Monday 31 March 2014

వి జ య కు వీడు కో లు

                       వి కు వీడు కో లు

విభజనంబుతోడ వేర్పాటు భావంబు
కలుగజేసినావు ఘనతరముగ
సోదరాళిలోన మోదంబు క్షీణించ
ప్రజలు మరువలేరు విజయ! నిన్ను. 1.


నుల జీవనంబు సకలభారతమందు
దుఃఖభరితమయ్యె తోరమైన
ధరలవృద్ధివలన నిరతదైన్యం బబ్బె

ప్రజలు మరువలేరు విజయ! నిన్ను. 2.


శము సన్నగిల్లె దిశలలో నవినీతి
యలముకొనెను నిత్య మధికముగను,
నింద లధికమయ్యె నీకాలమందున,
ప్రజలు మరువలేరు విజయ! నిన్ను. 3.


కుత్సితంబు పెరిగె కువలయంబందంత
మతముపేర కలహ మతులమగుచు
విస్తరించియుండె వాస్తవం బియ్యది
ప్రజలు మరువలేరు విజయ! నిన్ను. 4.


వీడుకోలు నీకు విజయాఖ్య వర్షమా!
మరువలేని వెన్నొ మహితముగను
కూర్చినావు నిజము కువలయంబునకీవు
ప్రజలు మరువలేరు విజయ! నిన్ను. 5.


కోరుకున్నదంత తీరంగ నీరీతి
తనిసియుండి మరల ధరణికీవు
అరువదేండ్లకాల మగుపించకున్నను
ప్రజలు మరువలేరు విజయ! నిన్ను. 6.


లుప్తమయ్యె మమత, ప్రాప్తించె ద్వేషంబు,
స్వార్ధమధికమయ్యె సకలజగతి
నిజముబలుకుచుంటి నీకాలమందున
ప్రజలు మరువలేరు విజయ! నిన్ను. 7.

Sunday 30 March 2014

శ్రీ జయనామసంవత్సర (ఉగాది) శుభకామనలు


శ్రీ నాసంత్స(ఉగాది) శుకాలు
(సుందర కందపద్య సుమమాల)
శ్రీకరమై జయవత్సర

 మాకరమై శాంతి కతుల హర్షాత్మకమై

 చేకూర్చు గాత, శుభములు

ప్రాకటముగ యశములొసగి బహుసుఖదంబై    1.

యములు కలుగంగా వలె

భయమంతయు తొలగిపోయి ప్రజలందరకున్

జయవత్సరకాలంబున

క్షయమై కల్మషము, సుఖము సమకూరవలెన్     2.

తనములు సాగగావలె

క్షితిపయి సత్యంబు నిలుప, సిరులందవలెన్

క్షితిజముల పెంపకంబున

శతశాతము హాయికలిగి జయవర్షమునన్           3.

నానావిధసత్క్రతువులు

దానాదులు జరుగవలయు ధర్మము గావన్

మానవులు సత్యసమరపు

సైనికులై నిలువవలయు జయవర్షమునన్.           4.

తభేదము నశియించుట

కతులిత యత్నంబు జరిగి యత్యద్భుతమౌ

వ్రతదీక్ష బూనగావలె

క్షితిపయి జయహాయనాన క్షేమముగలుగన్.       5.

సంపదలకు నిలయంబై

సంపూర్ణవికాసమంది జగమంతటిలో

నింపైన యశములాంధ్రము

సంపాదించంగ వలయు జయకాలమునన్.       6.

వత్సరమంతయు భువిపై

సత్సౌఖ్యము లందవలయు, జయహాయనమం

దుత్సాహవర్ధనంబయి

సత్సంగతి కలుగవలయు జనులందరకున్     7.

మణీయాద్భుతభావం

బమరగ జయకాలమందు హర్షాన్వితులై

సముచితవర్తనతో జను

లమలిన యశమందవలయు నాంధ్రావనిలోన్. 8.

శుభకరమై జయవర్షము

ప్రభవాదుల మేటియౌచు బహువిధములుగా

ప్రభవింపజేయు జయములు,

విభవంబులు భారతాన విస్తృతరీతిన్.             9.

రతావని కీయబ్దము

వరమై సత్ప్రభుత నొసగి వరుసజయాలన్

నిరతము గూర్చుచు ప్రజలకు

సిరిసంపద లొసగవలయు శ్రీమంతంబై.     10.

కాలోచిత సద్వృష్టియు,

మేలౌ సస్యంబులంది మేదినిలోనన్

పాలకులకు జయవత్సర

కాలంబున స్వాంతశుద్ధి కలుగంగవలెన్.        11.

