Thursday 26 July 2012

కాళియమర్దనము

26.07.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో   
"పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన చిత్రమునకు 
వ్రాసిన పద్య వ్యాఖ్య
 
కాళియమర్దనము
కాళియుడను భీకరమౌ
వ్యాళము కలిగించుచున్న బాధల నెల్లన్
తాళగజాలక వంశీ(వంశజ)
నాళంబును దాల్చుఘనుని నమ్మిరి వారల్.

గోపకులము గావ గోవిందు డలనాడు
హ్రదము నందు దూకి యహిని బట్టి
సత్వ మణచి గర్వసంహార మొనరింప
ఫణములందు దూకి బహుళగతుల.

తాండవంబు చేసి దానిగర్వము ద్రుంచి
యభయ మొసగె నహికి నద్భుతముగ
తన్మయత్వమంది తనవారు, ఖేచరుల్
జయము బలుకుచుండ శౌరి యపుడు.

జయము బాలకృష్ణ! శ్యామాంగ! మాధవ
జయము దానవారి! చక్రధారి!
జయము వాసుదేవ! సత్సౌఖ్యదాయక!
సర్వలోకనాథ! జయము నీకు. 

Saturday 21 July 2012

తమలపాకు

21.07.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో   
"పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన చిత్రమునకు 
వ్రాసిన పద్య వ్యాఖ్య

తమలపాకు

భగవదర్చనంబు ప్రారంభమౌటకు
తాను సాధనంబు ధరణిలోన
భాగ్యశాలి చూడ యోగ్య యన్నింటను
తమలపాకు ధన్య తథ్యము గద!     1.

శోభలినుమడించు శుభకార్యములలోన
దీని యునికివలన దీప్తు లొలుకు
సంతసంబు గలుగు సద్భావమేర్పడు
తమలపాకు ధన్య, తథ్యము గద!     2.

సరసమైనయట్టి సత్కావ్యరచనంపు
కాంక్ష కలుగజేయు కవులకిలను
వక్క,సున్నములకు చక్కని నేస్తమై
తమలపాకు ధన్య, తథ్యము గద!     3.

తానె ముఖ్యమౌచు తాంబూలమందున
హాయి నొసగుచుండి యద్భుతముగ
నుర్వి జనులలోన నుత్సాహమును జేర్చు
తమలపాకు ధన్య, తథ్యము గద!     4.

వ్రతములందు జేరి వైభవంబుగ నూరి
వారిలోన బెంచు భక్తి నెపుడు
శ్రద్ధ గలుగజేయు సాధుత్వమును గూర్చు
తమలపాకు ధన్య, తథ్యము గద!     5.

పిన్నవారికైన పెద్దలకైనను
కంఠశుద్ధి చేసి కమ్మనిదగు
స్వరమునందజేయు సత్వంబు గలిగించు
తమలపాకు ధన్య, తథ్యము గద!     6.

Thursday 12 July 2012

పసిడి జింక

12.07.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో   
"పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన చిత్రమునకు 
వ్రాసిన పద్య వ్యాఖ్య

 పసిడి జింక
సీ.
రంగారు వర్ణాల రమ్యమై వెలుగొందు
          సుందర హరిణమ్ముఁ జూడు డార్య!
బంగారుమేనుతో సింగారములు నిండి
          యిందు నందును వేగ మేగుచుండె
చంచలాక్షులతోడ సయ్యాటలాడుచు
          నందకుండగ దూర మరుగుచుండె
ఎట్టులైనను దీనిఁ బట్టుకోవలెనంచు
          మానసంబున వాంఛలూనుచుండె
కోరబోవను వేలాది కోర్కెలెపుడు
జగతి ననుపమమైన యీ మృగము నిపుడు
రయమునను దెచ్చి నా మనోరథము దీర్చ
గోరుచుంటిని మిమునాథ! కూర్మిమీర.
మ.
మునుపేనాడును జూడలేదు మిగులన్ 
                                 మోదంబు నందించుచున్
వనభూమిన్ దిరుగాడుచున్నది మహ
                                  ద్భాగ్యంబు నేడీ మృగం
బినవంశోద్భవు డందజేసినను నా
                                  కెంతేని చేకూరు తా
ననుచున్ జానకి కాంక్ష చేసినది 
                                   దివ్యానందసంపూర్ణయై.
సీ.
అసురు లెవ్వారలో కసితోడ నీరీతి
          మాయను కల్పించి మనకు నిట్లు
భ్రమగల్గునట్లుగా పసిడిజింకను జేసి
          యుందురు గాని వేరొండు గాదు
దీనినందుటయన్న హాని పొందుటె గాదె
          నామాట నమ్ముము రామచంద్ర!
దనుజుల కృత్యాలు మనమెరుగనట్టివా
          కోరుచు నద్దాని జేరు కొరకు
యత్న మొనరింప వద్దంచు నగ్రజునకు
చెప్పి వారింప జూచిన నప్పుడతడు
లక్ష్మణా! విను జానకీ రమణి కొరకు
సంత సంబున నేగి సాధింతు నిదిగొ. 
తే.గీ.
ఇట్టె కొనివచ్చి యద్దాని నింపుమీర
హర్షమొదవంగ సీతకు నందజేతు
నసురుడైనచొ వానిని యముని కడకు
పంపె దనటంచు రాముడు పలికె నపుడు.

