Wednesday 8 May 2013

రచ్చబండ

రచ్చబండ

ఊరివారంద రొకచోట చేరుచుండి
కష్టసుఖముల నెచ్చోట క్రమముగాను
పంచుకొనుచుందు రిలలోన బహుళగతుల
రమ్యమౌ ప్రాంత మయ్యది రచ్చబండ.


న్యాయ మిక్కడ మీకందజేయబడును
నమ్ము డీరలు మీకోర్కి వమ్ముగాదు
సందియంబింత లేకుండ సర్వజనులు
రండు రండంచు పలుకును రచ్చబండ.


చిన్న పిల్లల బ్రేమతో చేరబిలిచి
వివిధరీతుల క్రీడలు విస్తృతముగ
నేర్పుచుండును దీక్షతో నిత్యమౌర!
రమ్యమౌ ప్రాంత మయ్యది రచ్చబండ.


సేద దీర్చును జనులకు మోద మొసగు
వాదు లెన్నైన సరిజేసి యాదినుండి
యూరివారల బంధువై యుర్విలోన
నిచ్చలానంద మొసగదె రచ్చబండ.


రోష మణచును పోగొట్టు ద్వేషములను
మమత లొలికింపజేయుచు మనములందు
శత్రుభావము కూల్చుచు సంతసంబు
లిచ్చుచుండును జనులకు రచ్చబండ. 

Tuesday 7 May 2013

హితమితోక్తులు

హితమితోక్తులు

హితకారక వాక్యంబులు
మితముగ బోధించనగును మేలుభయులకున్
మితిమీరిన నిట్టులయని
స్తుతమతులకు చెప్పవలెనె సుజనాళికిలన్.


హితమును గోరుచు బలికెడు
చతురోక్తుల నెల్లవారు సన్మతులగుచున్
క్షితిలో నందగవలయును
వెతలన్నియు తీరు దాన వినుడందరికన్.


హితుడై క్షేమము గోరుచు
మితముగ సూక్తులను బలుకు మిత్రుని వాక్యా
లతులిత సౌఖ్యప్రదములు
శతశాతము ముదము గూర్చు సత్పథమొసగున్.

మితముగ హితమును బలికెడి
జతకాడే పృథ్విలోన సన్మిత్రుండౌ
అతడే సాక్షాద్దైవం
బతనిని నమ్మంగ వలయు ననవరతంబున్.


హితవాక్యము వినరేనియు
వెతలెన్నియొ కలుగుచుండు విస్తృతరీతిన్
మతిచెడు, క్రుంగును గౌరవ
మతిదుర్భరమౌను బ్రతుకు హర్షమణంగున్. 

Sunday 5 May 2013

“పరశురామ ప్రీతి”

“పరశురామ ప్రీతి”
వారిని చూచుటెట్లు? బహుభంగుల సాంత్వనవాక్యజాలమున్
చేరి వచించుటెట్లు? తమచింతను వీడుడటంచు, ప్రేమగా
వారల దు:ఖకారణము పల్కుడటంచును వేడు టెట్టు? ల
వ్వారలతోడ నున్న పసివానిని కెట్టుల బుజ్జగించుటో?


మేను కృశించిపోయినది, మిక్కిలి దు:ఖముచేత మోమికన్
దీనత నొందియున్నయది, తీర్చెడువారలు, పల్కరించువా
రేనియు కానరాక తమ నీవిధి జూచిన దేవదేవునిన్
ధ్యానము చేయలేక పరితాపము చెందిరి వృద్ధదంపతుల్.

ఆ పసివాడు వారల కులాబ్ధికి వారసుడైనవాడు నో
రాపక యేడ్చుచుండె నత డాకలిదప్పులచేత నేమియో
శాపము పెట్టినట్టు లిల జన్మమునందిన కొన్నినాళ్ళకే
పాపము! తల్లిదండ్రి మును స్వర్గము జేరిరి వాని వీడుచున్.


చేతము లుల్లసిల్లువిధి చిన్నకుటీరమునందు వారలున్
ఖ్యాతి గడించియుండ నొక కాలము వేసవి యాగ్రహాగ్ని సం
భూత భయంకరాకృతికి భోజనమయ్యెను నిద్రనుండగా
రాతిరి వేళలో "పరశురాముని ప్రీతికి" వారి గేహమున్.

శోక మణంగునా? నిలిచి చూచెడువా డొకడుండబోవునా?
చేకొను డంచు పల్కి తమచేతిని వారల కూతమిచ్చి మీ
రాకట నుండరాదనుచు నాదుకొనంగను సాహసించువా
రీకలి నుందురా? తెలియ దేమగునో, యిటువంటివారికిన్. 

Saturday 4 May 2013

“ఉపవాసము”

“ఉపవాసము”
నిష్ఠబూని మనిషి నిర్మలచిత్తుడై
భక్తిభావమూని పరవశించి
సతము దేవదేవు స్మరియించువాడౌచు
నుపవసించవలయు నుర్విలోన.


కార్యసాధకంబు కామితఫలదంబు
భగవదర్చనంపు భవ్యపథము
కాన శ్రద్ధతోడ మానవులింపుగా
నుపవసించవలయు నుర్విలోన.

రోగనాశకంబు యోగానుకూలంబు
సంతసంబు పొందు సాధనంబు
కృప జనింపజేయు నుపవాస మగుటచే
నుపవసించవలయు నుర్విలోన.


కాయ మలతియౌను, కలుషంబు లణగారు,
నింద్రియాల శక్తు లినుమడించు
భావశుద్ధి కలిగి జీవంబు వర్ధిల్లు
నుపవసించవలయు నుర్విలోన.