నములలో సద్భావము

జనులందరిలోన కలిగి సద్వైభవమీ

ఘనతరజయవర్షంబున

ననుపమగతి గలుగవలయు నాంధ్రావనిలోన్. 12.

వ్యంబౌ రాష్ట్రంబున

సవ్యాలోచనముచేత సత్సౌఖ్యంబుల్

దీవ్యజ్జయవత్సరమున

భవ్యంబుగ నందవలయు ప్రజలందరకున్.     13.

లుప్తంబై యన్యాయము

వ్యాప్తిం జెందంగ సత్య మాంధ్రావనిలో

ప్రాప్తములౌ సచ్ఛుభ సం

దీప్తులు జయవత్సరాన స్థిరభావముతోన్.        14.
జయనామసంవత్సరం
అందరికీ సుఖసంతోషాల నందిచాలని ఆకాంక్షిస్తూ,
మీ
హ.వేం.స.నా.మూర్తి,

Monday 24 March 2014

తోటకూర

శక్తిదాయక మియ్యది సకలగతుల
నుపకరించుచు సర్వదా యుర్వియందు
గూర్చు నారోగ్యభాగ్యంబు కూర్మిమీర
మేటి యన్నింట చూడంగ తోటకూర.               1.


చేలలోనుండు, తోటలో చేరియుండు,
ఇండ్లదరులందు దొడ్లలో నిమిడియుండు,
ఎందు బెంచిన సంతస మంది యుండు
మేటి యన్నింట చూడంగ తోటకూర.               2.


పిన్నవారికి, స్త్రీలకు పెద్దలకును
స్వాస్థ్యవర్ధన మొనరించు, సన్మతినిడు
పథ్యమైనట్టి శాకమీ వసుధలోన
మేటి యన్నింట చూడంగ తోటకూర.               3.


హితము గూర్చును, దేహాన వెతల నణచు,
లాభదాయకమై పెంచు ప్రాభవంబు,
ధరణి జనముల కండయై ధరను వెల్గు
మేటి యన్నింట చూడంగ తోటకూర.              4.


కూరయై యుండు, పప్పుతో కూడియుండు,
పులుసుకూరగ రూపంబు పొందుచుండు,
ఉర్వి నెట్లున్న రుచ్యమై యొప్పుచుండు
మేటి యన్నింట చూడంగ తోటకూర.              5.


ప్రాణములు దీసి, ఖండించి పాత్రలోన
నుడక బెట్టుచు బాధించుచున్న నైన
నాగ్రహించక జనులకు హర్ష మొసగు
మేటి యన్నింట చూడంగ తోటకూర.                6.


పరుల కుపకార మొనరించుకొరకు జగతి
జన్మ నొసగెను దేవుండు సత్యమనుచు
త్యాగభావాన నర్పించు తనను తాను
మేటి యన్నింట చూడంగ తోటకూర.                7.


సాత్త్వికాహార మియ్యది జనుల కిలను
బుద్ధివికసన మొనరించు భోజ్యమగుచు
స్వార్థ మొక్కింతయును లేక సత్య మవుర!
మేటి యన్నింట చూడంగ తోటకూర.                 8.

మతసహనం

బంగార మేరీతి సింగార మొలికించు
          నగల యాకృతి నందు జగతిలోన,

క్షీరమేరీతిగా ధారుణీతలమందు
          బహురూపముల దృప్తి పరచుచుండు,

మృత్తు తానేరీతి మేదినీస్థలిలోన
          వివిధాకృతులలోన విశదమగును,

శిలయు నేరీతిగా పలురూపములు పొంది
          పూజింపబడుచుండు పుడమిలోన

నట్లె విశ్వంబు సృజియించి, యవనివారి
కఖిల సౌఖ్యంబు లందించి యనవరతము
రక్ష చేసెడి భగవాను డీక్షితిపయి
యెన్ని రూపంబు లందునో యెరుగ దరమె.           1.


రాముడై యొకసారి కామితంబుల దీర్చు,
          కృష్ణుడై ధరవారి తృష్ణ లణచు,

హనుమ తానేయౌచు నద్భుతం బొనరించు
          వేంకటేశ్వరుడౌచు సంకటములు

హరియించి భక్తాళి కరుసమందించును,
          లింగరూపంబులో సంగతముగ

శంకరుండై వెల్గు సజ్జనావనుడౌచు
          నాల్గుమోములు దాల్చి నలువయౌను,

శక్తిరూపంబులో నుండు, భక్తులైన
సాధుజనముల పాలిటి సర్వగతుల
నండయై నిల్చి ధైర్యంబు నందజేసి
ధర్మ రక్షణ చేసి యీ ధరణి గాచు.                     2.


