Monday 29 July 2013

జయాపజయములు

జయాపజయములు



జయము కలిగెనేని సంతోషమందుచు
నపజయంబు గలుగ నతులదు:ఖ
మనుభవించు జనుడు హర్షావమానాల
కతడు కారకుండె? యవని లోన.


విజ్ఞులార! నిజము విజయాపజయములు

పూర్వ నిశ్చితంబు లుర్విలోన
మర్మమెరుగ దగును కర్మానుసారంబు
లఖిలఫలచయంబు లందరకును. 


కర్మలందు హక్కు కలదు మానవులకు

ఫలములందు లేదు, భాగ్యవశము
ఫలమటంచు దలచి పనులు చేయుటయందె
బుద్ధి నిలుపవలయు పుడమి జనుడు. 


జయము నందినాడ భయమేల నాకంచు

విర్రవీగకుండ, విజయమందు,
నపజయంబునందు నతిశాంతచిత్తుడై
మసలుచుండ వలయు మానవునకు. 


జయము కలుగ దనుచు చలియించకుండంగ

స్థిరత జూపుచుండి వరుసనంత
విజయసిద్ధియందు వినయాత్మకుండౌచు
మెలగుచుండువాడు మేటి భువిని. 


అపజయంబులోన నంతర్గతంబుగా

జయము కలదు నిజము భయమదేల?
అపజయంబు, జయము లారెండు సహజంబు
లనుచు తెలియదగును మనుజునకును.
 

జయము గాంతు మనెడు సంకల్పబలముతో

స్థిరతబూని లక్ష్య మరయు వరకు
పట్టువిడువకుండ గట్టిగా యత్నంబు
సలుప పొందవచ్చు జయము నిజము. 


అపజయంబు మనిషి కతిసౌఖ్యదంబైన

జయము నందు కొరకు సాధనంబె
కనుక దాని జూచి మనమున చింతించ
వలదు ముందు కేగవలయు గాని.

Sunday 28 July 2013

“పంచాయతీ యెన్నికలు”

పంచాయితీ ఎన్నికలు


ఎన్నికల సమయమియ్యది

వన్నెలు చిన్నెలును జూపి వంచన తోడన్

మున్నెన్నడు వినియుండని

వెన్నెన్నియొ వరము లొసగి యీమారైనన్.


ధనమును మద్యము పంచుచు

ననుపమ మధురోక్తులాడి, యటుగాకున్నన్

ఘనతం జాటుచు నైనను

కొనవలె యధికారమనెడు కోరికతోడన్.


ఓటరు నాసర్వస్వం

బోటరు భగవంతు డిప్పు డుర్వీతలమం

దోటరె జననియు జనకుం

డోటరునే కొల్తుమంచు నుత్సాహమునన్.


సంచులలో నగణితధన

సంచయమును నింపుకొనుచు సంతోషమునన్

పంచిరి యత్యాదరమున

పంచాయతులందు జూడ ప్రజలందరికిన్. 


పంచాయతి ఎన్నికలం

దెంచగ నాయకుల జిత్తు లేమందు నికన్

వంచనలో నొకరొకరిని

మించిరి పదవులనుగోరి మేధావులనన్.