Friday 26 April 2013

రామప్ప దేవాలయము

శుక్రవారం 26 ఎప్రిల్ 2013    

పద్య రచన

రామప్ప దేవాలయము
 
కళలకు కాణాచి కాకతీయులభూమి
     యోరుగల్పురసీమ యున్నతంబు,
తత్సమీపస్థమై దర్శనార్థులకెప్పు
     డానందమును బంచి యఘము ద్రుంచు
రామప్ప దేవళం బేమని వర్ణింతు
     సౌందర్యరాశి యామందిరంబు
పాలంపుపేటలో భవ్యశిల్పాలతో
     వెలుగొందు హరిహర నిలయమందు

రామలింగేశ్వరుండందు రమ్యముగను
భక్తజనముల కెల్లెడ భాగ్య మొసగి
సంతతానందమును గూర్చి యంతులేని
సౌఖ్య మొసగంగ వసియించు సంతసాన.


శిల్పి రామప్ప యచ్చట చెక్కియుండె
కనులపండుగ యొనరించి మనము దోచు
శిల్పరాజంబు లెన్నియో చిత్రగతుల
నతని ననవచ్చు నిజముగా నమరశిల్పి.


అచ్చటి నిర్మాణంబున
కెచ్చటివోగాని మంచి యిటుకలు నాడున్
తెచ్చిరట, నీటిలోనవి
అచ్చెరువుగ తేలుచుండు నద్భుతరీతిన్.


దేవళంబు బయట జీవ మున్నట్లుగా
శివుని యాజ్ఞ కొరకు చెవులు నిలిపి
చూచు దాని వోలె గోచరమగుచుండు
నంది యెంతయేని సుందరంబు.


ఆసమీపమందు నతివిస్తృతంబైన
సరము నొక్కదాని నరయవచ్చు
ఔర! యా తటాక మచ్ఛోద యుతమౌచు
హర్షదాయి సతము కర్షకులకు.


ఓరుగల్లులోన చేరి శిక్షణ నందు
నాడు దీని జూచినాడ, నేడు
శంకరార్య! మీరు స్మరియించు భాగ్యంబు
నందజేసినారు వందనంబు.

 

Tuesday 23 April 2013

“కావ్య కన్యక”

“కావ్య కన్యక”
సకలాంధ్రసాహితీ సాగరంబునకెల్ల
           నగ్రజుడై వెల్గు నాదికవికి
నన్నపార్యున కెట్లు నానావిధంబులౌ

          యశము లబ్బెను నాడు దిశలనిండ,
ప్రేమతో తిక్కన్న సోమయాజిని తాను

          "మామ"యంచును బిల్చి మనుమసిద్ధి
అత్యుత్తమంబైన ఆదరంబును జూపి

           చేరదీయుచు నేల గారవించె,
ఇంపుగా కవియైన ఎర్రనార్యుం డెట్లు

           పరమేశ్వరత్వంబు పడయ గలిగె,
కవిసార్వభౌముడై యవనీతలంబందు

           కింకవీంద్రులనెల్ల హుంకరించు
శ్రీనాథకవిరాజు కానందమున జూడ

           స్వర్ణాభిషేకంబు జరిగెనేల,
కర్షకవృత్తితో కాలయాపన చేయు

           పోతనామాత్యుండు పూర్వమునను
సహజపండితుడంచు, సద్భక్తకవి యంచు

           ఖ్యాతినందుట కేమి కారణంబు,
గండపెండేరాది ఘనమగు సన్మాన

            మల్లసానికి రాయ లందజేసి
సురుచిరమౌరీతి పురమేగ జేయించి

          పల్లకి తనచేత పట్టెనేల,
విశ్వనాథయు నేటి విజ్ఞ సీ.నా.రెడ్డి

          జ్ఞానపీఠమునెక్కి మానితమగు
యశము నందంగ కారణ మయ్యదేమి?
సుందరంబైన యితివృత్త మందియుండి
పలురకంబుల ఛందాలు, భవ్యమైన
రీతులు, గుణంబు లందరి చేతమలర

చేయగలయట్టి శైలులు, హాయినొసగు
భావసంపత్తి మధురమౌ పలుకులుంచి
రచన కావించబడి యుండి ప్రచురములగు
ధర్మవిషయాలు వ్యవహార మర్మములును

బోధ చేయుచు, సన్మార్గ సాధనంబు
నగుచు ధరవారి కెల్లర కనవరతము
శుభములను గూర్చి బహువిధ విభవమొసగు
"కావ్యకన్యక"యేగాదె కారణంబు.