కరుణామయుండౌచు నిరతసౌఖ్యంబు లీ
          జగతికందించును, సత్త్వమూని

శిలువనైననుగాని చెదరకుండగ మోయు
          క్రీస్తురూపంబుతో రేలుబవలు,

తానె యల్లాయౌచు తనను గొల్చెడివారి
          పాతకంబుల ద్రుంచి బహుళగతుల

బ్రోచువాడై సర్వభోగంబు లందించి
          దయజూచు సర్వదా ధరణి జనుల

మందిరంబులలోనుండు, మస్జిదులను,
చర్చి యనియెడి ప్రాంతాన సన్నుతిగన
వాసముండును భువిలోన వైభవముగ
నన్నిరూపంబులును దానె యగుచునుండి.          3.


హరియనుచును, హరయనుచును
సురుచిరముగ క్రీస్తటంచు సుందరఫణితిన్
నిరతం బల్లా యనుచును
స్మరియించెడివారి కొసగు సర్వార్ధంబుల్.             4.


భావానుగుణ్య రూపం
బేవేళను బొంది బ్రోచు నిలవారల నా
దేవాధిదేవు డెల్లెడ
జీవులలో జేరియుండి శ్రీప్రదుడగుచున్               5.


ఎవ్వార లెట్టిరూపము
నెవ్విధమున గొల్వ బలికి, యింపలరంగా
నవ్వారికి సుఖసంతతు
లివ్వంగా బూనుచుండు నీశ్వరుడు దయన్           6.


తనమతము గొప్పదంచును
ఘనతర దర్పంబుతోడ కలుషాత్ముండై
యనుచితముగ పరనిందలు
మనుజుం డొనరింపరాదు మదమత్తుండై              7.


పరమతనిందాసక్తుని
కరుణాత్ముండయ్యు ప్రభుడు కలుషోదధిలో
చిరకాలము పడద్రోయును
నరులీ సత్యంబు తెలిసి నడువగ వలయున్          8.


పరమత సహనము జూపెడి
నరు డిహమున వలసినట్టి నానార్థంబుల్
స్థిరయశము లంది మీదట
పరసుఖములు పడయగలడు పరమాత్ముకృపన్.  9.


ఔరా! ముస్లిము వనితలు
శ్రీరాముని గొల్వబూని చేరిరి యిచటన్
వీరల కారఘురాముడు
కారుణ్యము జూపి దీర్చు కామితము లికన్            10.


మహ్మదీయాంగనామణుల్ మహితగుణుని
రామచంద్రుని పూజించ నీమమొప్ప
చేరు తీరిది స్పష్టంబు చేయుచుండె
మానవులలో పరమతాభిమానదీప్తి.                    11.

Sunday 23 March 2014

స్త్రీమూర్తి

జగతిలో మహిళకు సాటి యొక్కరులేరు
          తనకు తానేయౌను తథ్యమిద్ది,

నరుని కన్నింటిలో వరుసగా తోడౌచు
          ననుదినంబును హర్ష మందజేయు,

సృష్టి చేయును, పెంచు నిష్టసౌఖ్యం బిచ్చు
          కారణంబై నిల్చు ఘనత కెపుడు,

గృహిణియై యన్నింట సహకార మందించు
          బహుకష్టముల కోర్చు నహరహమ్ము

అతివ చేయలేని దవనిలో నేదేని
కానరాదన ననుమానమేల?

ముదిత కేదియేని ముద్దార నేర్పింప
నేర్చు నందమొప్ప నిష్ఠ బూని.                           1.


చిత్రమందు జూడ చిత్తశుద్ధిగ నీమె
గ్రంథపఠనజేయు కాంక్షతోడ
ఉన్నతాశయమున నుపవిష్టయై యుండె
పొత్తమొకటి చేతబూని యదిగొ.                           2.


గ్రంథనామం బేమొ కానరాకున్నది
          భవ్యమై వెలుగొందు భారతంబొ,

పరమపూజ్యంబైన భాగవతంబేమొ,
          కాకున్న నెంతేని ఘనతగాంచు

వాల్మీకి రచితమై కల్మషంబులబాపు
          గ్రంథరాజంబైన రామచరిత

మదియును గాదేని యత్యుత్తమంబైన
          ధర్మశాస్త్రంబౌను తనమనమున

హర్షమును నింపి, యెంతేని హాయినొసగు
నట్టి గ్రంథంబు నీయమ యంది మిగుల
శ్రద్ధతో జేరి యిచ్చట చదువబూనె
నంద మొలుకంగ ధన్య యీ యతివ యందు.        3.


