెన్ వైభవంబు
నింగి నంటుచునున్న నిత్యోపయోగ్యాల
ధరలజోరింతైన తగ్గవలయు
ఆకాశసుమమైన హర్షంబు సామాన్య
జనుల జేరగవలెన్ తనివిదీర
భారతీయులతోడ భవ్యమౌ స్నేహంబు
జరుపంగవలె విశ్వజనములెల్ల
ఆ.వె.            మూడుపూవులందు ముచ్చటౌరీతిగా
నారుకాయలిచట నబ్దమంత
కాయుచుండవలయి నమైన యశములీ
భారతంబు సతము పడయవలయు.

ఆ.వె.            సర్వజనులు సుఖము లుర్విలో నందుచు
స్వాస్థ్య మందుచుండి సకల శుభము
లందుచుండి నూత నాబ్దంబునందంత
                        శాంతి యలమవలయు సర్వగతుల.