Sunday 14 September 2014

శ్రీ సత్యనారాయణవ్రతకథ(తెలుగు పద్యకావ్యము) అధ్యాయము-౨



శ్రీసత్యనారాయణ వ్రతకథ
(తెలుగు పద్యకావ్యము)
రెండవ అధ్యాయము
కం.  శ్రీదంబగు సత్యవ్రత

మాదరమున జేసి భూమి నతులితమగు సౌ

ఖ్యోదయము గాంచి వరలిన

మేదినిగల జనుల కథలు మీకు వచింతున్                          ౧.
కం.  మోదంబందుచు వినుడని
యాదిమ కాలంబునందు నామునివర్యుం
డాదరమొప్పగ శౌనకు
డాది మునీంద్రులకు జెప్పె హర్షంబొదవన్.                       ౨.
సీ.     కాశికానగరాన కమనీయచరితుడై

వేదార్థవేత్తయౌ విప్రుడొకడు

బహుకుటుంబముతోడ భాగ్యమింతయులేక

దారిద్ర్యమునకందు తాళలేక

క్షుద్భాధపోగోట్టు సద్బంధుడొకడైన

కన్పించకుండుటన్ కాశిలోన

భిక్షాటనంబుతో పిల్లవాండ్రనుసాక

శక్యంబు గాకున్న సంతతంబు

ఆ.వె. దు:ఖభరముచేత దురవస్థలందుండి

బాధచెందుచుండి బహుళగతుల

చూపలేక ముఖము సుతులకు భార్యకు

వెరచి తిరుగుచుండ వీధులందు.                                     ౩.
కం.   ఆవిప్రుని కట్టెదుటను

శ్రీవిభు డొకవిప్రురూపు చేకోని పలికెన్

భో విప్ర! దు:ఖితుండయి

యీవిధి తిరుగాడుచుంటి వేలనొ చెపుమా?                                ౪.
కం.   అనిపలికిన నాతండనె

వినుడో మహనీయచరిత! విప్రవతంసా!

ధనహీనత, బహుసంతతి

ఘనదు:ఖపు కారణములు కావున నాకున్.                                ౫.
కం.   దారిద్ర్యభూత మణగెడు
దారిని చూపించుడార్య! ధన్యుడ నగుదున్
మీరలు మహిమాన్వితులని
కోరితినని పలుక నపుడు కూరిమి నిండన్.                                 ౬.
ఆ.వె. వినుమటంచు పల్కె వేదవేద్యుండిట్లు

సత్యదేవు వ్రతము సర్వజగతి

కాంక్షలన్ని దీర్చుకావున భూసురా!

ధీయుతుండవౌచు చేయుమయ్య!                                         ౭.
ఆ.వె. అనుచు వ్రతవిధాన మంతయు బోధించి
యొక్క క్షణములోన  నక్కజముగ
నచట విప్రవర్యు డగుపించకుండినన్
మాన్యుడంచు నతని మహిమ దలచి.                                      ౮.
ఆ.వె. ఇంటికేగి యచట నీరీతి భగవాను

చెంతజేరి పలికె  సంతసమున

భాగ్యదాత! చక్రి! వైకుంఠవాసి! హే

సత్యదేవ! నీదు సద్వ్రతంబు.                                               ౯.
ఆ.వె.  చేయబూనినాడ సిరిసంపదలు లేవు
చిల్లిగవ్వయైన చేతలేదు
నమ్ము మీవ్రతంబు నాచేత చేయించు
భారమీవె పూనవలయు దేవ!                                          ౧౦.
ఆ.వె. నిన్నె నమ్మినాడ! మన్నించు నన్నంచు

బహువిధంబు లిట్లు భక్తితోడ

హరికి వందనంబు లర్పించి, ప్రార్థించి

రాత్రి నిద్రపోక యాత్రమునను.                                      ౧౧.
ఆ.వె. ఉదయ కాలమందు ముదముతో నానాడు
నిత్య మాచరింఛు కృత్యములను
దీర్చి విధిగ సంధ్య వార్చిన పిమ్మట
భిక్షగోరి చేరె వీధులందు.                                                ౧౨.
సీ.     భవతి! భిక్షాం దేహి బ్రాహ్మణుండను తల్లి!

బహుసంతు గన్నట్టి వాడనమ్మ!

దారిద్ర్యబాధతో తాళలేకున్నాడ

కనికరించుడటంచు ననుదినంబు

కాశికాపురమందు కాళ్ళరుగునందాక

తిరుగుచుండెడి వాడు, కరుణతోడ

పట్టెడు భిక్షంబు పండితుండని యంచు

పెట్టువారలు లేని వీధులందు

ఆ.వె. చిత్రమేమొగాని చేరనాహ్వానించి

గృహములందు బిలిచి బహువిధముగ

సన్నుతించినారు సత్కారములు చేసి

విప్రవరుని నాడు విజ్ఞులగుచు.                                        ౧౩.