జ్ఞానార్జనంబు చేయుట
కేనాడును వయసు, లింగ మీభువిలోనన్
కానేరవు బాధకములు
మానినులకు విద్య మిగుల మాన్యత గూర్చున్.      4.

Tuesday 18 March 2014

వేదవిద్యార్థి

ఒకచేతి వ్రేళ్ళతో నొప్పుగా వాక్యాలు
          లెక్కించు వాడౌచు నొక్కచేత

జందెమంటుచునుండి శ్రద్ధతో పన్నాలు 

          వల్లించు చున్నట్టి బాలు జూడ
వేదవిద్యాభ్యాస మాదరంబుగ జేయు
          సచ్ఛాత్రు డనుటలో సందియంబు

లేదు కొంచెంబైన వేదరాశిని యీత
          డాపోశనం బంది యనుపమమగు

ఖ్యాతి నందుట నిక్క మాపైని వేదార్థ
          భాష్యంబు పఠియించి బాగుగాను

లక్షణంబులు నేర్చి దక్షుడై వెలుగొందు
          విజ్ఞానఖని యౌచు వివిధగతుల

ధర్మానురక్తుడై ధరణిపై వేదోక్త
          కర్మంబు లన్నియు ఘనతరముగ

జరుగునట్లుగ జూచు సామర్ధ్యముం బొంది
          విశ్వాని కాప్తుడై వినుతులొందు

ఇతని గన్నతల్లి సుతుని వైభవదీప్తి
గాంచి ధన్యనైతి నంచు మిగుల
సంతసించుచుండు సర్వకాలములందు
సత్సుఖంబు లొదవి జగతిలోన. 1.


వేదము సర్వవిధంబుల
శ్రీదంబై జగతిలోన స్థిరసౌఖ్యంబుల్
మోదంబు గలుగ జేయుచు
నాదరముగ గాచు జనుల నత్యుత్తమమై. 2.


నిగమాధ్యయనం బెంతయు
తగినట్టిది విప్రతతికి ధరణి సురత్వం
బగణిత యశముం గూర్చుచు
భగవానుని యండ నొసగు భాగ్యదమగుచున్ 3.

Monday 17 March 2014

లేఖ

క్షేమమిచ్చట నేను శ్రీమతీ! నీవెట్టు
          లున్నావు? క్షేమమా యువిద నీకు?

నిన్నె తలచుచునుండి నిరతంబు నేనిందు
          నీరూపు మదిలోన నింపుకొంటి

నిద్రలో మెలకువ న్నీసుందరాకార
          మగుపించు చున్నదో యతివ నిజము,

స్వామికార్యంబూని నీమంబుతో నింత
          దూర మేతెంచితి చారుశీల!

కార్యనిర్వహణాన కాంత! యొక్కింతైన
          ఉత్సాహ మెదలోన నూనదాయె

నీసాహచర్యంబు, నీచిద్విలాసంబు
          ప్రేమపూర్ణంబైన పిలుపునకును

దూరమై యున్నట్టి కారణంబున నాకు
          క్షణ మొక్కయుగముగా గడచుచుండె

కొద్దిరోజులలోనె కోరినట్టుల నేను
          నీచెంత కేతెంతు నిర్మలాంగి!

సుదతి! నారాక కోసమై చూచుచుండి
ధైర్యమును వీడవలదంచు తనమగండు

వ్రాసి పంపిన లేఖ నాపడతి చూచి
యతుల మైనట్టి సంతస మందె నపుడు.

Friday 14 March 2014

చిన్ని కృష్ణ


అన్నివేళలందు నత్యంత వాత్సల్య
పూర్ణ మానసమున పుడమి జనుల
గాచునట్టి దేవ! కంసారి! కేశవా!
నిద్రనున్న కృష్ణ! నిన్ను గొలుతు.               1
.

పొట్టలోన సకల భువనంబులం దాచి
చిన్నవాడ వౌచు నెన్నదగిన
మహిమలెన్నొ చూపి మముగావగా బూను
చిన్ని కృష్ణ! నీకు చేతునతులు.                   2.


క్రోధమేల మీకు? బాధచెందగనేల?
శాంతమూని మనుడు జనులటంచు
తెలుపగోరి యిట్లు స్థిరమానసంబుతో
నిద్రబోవు కృష్ణ! నిన్ను గొలుతు.                   3.