Monday 22 April 2013

తెలుగువారి వారసత్వము


                    తెలుగువారి వారసత్వము

పర్వదినమున పూజల నిర్వహణము
బూరె పులిహోర గారెలు పూర్ణములను
రాజసంబగు పర్వాన్న భోజనంబు
వారసత్వంబిది తెలుగు వారలకును


ఆవకాయయు గోంగూర యనుపమమగు
కందిపచ్చడి సున్నియు నందమైన
పులుసు వడియంబు లప్పడా ల్భోజనమున
వారసత్వంబిది తెలుగు వారలకును


తల్లిదండ్రులతండ్రులు, తాతలికను
దేవగణముల పేర్లను దీప్తి మెరయ
పిల్లలకు బెట్టి భక్తితో పిలుచుకొనుట
వారసత్వంబిది తెలుగు వారలకును


ధర్మకార్యాలు సాంఘిక కర్మములును
సాధుసంగంబు భగదారాధనంబు
పావనంబైన సౌభ్రాతృభావనంబు
వారసత్వంబిది తెలుగు వారలకును


తల్లిదండ్రుల సేవయు నెల్లజగతి
దేశభక్తిని చాటుచు లేశమైన
భీతినందక విమలమౌ ఖ్యాతి గనుట
వారసత్వంబిది తెలుగు వారలకును

“వేసవి కాలము”

“వేసవి కాలము”
కర్మసాక్షియు, జగముల మర్మమెరిగి
దారి జూపంగ వెలుగుల దానమొసగు
మిత్రు డక్కట! యిలవారి మిడిసిపాటు
కాగ్రహించెను వీడెను నిగ్రహంబు.


ఉగ్రరూపంబు దాల్చుచు నుర్విపైన
కరములను చాచి నిప్పులు క్రక్కుచుండె
పడుచులకునైన సత్వంబు లుడుగుచుండ
చెప్పనలవియె వృద్ధుల తిప్పలికను.


మండుటెండకు నొడలెల్ల మాడిపోయె
స్వేద మలమగ దేహంబు చీకిపోయె
గృహములందున, వీధుల, కూడలులను
నిలిచియుండంగ లేమను తలపు కలిగె.


పెదవులారిపోయె మొదలాయె నలసట
ష్ఠీవనంబు కొంత చేయబూన
వెడలకుండె రసము వేసవి మూలాన
నెండిపోయె దేహ మెల్ల గతుల.


ముదము సన్నగిల్లె చిదికిన దుత్సాహ
మాస లుడిగిపోయె వేసవి గని
వరుణదేవు దలచి వర్షంపు రాకకై
నిలిచి చూచుచుండి రిలను జనులు. 

Wednesday 10 April 2013

శ్రీ విజయ ఉగాది శుభకామనలు


శ్రీ   వి  జ  య  ఉ   గా  ది  శు   భ  కా  మ  న  లు
                                                           (సుందర కందపద్య త్రయోదశి)
శ్రీ "విజయ" వత్సరంబున
    శ్రీవైభవదీప్తులంది స్థిరసౌఖ్యంబుల్
    భావస్వచ్ఛత యేర్పడి
    దైవానుగ్రహము కలుగు ధరవారలకున్.

 
వినయము ఛాత్రగణంబుల
   కనయము "విజయాఖ్య" నూత్న హాయనమందున్
   ధనమై వెలుగంగా నిల
   ఘనయశములు కూడుగాత, క్రమశిక్షణతోన్.

 
యములు, సంతోషంబుల
   మయమగు జనజీవనంబు మహినన్నింటన్
   రయమున "విజయాబ్దం"బున
   ప్రియములు సిద్ధించుగాత, విస్తృతరీతిన్.

 
జనములు సాగగావలె
   "విజయాబ్దము"నందు భువిని వేదోక్తముగా
   త్రిజగద్రక్షకు డాహరి
   ప్రజలందరి కిచ్చుగాత, బహుభాగ్యంబుల్.

 
విదల సమ్మానం బీ
   భువిలో "విజయాబ్ద"మందు పూర్వపుభంగిన్
   వివిధోత్సవముల జరుగగ
   కువలయమున దీరుచుండు కోరిక లెల్లన్.

 
గారవము సర్వవిధముల
   వారికి చేకూరు "విజయ"వత్సరమందున్
   మీరక విధ్యుక్తం బె
   వ్వారలు చరియించుచుంద్రు భారతభూమిన్.

