Monday 12 November 2012

తెలుగు భాష

తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా వ్రాసిన పద్యములు
తెలుగుభాష యన్న వెలుగులు విరజిమ్ము 
భాష గాదె భువన భాండమందు 
తెలుగువార లౌట దివ్యత నందుటే 
సందియంబు లేదు ఛాత్రు లార!.

తేనె లొలుకు భాష మానితంబగు భాష
మార్దవంబు జూపు మాతృ భాష
భాషలందు జూడ బహుసుందరంబంచు
పొగడ బడిన భాష భువిని నాడు.

నన్నయాది కవుల నున్నత మూర్తుల 
నఖిలజగతి యశము నందినట్టి
భారతాదులైన బహుమూల్య గ్రంథాల
నందజేయు భాష యాంధ్రభాష.

హాయి నందజేసి  యానందమును గూర్చి
మనిషి మనసులోన మమత నింపి
సోదరత్వభావ  మాదరంబున దెల్పు
భాష యాంధ్రభాష భారతమున.

విస్తృతాదరమున వివిధ భాషల లోని
శబ్ద సంపదలను స్వాగతించి 
తన్మయత్వ మంది తనలోన జేర్చెడి
భాష తెలుగు భాష భారతమున.
యతులు, ప్రాసలు, ఛందంబు లద్భుతమగు
గుణములను గూడి మథురమౌ ఫణుతులంది
చిత్తవికసన మొనరించు, సిరులు పంచు
హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము.


విశ్వజనులార! కవులార! విజ్ఞులార!
పరమహితులైన సాహితీ బంధులార!
జాగుసేయగ నికనేల? సత్వరముగ
హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము.


అన్యభాషలపై మోజు నధికముగను
దాల్చగానేల? సరళమై తథ్యముగను
"దేశభాషల లెస్స"యీ తెలుగు గాన

హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము.


కులము, మతములు, గోత్రాలు తలపకుండ
పిన్న పెద్దల భేదాల నెన్నకుండ
మంచి పలుకుల బ్రేమను బంచు చుండు
హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము.


జనుల నొకత్రాట నిలబెట్టి యనుపమగతి
నైకమత్యము బోధించు హర్షమునను
తెలుగునకు సాటి వేరొండు కలదె యెందు?
హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము.


Sunday 11 November 2012

నరకాసురవధ-దీపావళి





పద్య రచన - 158  

సోమవారం 12 నవంబర్ 2012

  

నరకాసురవధ-దీపావళి

ధరణీసుతుడై యొక్కడు
నరకాసురనామమంది నానాగతులన్
సురులను పీడించుటచే
హరి సత్యను గూడి చేరి హతునొనరించెన్.


వరముల నందితి నాకిక
సరి లేరని విర్రవీగి సత్పురుషాళిన్
నిరసించి మదము జూపిన
నరకాసురు డేగె యముని నగరంబునకున్.


నరకాసురవధ గాంచిన
సురసంఘము సంతసించి సుమవర్షంబున్
కురిపించిరి సంతసమున
ధరవారలు దీపరాజి తమ గేహములన్


అరుసంబున నెల్లెడలను
వరుసలుగా తీర్చిదిద్ది వైభవమొప్పన్
వరదీపావళి పర్వము
జరుపంగా బూనినారు సద్భక్తినికన్


మరువక బాలురు, వృద్ధులు
పరమానందంబుతోడ ప్రతివత్సరమీ
సరదాల పర్వరాజము
 

నిరుపమముగ జేతురిలను నిర్మలమతులై. 

 మంగళవారం 13 నవంబర్ 2012

శ్రీకరమీ దీపావళి
యాకరమై వెలుగుచుండు హర్షంబునకున్
చేకొని దీపంబులనిక
నేకాలము వెలుగజేయు డిమ్మహిలోనన్.


దీపము బ్రహ్మాత్మకమై
పాపంబుల నెల్ల బాపి భాగ్యములొస(గన్)గున్
దీపించు హృదుల లోపల
దీపము వెలిగించ నణగు తిమిరము వసుధన్.


జగదాధారము దీపం
బగణిత మహిమాన్వితంబు హర్షద మటపై
నిగమస్తుత్యము కావున
భగవంతుని రూపమంచు ప్రణతు లొనర్తున్.

బుర్రకథ




పద్య రచన - 156 

శనివారం 10 నవంబర్ 2012

  

బుర్రకథ

 తందనాన యంచు ధరణిలో జనులకు
నాట పాట గూర్చి యనుపమమగు
రీతి కథను జెప్పి చేతంబు దీపింప
జేయు బుర్రకథలు శ్రీకరముగ



వర్తమానమైన పౌరాణికంబైన
రాజచరితమైన రమ్యఫణితి
వర్ణనంబు చేసి కర్ణపేయంబుగా
పలుకుచుందు రిందు భవ్యముగను.


తెలుగువారి లోని వెలుగుల కీకళ
సాక్ష్య మాంధ్రదేశసంస్కృతులను
హాయిగొల్పునట్టు లద్దమందున జూపు
పుడమి వారె కెందు బుర్రకథలు. 

నమో వేంకటేశ










 

 నమో వేంకటేశ

కలియుగంబునందు కలుషంబులను బాపి
భక్తకోటి గాచి వరములొసగ
తిరుమలేశుడౌచు దివ్యతేజంబుతో
వేంకటేశ్వరుండు వెలసె ధరను.

పాంచజన్యమైన భవ్యశంఖము బూని
ధర్మరక్షయౌ సుదర్శనంబు,
నిరుపమంబులైన తిరునామములతోడ
వేంకటేశ్వరుండు వెలసె ధరను.


భక్తితోడ నేడు ప్రణతులర్పింతును
కలియుగాధినాథు గొలుతు నెపుడు
వేడు కొందు నెందు నేడుకొండలవాని
ధర్మమూర్తి నెపుడు దలచుచుందు.