తే.గీ.  విస్తృతంబగు ధనరాశి వేగముగను

పొంది భూసురవర్యు డానందమంది

సత్యదేవుని మదిలోన స్మరణ చేసి

తలచె నీరీతి ప్రాప్తమౌ ద్రవ్యమరసి.                                     ౧౪.
ఉ.    నిక్కము ద్రవ్య మీవిధిని నేడు లభించుట యస్మదీయమౌ

చక్కని ప్రజ్ఞ కాదికను సర్వజనావళి నన్ను విప్రుగా

మిక్కిలి గౌరవించుటయు మిథ్యయె, కారణ మెంచిచూడగా

మ్రొక్కినవారి కెల్లెడల మోదము గూర్చెడి వాడు(సు)దేవుడే.         ౧౫.
ఆ.వె. అనుచు గర్వరహితు డాబ్రాహ్మణుండంత

ద్రవ్యమంత బోసి సవ్యమతిని

వ్రతము చేయుకొరకు వలసిన సామగ్రి

క్రయము చేసి పిదప రయముతోడ.                                     ౧౬.
ఆ.వె. బంధుజనుల బిలిచి, బ్రాహ్మణాహ్వానంబు

చేసి, వారిగూడి చిన్మయుడగు

సత్యదేవు వ్రతము శ్రద్ధతో చేయంగ

సంతసంబు గలిగె సర్వగతుల.                                        ౧౭.
తే.గీ. బాధలన్నియు తొలగంగ బ్రాహ్మణుండు
సౌఖ్యసంపత్తి, సద్విత్త సహితుడగుచు
సత్యదేవుని కృపచేత నిత్యమెంతొ
హాయి నందుచు జీవించె నవనిలోన.                                ౧౮.
కం.   ప్రతిమాసమందు వ్రతమును

క్షితిసురు డత్యధికభక్తి జేయుచు నిలలో

నతులిత విభవముగని శ్రీ

పతికడ కటుపైన జేరె భాగ్యవశానన్(వ్రతమహిమమునన్)     ౧౯.
ఆ.వె. అతడు చేయుచుండ నద్దాని నెవరేని
కాంచి యుండి గాని, ఘనత దెలిసి
వ్రతము నాచరించి వైభవంబుగ జీవి
తంబు గడపి చక్రధరుని కడకు.                                       ౨౦
ఆ.వె. చేరినట్టి వారు వేరెవ్వరున్నార

లనఘ! చెప్పుడంచు మునులు పలుక

సూతు డిట్లు చెప్పె చేతంబు లలరంగ

కట్టెలమ్మువాని గాథ నపుడు.                                          ౨౧.
కం.   ఒకరోజున ద్విజవర్యుం
డకలంక మనస్కుడౌచు నావ్రత మింటన్
సకలైశ్వర్యద మఘనా
శకమగుట గృహిణిని గూడి జరుపుచు నుండెన్.                    ౨౨.
ఆ.వె. కట్టెలమ్మువాడు కానలో కాష్ఠముల్

మ్రోళ్ళు సేకరించి మోపుగట్టి

నోటమాటరాక నేటికి చాలంచు

శిరము కెత్తి గృహము చేరబోయి.                                    ౨౩.
ఆ.వె. దాహబాధచేత దేహమ్ము వణకంగ
విప్రగృహము గాంచి విమలమైన
జలము దొరకుననుచు నలసియుండుటచేత
దీనవదనుడౌచు లోనికేగె.                                              ౨౪.
సీ.     దాహార్తుడైయున్న తత్కాష్ఠవిక్రేత

ఇంటిలోపలి కప్పు డేగి చూడ

విప్రోత్తముండందు విధ్యుక్తముగ నాడు

సత్యదేవుని పూజ సలుపుచుండె

 సాక్షాత్తు వైకుంఠుసన్నిధి యన్నట్లు

దీపిల్లుచుండె నా ద్విజుని గృహము

తన్మయత్వమునంది దాహపీడను వీడి

భక్తితో వంగి యాసక్తితోడ

తే.గీ. భూసురోత్తమ! యేకాంక్షకోసమిపుడు

వ్రతము చేయుచునుంటివి? ఫలమదేమి?

దివ్యతేజంబుతో నున్న ఈ దేవుడెవరు?

తెలియ జెప్పుమ నాకంచు పలికినంత                              ౨౫.
తే.గీ.  సత్యదేవుని వ్రతమిది సత్ఫలదము
ధనము, ధాన్యంబు, భాగ్యంబు లనగనేమి
సకల కామ్యదమైనదీ సద్వ్రతంబు
తొలగజేయును దారిద్ర్యమిలను వినుమ.                              ౨౬.
తే.గీ. అనిన విప్రుని మాటల కరుసమంది

తాను జేయంగ ప్రతినను బూని యపుడు

తీర్థ మొకయింత సేవించి తేజమలర

కాష్ఠవిక్రయమొనరింప కదలె నతడు.                                ౨౭.
తే.గీ. సత్యదేవుని నామసంస్మరణతోడ
ధనికులున్నట్టి వాడకు తరలియతడు
కట్టెపుల్లలు కొనుడంచు గట్టిగాను
పిలుచుచున్నట్టి వేళ నావీధులందు.                                ౨౮.
ఆ.వె. స్వామి మహిమచేత ప్రాంప్తించె ద్విగుణమౌ