జగతి నేలునట్టి సర్వేశ్వరుండవై
బాలుపగిది మారి లీలజూపి
యోగనిద్రబోవు యోగేశ్వరా! కృష్ణ!
వెన్నదొంగ! నిన్ను సన్నుతింతు.                  4.


స్తుతుల కందబోవు, మతులతో యోచింప
చిక్కబోవు నిన్ను చేరుటెట్లు?
శుద్ధమానసమున జోడింతు కరములు
వాసుదేవ! కొనుము వందనంబు.                   5.

Thursday 13 March 2014

పుస్తకాలపురుగు

పుస్తకంబు భువిని హస్తభూషణ మండ్రు
భూషణంబె కాదు పుడమి జనుల
కధికమైన జ్ఞాన మందించు శ్రేష్ఠుడౌ
హితునివలెను చేరి ఎల్లవేళ. 1.


పుస్తకంబు చదువ మస్తిష్కవికసనం
బగుట సత్యసూక్తి యన్నిగతుల
పొత్తమునకు సాటి పుడమి లేదొక్కటి
పుస్తకంబు శ్రేష్ఠభూషణంబు. 2.


మంచి చెడులు తెలుపు, మమతానురాగాలు
పంచుచుండి జనుల కంచితమగు
ధర్మపథములోని మర్మంబులన్నియు

విస్తరించి చూపు వివిధగతుల. 3.

ఆచరించదగిన దత్యుత్తమంబైన
రీతిలోన పలుకు, నీతితోడ
చేయు వర్తనమున సిద్ధించు సుఖములన్
పుస్తకంబు తెలుపు విస్తరించి. 4.


సంఘమందునుండు సభ్యులందరికెంతొ
యుపకరించుచుండు నున్నతముగ
ప్రాణమిత్రుడట్లు పథమును చూపించు
పుస్తకంబు శ్రేష్ఠభూషణంబు. 5.


గురువు పలుకుచుండు పరమాద్భుతంబులౌ
సూక్తులన్ని యొక్క చోట జేర్చి
విశదపరచుచుండు విజ్ఞానమును పెంచు
పుస్తకంబు శ్రేష్ఠభూషణంబు. 6.


పిన్న పెద్ద యనెడి భేదభావము లేక
ఉర్విజనుల కెల్ల నున్నతమగు
భావజాలమొసగు పరమహర్షముతోడ
పుస్తకంబు శ్రేష్ఠభూషణంబు. 7.


బ్రతుకుతెరువు చూపు, భాగ్యంబులందించు
సంఘజనులతోడ సవ్యగతిని
వ్యవహరించు తీరు పలుకు నేందేగిన
పుస్తకంబు శ్రేష్ఠభూషణంబు. 8.


ఇందునున్నయట్టి దెందైన గాన్పించు
నిందులేని దొక్క టెందు లేదు
జగతిలోన వెలుగు సర్వాత్మకంబౌచు
పుస్తకంబు శ్రేష్ఠభూషణంబు. 9.



పుస్తకాలపురుగు మస్తకంబంతయు
జ్ఞానసాగరమున స్నానమాడ
నితని జూడదగును సతతంబు పఠియించు
చుండె నౌర! స్వాంతశుద్ధిగోరి. 10.

Wednesday 12 March 2014

దశావతారాలు


శ్రీపతి! జగదాధారా!
పాపాపహ! చక్రధారి! పావనచరితా!
హే పరమానందద! చి
ద్రూపా!పద్మాయతాక్ష! దుఃఖవిదారా! 1.


అవనిలోపల ధర్మంబు నణగద్రొక్కి
తా నధర్మంబు వ్యాపింప, దాని గూల్చి
మానవాళిని రక్షించి జ్ఞానమొసగ
నవతరింతువు గోవింద! యద్భుతముగ. 2.


నీరూపము లనుపమములు
కారుణ్యాత్ముడవునీవు కంసారి! హరీ!
తోరపు భక్తిని గొల్చిన
వారికి కల్మషములుడుగు వైభవమబ్బున్. 3.


తొల్లి మత్స్యమవౌచు దుష్టు రాక్షసు గూల్చి
          వేదరక్షణ చేసి విమలమతుల
జీవరాశుల నెల్ల నావలో నెక్కించి
          జలధికావల జేర్చి సాకినావు,

సురసంఘములు నాడు శుక్రశిష్యులగూడి
          క్షీరాబ్ధి ద్రచ్చంగ గోరునపుడు
కూర్మరూపంబంది కుధరంబు నిలబెట్టి
          యమరుల కండయై యలరినావు,

నాడు వరాహమై నవ్యతేజముతోడ
          నసురు హిరణ్యాక్షు నణచి భూమి
నుద్దరించుటచేత నుత్సాహమమరుల
          కందించి యున్నాడ వద్భుతముగ!