వారమందు గాని పక్షంబు నందైన
నొక్కరోజు నెంచి చక్కగాను
సవ్యమతిని బూని, సౌభాగ్యమని యెంచి
యుపవసించవలయు నుర్విలోన. 

Friday 3 May 2013

“చలన చిత్రములు”

“చలన చిత్రములు”
ఒకనాడు దేశాన రకరకంబుల మూక
..........చిత్రంబు కనువిందు చేసియుండె,
తదుపరి చూడంగ ముదముతో మాట్లాడు
..........బొమ్మ లెన్నెన్నియో పుడమిలోన
చలనచిత్రంబులై యలరించి ప్రేక్షక
..........హృదయంబులను దోచు టది నిజంబు
మారెడు కాలాన మార్పులు చేర్పులు
..........చిత్రనిర్మాణాన చేరుచుండె
చలనచిత్ర మిపుడు శతవసంతంబుల
పాటిదయ్యె కనగ భారతాన
తెలుగు చలనచిత్ర మిలలోన నన్నింట
శ్రేష్ఠమనుచు పొందె స్థిరయశంబు.

రఘుపతివెంకయ్య రమ్యంబుగా నాడు
..........మూకాభినయమున మొదట ప్రతిన
భీష్ముతో జేయించె పిదప ప్రహ్లాదుండు
..........మాటాడి యలరించె మేటియగుచు
ఎందరో దర్శకుల్ వందలసంఖ్యలో
..........నలుపు తెలుపులుగా మలచినారు
చక్కని చిత్రాలు సరదాలకేకాక
..........విప్లవాత్మకమౌచు వివిధగతుల
సంఘసంస్కారదృష్టితో జగతి కింత
బోధ చేసెడు భావంబు పూని సతము
నిష్ఠ గైకొని నిర్మించి నిలిచినారు
ధన్యు లవ్వార లెందైన మాన్యు లికను.


తరువాత కాలాన సరణులు మారంగ
..........రంగుల చిత్రాలు రయముతోడ
వచ్చి నిల్చెను చూడ వర్ణింప తరమౌనె
..........వర్తమానములోని వైభవంబు
రంగురంగులె కాదు రమ్యాతిరమ్యమౌ
..........సాంకేతికాఢ్యత సర్వజగతి
చిత్రసీమను జేరి శ్రీప్రదంబుగ మారి
..........సర్వసౌఖ్యంబుల స్థానమయ్యె
ఇందు గాంచెడు దానినిం కెచ్చటైన
కాంచవచ్చును లేనిది కాంక్షయుండి
వెదకినను లేదు సత్యంబు విశ్వమందు
తెలియు డంచును జగతికి తెలుపు చుండె.

పుల్లయ్యవర్యుండు పూజ్యుడా నరసింహు
..........డటపైని బాబు తా నరయవలయు
నారాయణార్యుండు నవ్యాంతరంగుండు
..........రాఘవయ్యయు జూడ రమ్యగుణుడు
విశ్వనాథుడు, బాపు విజ్ఞులై వీరంద
..........రెన్నియో చిత్రాల నున్నతముగ
దర్శకాగ్రణులౌచు ధరవారి కందించి
..........యశము గాంచినవార లనుపమముగ
తెలుగుసీమను నిత్యంబు వెలుగులీను
చిత్రరాజంబు లెన్నియో చెప్ప గలమె
అకట! యొకదాని మించిన దొకటి యగుచు
ఖ్యాతి గడియించి యున్నవి క్రమముగాను.


నాటినుండియు జూడ నటవర్గమందున
..........తెలుగుదేశమునందు బలువురు గద!
ఈలపాటలవాడు, రేలంగి , నాగయ్య
..........యాంజనేయార్యుడా యక్కినేని
నందమూరియు నింక నందాల బరిణయౌ
..........అంజలీదేవ్యాదులతివలున్ను
ఖ్యాతినందినయట్టి ఘనులు తామెందరో
..........తారలై వెలుగొందువార లవని
శతవసంతాలు నిండిన సమయమందు
ఘంటసాలాది ముఖ్యుల, కవుల, నటుల,
దర్శకులను, నిర్మాతలన్, ధన్యజనుల
నిండు మనమున స్మరియించ రండు నేడు. 

“విహారయాత్రలు”

“విహారయాత్రలు”
వినుడు యాత్రలన్న విజ్ఞానయాత్రలు,
హర్షమొసగు నీ విహారయాత్ర
లవనిలోన తీర్థయాత్రలు చూడంగ
కలవు పెక్కులిట్లు క్రమముగాను.


బాలబాలికలకు పరమాద్భుతంబౌచు
యువజనాళి లోన జవము బెంచు
నిద్ధరిత్రిలోన వృద్ధులకైనను
హాయి నొసగు నీ విహారయాత్ర.


క్రొత్త దంపతులకు నుత్తమంబీయాత్ర
ఎదకు నెదనుజేర్చి ముదము గూర్చి
స్వర్గ సౌఖ్యమిలను చక్కగా చూపించి
హాయి నొసగు నీ విహారయాత్ర.


మనములందు బెంచు మమతానురాగంబు
లోకరిపైన నొకరి కొప్పుమీర
రోష మణచివేసి ద్వేషభావము ద్రుంచి
హాయి నొసగు నీ విహారయాత్ర.


అంతరంగమందు నలసత్వమును బాపి
యుత్సహింప జేయుచుండు నెపుడు
చేతమందు నిల్పి నూతనోత్తేజంబు
హాయి నొసగు నీ విహారయాత్ర.


నిత్యకర్మలందు నత్యంత మగ్నులై
విసుగుచెందుచుండి రుసరుసలను
చూపుచుండు వారి కేపట్టునైనను
హాయి నొసగు నీ విహారయాత్ర.