 
దినదిన వృద్ధిని బొందుచు
   మనభారత మన్నిగతుల మాన్యతనందున్
   ఘనముగ "విజయాబ్దం"బున
   ధనకనకములందుగాత ధరనందరకున్.

 
శుభసంతతి సర్వత్రయు
   ప్రభవించును విశ్వమందు భాగ్యవశానన్
   ప్రభవాది వత్సరంబుల
   నభయద మీ "విజయనామ" హాయన మగుటన్.

 
గవంతుని సత్కృపచే
   నగణిత సస్యాభివృద్ధి యనవరతం బీ
   జగమున "విజయాబ్దం"బున
   నగుగాత సువృష్టి గలిగి యానందముగాన్.

 
కామితములెల్ల దీరును
   దామోదరు భక్తి గొలువ ధరనందరకున్
   శ్రీమంతమౌను సర్వము
   భూమిన్ "విజయాబ్ద"మందు పుణ్యం బబ్బున్.

 
మతానురాగ మేర్పడు
   సమతాభావంబు కలిగి సఖ్యత కూడున్
   భ్రమలన్ని తొలగి చేకురు
   నమలిన సౌఖ్యంబు "విజయ"హాయనమందున్.

 
వపర్వము లేర్పడగల
   వవినీతికి నంత్యకాల మారంభమగున్
   వివిధోత్సవములు జరిగెడు
   నవనిన్ "విజయా"హ్వయాబ్దమం దెల్లెడలన్.

 
లుప్తములైన స్వధర్మము
   లాప్తతతో వృద్ధిచెంది యామ్నాయజసం
   దీప్తులు లోకంబంతట
   వ్యాప్తములౌ "విజయ"నామ వత్సరమందున్.

Monday 8 April 2013

“జనన మరణములు”


 “జనన మరణములు”

జననము మరణము సహజము
మనుజులకున్ ప్రాణులకును మహిలో నెపుడున్
ఘనదు:ఖమేల? మృతుగని
యనుచితమది బ్రతుకు కాంక్ష యనవరతంబున్.


ధనమదము కూడ దెందును
మనుజున కెప్పుడును జూడ, మరణమునందున్
జననంబందున సంపద
తనతో కనిపించబోదు ధరనెవ్వరికిన్


పుత్రుని జననం బందున
నాత్రుతనుత్సవముజేయు నతి హర్షమునన్
గాత్రంబు వణకుచుండును
చిత్రముగా మరణమందు సిద్ధము భువిలో


పుట్టిన ప్రతిమానవుడును
పట్టినదంతయును మేలి బంగారముగా
నెట్టైన మార్చదలచును
కట్టా! తానుండగలడె కలకాలమిలన్.


జననము శుభమని యెంచును
తనవారల మరణమన్న తగనిదిగా తా
ననయంబు తలచుచుండును
మనుజుడు కారకుడె జనన మరణంబులకున్.

Sunday 7 April 2013

ఆరోగ్యమే మహాభాగ్యం

ఆరోగ్యమే మహాభాగ్యం
క్షణము నిలువకుండ సర్వకాలములందు
ధనము కూడబెట్టి దాచుకొన్న,
తనువు నంటెనేని ఘనరోగజాలంబు
లందగలడె సుఖము లవని జనుడు?


శాస్త్రచయము చదివి సంస్కారములు నేర్చి
యశము పొందుచున్న నిశయు పవలు,
స్వాస్థ్యసుఖము లేక సంతృప్తి కలుగంగ
బోవ దెవ్వరికిని పుడమిలోన.


పదవులిన్ని పొంది ముదమందుచున్నాడ
నాకు చింతలేదు నమ్ముడనుచు
పలుకుచుండువాడు పరమాత్ముడైనను
రోగియైన వాని భోగ మేమి?


ఇల్లు పిల్ల లరయ నిల్లాలు బంధువుల్
సఖులు వాహనాలు సర్వమున్న
నవనిలోన నెప్పు డారోగ్యహీనుండు
పొందలేడు సుఖము లెందుజనిన.


ధరణిలోని సుఖము లరయంగ నన్నింట
గొప్పదనుచు నిట్లు చెప్పవలయు
ననుపమంపు విత్త మారోగ్యభాగ్యంబు
మానవాళి కెప్పుడైన గాని.

Tuesday 2 April 2013

పద్యరచన

“తులసి”
మూలంబందున తీర్థము
లాలోకించంగ నడుమ నఖిలామరులున్
లాలితముగ నగ్రంబున
మేలగు శ్రుతులుండు తులసి మేదిని కెపుడున్.