నిరతంబు నినుగొల్చు నిజనందనుని జంపు
          యత్నంబులోనున్న యసురపతిని
నరసింహరూపివై నఖములతో జీల్చి
          చెండాడితివినీవు దండమయ్య,

పరమాద్భుతంబుగా వడుగౌచు వామనా
          కారుండవై యజ్ఞకాలమందు
బలిని యాచనచేసి పదముల మూడింట
          నాక్రమించెడి మేర నందినావు,

పరశురాముండవై బలమదయుతులైన
          క్షత్రియులంబట్టి సంహరించి
క్షితినిక్షత్రియహీన జేయబూనినయట్టి
          దక్షుండ వోదేవ! దానవారి!

రామావతారాన రావణాసురు గూల్చి
          ధర్మంబు కాపాడి ధరణిజాత
కానందమును గూర్చి మానవాళికి సతం
          బాదర్శ దైవమై ఖ్యాతి గాంచి,

యటుపైన కృష్ణుండ వౌచు యశోదకు
          సంతసంబును నిల్పి సర్వగతుల
గోపాల బంధులన్ కాపాడుటే కాదు
          కంసాది దుష్టులన్ క్రమత గూల్చి
భారతావనిలోన భవ్యసద్ధర్మంబు
          నిలిపియుంటివి నీవు నిష్ఠబూని,

శాక్యవంశమునందు జన్మించి మునివౌచు
          ధరణిపై నెన్నెన్నొ ధర్మములను
బోధించి యంతటన్ బుద్ధుండవై వెల్గి
          లోకముల్గాచినా వేకదీక్ష

కలియుగాంతపువేళ యిలనుగావగ నీవు
          కల్కివౌదు వటంచు పల్కుచుంద్రు

దేవ! వైకుంఠవాసి! హే దివ్యతేజ!
అఘవిదారక!కేశవ! హరి! ముకుంద!
భాగ్యదాయక! మాధవ! వాసుదేవ!
సకలభువనావనానంత! సత్యరూప! 4.


దుష్టరాక్షససంహార! దురితదూర!
నిత్యసంతోషదాయక! నిర్మలాంగ!
శిష్టరక్షక! దైత్యారి! శ్రీప్రదాత!
సన్నుతించెద సతతంబు నిన్నుదేవ!. 5.


సకలభువనంబులనుగావ జగతిలోని
జీవరాశుల నెద్దాని స్వీకరించి
రూపధారణ జేతువో పాపమణచ
నూహచేయగ లేరెవ్వరుర్విలోన. 6.

Monday 10 March 2014

నాగరాజు


మణిభూషితుడై వెలుగుచు
నణిమాదుల నొసగదగిన యహిసత్తముడై
గణపతి కాత్మీయుండౌ
ఫణిరాజున కందజేతు ప్రణతుల నిపుడున్. 1.


మము మన్నించుము ఫణిపతి!
క్షమతోడను కాచుచుండి కరుణావార్ధీ!
విమలాంతరంగ! దయతో
మమతను గురిపించవయ్య మహిలో నెపుడున్. 2.


క్షీరంబు భక్తితోడను
చేరుచు నీచెంత కెపుడు స్థిరచిత్తముతో
తోరముగ నొసగుచుండెడు
వారిన్ కరుణించ వలయు పరమప్రీతిన్. 3.


క్రోధంబు చూపవల దిక
బాధించగ బూనవలదు పలురకములుగా
సాధించ వలదు మమ్మెపు
డాధికి గురిచేయవలవదహిపతి నీవున్. 4.


లోకములగాచుచుండెడి
శ్రీకంఠుని హారమౌచు స్థిరయశములతో
లోకంబుల విహరించెడి
నీకొసగెద ప్రణతిశతము నిష్ఠాత్ముడనై 5.

కంప్యూటర్


మేటిగ వర్తమానమున మిక్కిలి సౌఖ్యము లందజేయు కం
ప్యూటరు మానవాళి కిల నుత్సవదంబయి వెల్గుచుండు ము
మ్మాటికవశ్యవస్తువయి, మైమరపించుచు, కార్యదక్షతన్
పాటవ మందజేయుచును బంధునిభంబుగ నున్న దంతటన్. 1
.