మూల్య మలయకుండ, మునుపు తనకు

నందవలసి యున్న వందగా ముదముతో

నాట్యమాడసాగె నమ్మలేక.                                             ౨౯.
సీ.     ఆపణంబున కేగి యత్యుత్తమంబైన
కదళీఫలంబులన్ క్రయముచేసి,
గోఘృతంబును గూర్చి, గోక్షీరమును దెచ్చి
దధిశర్కరాదులన్ విధిగ బొంది,
గోధూమచూర్ణంబు, మాధవార్చనకోస
మావశ్యకంబైన వన్ని గూర్చి
బాంధవాహ్వానంబు, బ్రాహ్మణప్రార్థనల్
చేసి వారిని గూడి శ్రీకరమగు
ఆ.వె. సత్యదేవు వ్రతము సానందచిత్తుడై
యధిక భక్తితోడ నాచరించి
ధనము యశము పొంది దారిద్ర్యదూరుడై
బహుళసుఖములందె నహరహమ్ము.                               ౩౦.
ఆ.వె. బ్రతికినంత దనుక భక్తిభావముతోడ

మరువకుండ యన్ని మాసములను

వ్రతము చేయుచుండి వైకుంఠమును బొందె

కట్టెలమ్మువాడు కడకటంచు.                                         ౩౧.
ఆ.వె. మౌని సూతుడిట్లు శౌనకాదులతోడ
విప్రవరుడు మరియు పేదయైన
కట్టెలమ్మువాడు కైవల్యమును జేరి
రంచు బలికె వ్రతము నాచరించి.                                    ౩౨.
రెండవ అధ్యాయము సమాప్తము.




Wednesday 3 September 2014

వినాయక స్తుతి


కం.   వరసిద్ధివినాయక నీ
        కరుణను మాపైన జూపి కావుము మమ్మున్

        నిరుపమమగు సద్విద్యలు

        సురుచిర విజయాలు గూర్చి సుందరమూర్తీ!

శా.   శ్రీమంతంబగు కిల్తమాఖ్యపురిలో చిద్రూపముం దాల్చుచున్

        స్వామీ! యిచ్చట యీ నవోదయమునన్ సత్పూజలం బొందుచున్

        క్షేమంబుల్ విజయంబు లిచ్చుచు సదా చేయూతగా నిల్చుచున్
                     భూమిన్ కావుము ఛాత్రసంఘమునికన్ పూజ్యా! భవానీసుతా



సీ.      గజవక్త్రమును దాల్చు కమనీయరూపియౌ


వరసిద్ధివిఘ్నేశ! వందనంబు

శూర్పకర్ణములూను సుందరాకారివౌ


వరసిద్ధి గణపతీ! వందనంబు

లంబోదరంబుతో సంబరంబులు నింపు


వరసిద్ధివిఘ్నేశ! వందనంబు

యజ్ఞోపవీతార్థ మహిరాజములు దాల్చు


వరసిద్ధి గణపతీ! వందనంబు

మోదకంబులవైపు సాదరంబుగ జూచు


వరసిద్ధివిఘ్నేశ! వందనంబు

ఇక్షుఖండముజూచి యెంతేని ముదమందు


వరసిద్ధి గణపతీ! వందనంబు

ప్రతివర్ష మరుదెంచి సతతసౌఖ్యం బిచ్చు


వరసిద్ధివిఘ్నేశ! వందనంబు

వివిధంబులైనట్టి విఘ్నసంతతి బాపు


వరసిద్ధి గణపతీ! వందనంబు

తలచిపిల్చినవారి కలఘుసంపదలిచ్చు


వరసిద్ధివిఘ్నేశ! వందనంబు

విజ్ఞానసంపత్తి విద్యార్థులకు గూర్చు


వరసిద్ధి గణపతీ! వందనంబు

కార్యాల నన్నింట ఘనజయంబులు నింపు


వరసిద్ధివిఘ్నేశ! వందనంబు


ఏరూపమున బిల్వ నారూపమున బల్కు 


వరసిద్ధి గణపతీ! వందనంబు

ఆ.వె.  జవహరాఖ్యమైన చదువుల నిలయాన


మోదభరితమగు నవోదయాన


దీక్షబూని నిన్ను దివ్యసుందరదేహు


నుంచి పూజ చేయుచుంటి మిచట.

ఆ.వె.   మేము చేయు పూజ కామోదమును దెల్పి


స్వీకరించి, మమ్ము చేరదీసి


సుముఖముద్రతోడ శుభములందగజేసి


కావుమయ్య యెపుడు ఘనతరముగ.

ఆ.వె.   వినయదీప్తి యొసగి విద్యాభివృద్ధికై


యాశిషంబు లొసగి యఖిలములగు


నికషలందు మాకు నిరుపమ విజయాల

          నందజేయుమయ్య! యనవరతము

(జ.న.వి. కిల్తంపాలెం, గణపతి నవరాత్రులు(౨౦౧౪) సందర్భంగా వ్రాసినవి.