శుభములు గూర్చుచు నుండును
విభవంబుల నందజేయు విస్తృతరీతిన్
ప్రభవింప జేయు సుఖముల
నభయదమీ తులసికిప్పు డంజలి చేతున్. 
“అంతర్జాల అవధానము”
సంతోషదమిది యనదగు
నంతర్జాలంబునందు నత్యుత్సుకతన్
వింతగ తారొనరించెడి
దెంతయు నవధానవిద్య యిక్కాలమునన్. 
“తారక మంత్రము”
వారికి శాశ్వతంబగు శుభంబులు, సంతతసౌఖ్యసంపదల్
వారికి ధర్మజీవనము, వైభవదీప్తియు, మోక్షసిద్ధి యె
వ్వారలు సర్వకాలముల పాపవినాశినియౌచు వెల్గు నీ
తారకమంత్రరాజమును తప్పక భక్తి జపింతురెల్లెడన్.


 కాకికబురు.
ఇంటిమీద చేరి ఇరుమారు ముమ్మారు
"కావు,కావు”మనుచు కాకి యప్పు
డరచినట్టివేళ నటునుండి చుట్టాల
రాక సత్యమనియె కాకికబురు. 


“తేనె పూసిన కత్తి”
కూర్మి బల్కుచు గొంతులు కోయుచుండు
తేనెపూసిన కత్తులౌ మానవులను
వినుడు గోముఖవ్యాఘ్రంబు లనగవచ్చు,
ధర బయోముఖవిషపాత్రలరయ వారు.  
 


“భువన విజయము” 
ఏసభాస్థలిలోన వాసికెక్కిన కవుల్
             దిగ్గజంబులరీతి దీర్చియుందు
రేసభాభవనాన నేవేళ జూచిన
            సాహితీస్పర్థలు జరుగుచుండు
ఏసభాంగణమునం దెన్నెన్నొ కావ్యంబు
           లుద్భవించుచునుండు నుత్సవముగ
నేసభాస్థలమునం దెల్లకాలంబుల
          కవులసన్మానంబు కాంచగలము
"దేశభాషల లెస్స యీ తెలుగ”టంచు
పలికియుండిన కర్నాట ప్రభుని సృష్టి
భువనవిజయంపు నామాన పుడమిపైన
ఖ్యాతినందిన సత్కళాఖండ మద్ది.  

 తృప్తి
ఉన్నదానితోడ నుర్వీతలంబున
సంతసించుచుండ సర్వజగతి
సౌఖ్యమబ్బుచుండు విఖ్యాతి చేకూరు
తృప్తి జీవితాన దీప్తి నొసగు.


తృప్తిలేనిచోట వ్యాప్తంబులైయుండు
వేగ మఖిలమైన రోగములును
మానసంబులోన మమతానురాగాల
గంధమించుకైన కానరాదు.  


మయసభ
ఏసభాభవనంబు వాసిగన్నది చూడ
                సౌందర్యరాశియౌ మందిరముగ,
ఏసభాభవనంబు భాసిల్లుచుండెను
               కమనీయసత్కళాఖండ మట్లు,
ఏసభాభవనమం దాసుయోధను డప్పు
               డవమానమును బొందె ననుపమముగ
ఏసభాస్థలముతా నిమ్మహి పాండవ
               కౌరవకలహాల కారణంబు,
అదియె మయుడను శిల్పితా నతికుశలత
రచన మొనరించి యా ధర్మరాజు కపుడు
నిండు మనమున నర్పించి యుండె నాడు
లేని దున్నట్లు కన్పించు దానిలోన.  

 “అభయ హస్తము”
కలిమి బలిమి యొసగు కలియుగదైవంబు
వేంకటేశ్వరుండు విశ్వమునకు
నభయహస్త మెప్పు డందించుచుండంగ
భయము నందనేల? భక్తకోటి. 

 “ఉగాది”
విజయోత్సవములు జరిగెడు
ప్రజలెల్లరు సుఖములంది బహుసంపదలన్
విజయాబ్దమందు గందురు
నిజమిది శుభమగుత యందు నేనెల్లరకున్. 