విషయ మెటులనున్న వేర్వేరుగా నంది
          తనలోన దాచు తాననుపమముగ,

భాషతో భేదంబు పాటించగా బోక
          జ్ఞానసంచయ మెంతొ మేన దాల్చు,

అడిగినప్పుడు పల్కి యనుమానములు తీర్చు
          మార్గదర్శకమౌచు మనము దోచు,

చిటికలో విశ్వాన చేరదల్చిన చోటు
          చక్కగా నంతరజాలమందు

చూపి తృప్తి బరచు శోధించు, సాధించు
నెట్టిదానినైన పట్టుదలకు
మారుపేరు చాలతీరుల గాన్పించు
గణకసాధనంబు ఖ్యాతిదంబు. 2.


చిన్నపిల్లలతోడ చిత్రాలు గీయించు
          నాటలు నేర్పించు నందమొప్ప,

మధురసంగీతంబు మహిళల కందించు
          నాట్యంబు చూపించు నవ్యముగను,

విద్యార్థులకు నెప్పు డద్యతనంబైన
          విజ్ఞాన మందించు వివిధగతుల,

బహుమాన్యతను గూర్చు సహకార మందించు
          నెల్లమానవులకు నుల్ల మలర

చిన్నదైన నేమి యెన్నెన్నొ విషయాల
నాత్మలోన దాచి యందరకును
కరము ముదము గూర్చు కంప్యూట రేవేళ
ధరను దీని ఘనత తరమె పలుక. 3.


పెద్ద చిన్నయనెడి భేదభావము లేదు
పురుషు లబల లనుచు నరయ బోదు,
ఘనత నందజేయు కంప్యూట రన్నింట
మిత్రుడట్లు నేడు మేదిని పయి. 4.


విజ్ఞులార! కనుడు విజ్ఞానమును గోరి
బామ్మగా రొకర్తె భాగ్యమనుచు
క్రమత నేర్చుచుండె కంప్యూట రక్కటా!
ప్రాయ మడ్డురాదు ధ్యేయమునకు. 5.

Sunday 9 March 2014

మొసలి-పక్షి


సరసిని మకరం బటపై
నరయంగా విహగమొక్క టద్భుతరీతిన్
నిరతము మైత్రిని బూనుచు
నరుసంబు వహించియుండు నందరు మెచ్చన్. 1.


జలవాసుల సంగతులం
బలుకును మకరంబు, పిదప పక్షుల గతులం
దెలుపును ఖేచర మక్కట!
జలచర ఖగములకు నిట్లు సఖ్యత గూడెన్. 2.


తననెచ్చెలి వచ్చుట గని
మనమున హర్షంబు నిండ మకరం బదిగో
ఘనతరముగ పైకెగయుచు
ననె హిత! కుశలంబె నీకు నన్నివిధాలన్. 3.


కుశలము తెల్పుచు పులుగిక
దశదిశలం దిరిగియుంట తనమిత్రునకున్
మశకాదులైన ప్రాణుల
దశలం దెలియంగ జెప్పి తనియగ జేసెన్ 4.


ప్రేమంబున తనచంచువు
నామకరపు ముఖము జేర్చి యాత్మీయతతో
సేమంబె మిత్రసత్తమ!
ధీమతి! యనె పక్కి మైత్రి దీపిల్లునటుల్ 5.


వారిద్దరి మాటలలో
భారతదేశంబులోని బహువిషయాలున్
వారింపలేని మోసము
లారయ చర్చలకు వచ్చె నౌరా యచటన్ 6.


ఎన్నికలు జరుగురీతియు
మన్నిక నందంగ దలచు మానవు లిలలో
పన్నుచు నుండెడి జిత్తుల
నన్నియు చర్చించి రప్పు డామిత్రు లటన్ 7.


కలలో నైనను భేదము
తలపని యాంధ్రంబు జూచి తమపని యనుచున్
నిలువున జీల్చినవారల
తలపులు చర్చించి రచట తా రామిత్రుల్. 8.


ఒకజాతి వారిమధ్యను
ప్రకటితమగు భేదమిలను బహువిధములుగా,
నకటా! సఖ్యము గాంచుడు
మకరము ఖగములకుమధ్య మానవులిందున్. 9.

