Tuesday 8 October 2013

“వేఁప పుల్ల”

“వేఁప పుల్ల”
దంతమలినజాల మంతయు పోగొట్టి
హర్ష మందజేసి యనుదినంబు
జనుల గాచుచుండు ఘనరుగ్మతలనుండి
విజ్ఞులార! నిజము వేపపుల్ల.


చేదు నెంచ వలదు సేమంబు తాఁగూర్చు,
క్రిముల జేరనీదు, విమలముగను
దంతపంక్తి నుంచు దారుఢ్యతను బెంచు

విజ్ఞులార! నిజము వేపపుల్ల.

పళ్ళు తోము కొరకు బహువిధ చూర్ణాలు
మరియు లేహ్యతతుల మాటయేల?
తనివిదీర్చగలదు తానొక్కటున్నచో

విజ్ఞులార! నిజము వేపపుల్ల.

ధనము కోరబోదు, మనమున కెంతయో
హాయి నొసగుచుండు, హానికరము
కాదు కొంచెమైన, వాదు లింకేలనో

విజ్ఞులార! నిజము వేపపుల్ల.

పిన్నవారికైన, పెద్దవారలకైన
కోరి పూనువారి కేరికైన
అతుల చేతనత్వ మారోగ్య మందించు

విజ్ఞులార! నిజము వేపపుల్ల. 

Wednesday 2 October 2013

“జాతిపిత”

“జాతిపిత”


ఏ మహామహునామ మింపార నిత్యంబు
          స్మరణయోగ్యంబయ్యె సర్వజగతి,

ఏ మహామహుగాథ లీపుణ్యభూమిలో
           హరికథానిభములై యవతరించె,

ఏ మహామహురూప మీభారతంబున
            విగ్రహస్థంబౌచు విస్తరించె,

ఏ మహామహువాక్కు లీవేదభూమిలో
           మంత్రతుల్యంబులై మహిమ జూపె

అతడు మోహనదాసాఖ్యు డనుపముండు
కరమచందుండు ధీరుండు గాంధి ఘనుడు
ధర్మరక్షణ చేయంగ కర్మభూమి
కంపబడినట్టి దివ్యాత్ము డనజెలంగు.


సత్యనిష్ఠతోడ స్వాతంత్ర్యదీప్తులు
భరతభూమియందు పర్వజేసి
జనుల గాచినట్టి చరితార్థజీవికి
నతులు చేతు జాతిపితకు నేడు.

Tuesday 1 October 2013

“కోడి పందెములు”

“కోడి పందెములు”
తెలుగునేలపైన వెలుగొందుచున్నట్టి
సాంఘికంబులైన సంస్కృతులకు
నుదహరించదగిన దదియేమిటని యన్న
కోడిపందె మందురు రేడ జనిన.


మకరసంక్రాంతి పర్వాన సకలజగతి
కాత్మవిక్రమవైభవ మద్భుతముగ
చాటి చెప్పంగ బూనుచు మేటివైన
కుక్కుటంబుల నాటకై కూర్చుచుంద్రు.

కాళ్ళసందున పదునైన కత్తి గట్టి
పోరు సల్పంగ నుసిగొల్పి, చేరదీసి
ధనము, ప్రాణంబు, మానంబు లనుపమముగ
పణము గావింతు రెల్లెడ బహుళగతుల.


కుక్కుటముల స్పర్థల నిల
మక్కువతో జరుపుచుండి మాన్యదములుగా
లెక్కించుచుందు రెల్లరు
నక్కట! దయయించుకైన నగుపించదహో!


నోరులేనిజీవు లేరీతినైనను
పలుకలే వటన్న తలపుగాక
కువలయంబులోన కోళ్ళపందెముజూడ
సముచితంబు కాదు సన్మతులకు.