 “పుట్టినిల్లు”
ఎద్దాని గనినంత నీక్షణద్వయముతో
హర్షాతిరేకంబు ననుభవింత
మెద్దాని నామంబు నెపుడు విన్ననుగాని
మమతానురాగంబు లమరుచుండు
ఎద్దానిలో జేర నద్దిర! చూడంగ
సకలసౌఖ్యంబులు ప్రకటమగును
ఎద్దాని సారూప్య మిమ్మహీతలమందు
కాంక్షించి వెతికిన కానరాదు
సర్వజనముల కయ్యది సంతతంబు
హర్షదాయక మన్నింట నద్భుతంబు
శాంతియుతమింక శ్రేష్ఠంబు సత్త్వదంబు
పుట్టినిల్లది నిక్కంబు భోగదంబు.  


“వాగ్భూషణము”

భూషణంబులు కాబోవు పుడమిలోన
మనిషి కేనాడు హారాలు, మణులు, విరులు
స్నాన వస్త్రాదు లనుపమ సంపదలును
భూషణంబైన దొక్కవా గ్భూషణంబె


“ఎండమావులు”
ఎండమావిజూచి యిందులో నీరంబు
త్రాగగలనటంచు దలచు జనుడు
కువలయంబులోన కుందేటికొమ్ముకై
వెతుకువాని పగిది వెర్రివాడు.  


కవిత్వ ప్రయోజనము, అవధాని ప్రశంస


యశము ధనము నిచ్చు, వ్యవహారవిదు జేయు
శుభము లందజేయు, సుందరివలె
బోధచేయుచుండు పుడమిని కాన క
వనము సుఖము నొసగు జనుల కెపుడు.


అవధానసుధాకరుడయి
శ్రవణానందంబు గలుగు సరణిని నేడున్
కవితామృతమును బంచుట
స్తవనీయము పార్వతీశశర్మాఖ్యకవీ! 


ధరణి

నేలతల్లి మనము నిత్యసౌఖ్యంబిచ్చి
రక్ష చేయుచుండు లక్షణముగ
పలురకంబులైన కలుషజాలంబందు
కూలద్రోయరాదు కువలయమును.
పుస్తకం

పుస్తకంబునందు భువనంబులన్నియు
దాగియున్నవనుట తథ్య మవని
సకలసౌఖ్యందంబు సర్వార్థదాయియౌ
పుస్తకంబు హస్తభూషణంబు. 



అణో రణీయాన్ మహతో మహీయాన్

పరమాత్మ యణువుకంటెను
పరమాణువుకంటె జూడ బహుసూక్ష్మాంగుం
డరసిన నాపరమాత్ముం
డురుతర కాయుండు నౌచు నునికిన్ జూపున్. 



అద్దెయిల్లు

సొంత యిల్లు లేక చింతించు వారల
నెంతొ యాదరాన చెంతజేర్చి
వంత దీర్చుచుండి సంతోషమందించు
నవనిలోన సత్య మద్దెయిల్లు.


ఈమాతంగము మంగళప్రదముగా నీరాజమార్గంబునన్
క్షేమం బారయు దేవదూత పగిదిన్ జేజేల కర్హంబుగా
భూమిన్ హర్షము పంచుచున్ వెడలె నోపుణ్యాత్ములారా! పయిన్
శ్రీమంతంబగు వృక్షశాఖములతో, చేయందగున్ సన్నుతుల్.
శక్తిహీనులేని యుక్తిగనొకటైన
నధికులైన వారి నణచగలరు
వడివడి మృగరాజు నడవిదున్నలుగూడి
తరుముచుండు దృశ్య మరయదగును.

ఆటవిడుపు
http://www.blogger.com/img/icon_delete13.gif
ఆటవిడుపు కొరకు మేటియై వెలుగొందు
పద్యరచన చేసి హృద్యముగను
చదువువారి కెంతొ సంతోషమునుబంచు
పండితాళి కెల్ల వందనంబు
రసవంతమై యొప్పు రమ్యభోజనమందు
..........అప్పడంబులు జూడ నాటవిడుపు,
విజ్ఞానమును గూర్చు విద్యనేర్పుటలోన
..........హాస్యోక్తు లవిగాదె యాటవిడుపు
సాగరతుల్యమౌ సంసారమందున
.......... ఆప్త బంధుల రాక యాటవిడుపు,
సుఖ దుఃఖ మిళితమై చొక్కు జీవితములో
..........నాత్మజసంప్రాప్తి యాటవిడుపు
నిష్ఠతో గూడి సతతంబు నిర్మలాత్మ
నఘము బాపంగ నుతియించి హరిని గాంచి
భక్తి పొంగార మ్రొక్కిడి ముక్తి గనుట
నాటవిడుపుల కెల్లయు నాటవిడుపు.