Saturday 8 March 2014

వేణునాదం

ఏవేణు(గానంబు)నాదంబు భావింప హృదయంబు
          లానందభరములై యలరుచుండు,

ఏవేణు
(గానంబు)నాదంబు జీవరాశులలోన
          నుత్సాహమును నింపు నున్నతముగ,

ఏవేణు
(గానాంబు)నాదాంబు వీధరాస్థలిలోన
          నమృతోపమానమై హాయి నొసగు,

ఏవేణు
(గానంబు)నాదంబు నేవేళ వినగోరి
          గోపికాసంఘాలు కూడుచుందు
రట్టి వేణువు మ్రోగించు నందగాని,
నల్లనయ్యను, గోవిందు, నందసుతుని,
మోహనాంగుని, యాదవముఖ్యు, ఘనుని
సన్నుతించెద భక్తితో సతతమేను.                       1.


వందనము రాక్షసాంతక!
వందనమో దేవదేవ! వందనము హరీ!
వందనము లోకరక్షక!
వందనములు స్వీకరించు వసుదేవసుతా!          2.


నిన్నేనమ్మితి సత్యం
బెన్నంగా నొరులు గలరె! యీవిశ్వమునం
దెన్నడు గాచెడు వారలు
నన్నుం దయజూడవయ్య నందకుమారా!          3.


నీవే జగదాధారుడ
వీవే సర్వేశ్వరుండ వీవే సర్వం
బీవే కృష్ణా! కావుము
దేవా! నినుగొల్తు సతము స్థిరమతి యొసగన్.   4.

Friday 7 March 2014

చల్దులారగించుట

బాలులారా! రండు జాలమేలనొ నేడు?
          చల్దులు భుజియించు సమయమయ్యె,

అలసియున్నారెంతొ పలుకులో దైన్యంబు
          మిమ్మావరించెనో మిత్రులార!

క్షుద్బాధ తీరంగ కూరిమి మీరంగ
          నారగించెద మిప్పు డంద మొలుక

బహుమాన్యమై యొప్పు భక్ష్యరాశిని గాంచు
         డత్యంత మోదంబు నందగలరు

జాగు చేయవలదు సత్వరంబుగ రండు
మీర లంచు బిలువ వార లపుడు
రండు రండటంచు రయమున కృష్ణుని
చెంత జేరినారు సంతసమున. 1.


గోపబాలు రట్లు గోవిందు కెడ జేరి
పరమహర్ష మొదవ సరసులౌచు
కోరి కృష్ణు జుట్టి కూర్చుండి చవులూర
ముడులు విప్పిచల్ది మూటలపుడు.
2.

ఊరగాయ జూపి యూరించగా నొక్క
డారగించె దాని నంది యొకడు
మేలు భక్ష్య మొకడు చాలంగ జూపించ
లాగి మ్రింగె నొక్క డాగ కుండ. 3.


తనవద్ద నున్నట్టి ఘనపదార్ధములన్ని
          భక్షించ రండంచు పంచె నొకడు,

తనభక్ష్యరాశులన్ తన్మయత్వము తోడ
          మిత్రుల కందించె మేటి యొకడు,

ఒకని చిక్కములోని యోగిరంబుల బట్టి
          పంచె నందరిలోన బాలుడొకడు,

మిత్రులందరిగూడి మిగుల సంతోషాన
          నన్నదమ్ములయట్టు లద్భుతముగ

ఒకరి నొకరు గాంచి యుత్సాహభరితులై
పాడుచుండి హాస్యమాడుచుండి
కృష్ణు జూచుచుండి తృష్ణ తీరగ చల్ది
కుడుచుచుండి రచట కూర్మిమీర. 4.

Thursday 6 March 2014

ఉద్యోగం పురుషలక్షణమ్

శారీరికవైకల్యం
బేరీతిగ నడ్డురాదు, హితకాంక్షులకున్
ధీరత మనమున నిండిన
వారలకా ప్రభుడొసంగు బహుసౌఖ్యంబుల్.    1.


కోరికలు దీరు నెల్లెడ
చేరును విజయాలువారి చెంతకు సతమున్
తోరపు టుత్సాహము నె
వ్వారలు పూనెదరుసత్య పాలనతోడన్.        2.


రాబోదు కష్టకాలము
కాబోదిక దుర్భరంబు ఘనవైకల్యం
బాబాలవృద్ధ మందున
ధీబల మెవ్వారిలోన దీపిల్లు భువిన్.            3.


ఒకచేయి లేదటంచును
వికలుండై బాధపడక విజ్ఞతతోడన్
ప్రకటిత సామర్ధ్యముతో
నకటా! యీతండు ఖడ్గ మందెను చేతన్.     4.


శుభములు గల్గును నిత్యము
విభవంబులు పొందవచ్చు విస్తృతరీతిన్
ప్రభవించు సౌఖ్య మొదవెడు
నభయము వికలాంగుడైన యత్నముచేతన్. 5
.