Wednesday 11 July 2012

వివాహబంధం

11.07.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో   
"పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన చిత్రమునకు 
వ్రాసిన పద్య వ్యాఖ్య

 వివాహబంధం
వివాహబంధం బది విశ్వమందున్
నవీనసౌఖ్యంబు లనంత దీప్తుల్
భువిన్ బ్రసాదించును భోగదంబై
భవంబునం బూర్ణత పంచుచుండున్.

అతీవసంతుష్టిదమౌచు నిత్యం
బితోధికానందము లిచ్చుచుండున్
చతుర్విధార్థంబుల సాధకంబై
సుతాదిసంపత్తులు చూపుచుండున్.

ఈవైవాహికబంధనంబు దివిలో 
                                           నేనాడొ సర్వేశ్వరుం
డావిశ్వాత్ముడు నిర్ణయించి కృపతో 
                                           నాశీస్సులందించి తా
నీవేళన్ సుముహూర్తమేర్పరచినా 
                                           డీ యిద్దరెల్లప్పుడున్
శ్రీవైభోగములందుచుండ వలయున్ 
                                           సిద్ధించి సత్సంతతుల్.

వేదవిదులు మరియు విద్వాంసు లీరీతి
బ్రాహ్మణోత్తములును, బంధుజనులు
పలికి కూర్మితోడ భవ్యమౌ దీవెన
లందజేయుచుందు రచట చేరి.

Tuesday 10 July 2012

రూపాయి

10.07.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో   
"పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన చిత్రమునకు 
వ్రాసిన పద్య వ్యాఖ్య


  
రూపాయి
జగముల కీవే మూలము
నిగమంబుల పాఠనంబు నిత్యార్చనముల్
భగవత్సేవలు నీకొర
కగణితసుఖకామ్యదాత వగు రూపాయీ! 1.

పరమానందము నిత్తువు
కరుణాత్మకుడన్న పేరు కఠినున కిలలో
నిరతము గూర్తువు, మహిమను
కరమొసగెడుదాన వీవు గద! రూపాయీ! 2.

విద్యాహీనునకైనను
సద్యోజ్ఞానంబు నొసగి సంఘమునందున్
హృద్యంబగు గౌరవ మెపు
డద్యతన సుఖంబులిత్తు వట! రూపాయీ! 3.

అందము లేని కురూపికి
సుందరరూపునకు నుండు శోభలు, మరియున్
నిందితులకు సజ్జనయశ
మందింతువు శక్తియుక్తవగు రూపాయీ! 4.

నీవెవ్వనిఁ గరుణింతువొ
సేవింతురు వాని జనులు శ్రీపతి యనుచున్
భూవిభుడవు నీవేనని
యేవేళను బల్కుచుందు రిక రూపాయీ! 5.

ఎవరెవరో బంధువులని
సవినయముగ వచ్చి చేరి సహచరులగుచున్
నివసించుట నీ మహిమయె
యవిరళసంతోషదాయి వగు రూపాయీ! 6.

ఒక్కడు ధరణీపతియై
యొక్కడు దాస్యంబు చేయుచుండుట కవురా
నిక్కము నీవే కారణ
మిక్కుంభినిలోన జూడ నిక రూపాయీ! 7.

నిరుపేదకు రాజరికము
ధరనేలెడు వానికేమొ దారిద్ర్యంబుల్
ధరణిని గలుగుటకున్ నీ
కరుణయె కారణ మటండ్రు గద! రూపాయీ! 8.

నీవుండిన సుఖముండును
నీవమరిన ధైర్యమబ్బు నిఖిలజగాలన్
నీ వత్యవసరమనదగు
నేవేళను దయనుఁ జూపు మిక రూపాయీ! 9.

స్మరియించిన నమరెదవో?
నిరతము సద్భక్తితోడ నినుఁ బూజింపన్
నరులకుఁ గూడెదవో? మరి
వరముల నిచ్చెదవొ? చెప్పవలె రూపాయీ! 10.
 

Monday 9 July 2012

క్షత్రియధర్మం

09.07.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో   
"పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన చిత్రమునకు 
వ్రాసిన పద్య వ్యాఖ్య
 
 క్షత్రియధర్మం
లోకహితమును గోరుచు నేకదీక్ష
యజ్ఞయాగాది క్రతువుల ననవరతము
చేయు చుండెడి సన్మునిశ్రేష్ఠులకును
విఘ్నములు గూర్తు రసురులు వివిధగతుల.

దుష్టులను గూల్చి యణగించి దుర్మతులను
ధర్మరక్షణ చేయుచు ధైర్యమొసగి
సాధుజనులను గాచుట క్షత్రియులకు
విహితధర్మంబు చూడగ విశ్వమందు.

గాధినందను డొనరించు క్రతువు నపుడు
భంగ మొనరింప బూనిన పరమనీచు
లైన రక్కసిమూకను యముని పురికి
రామ చంద్రుండు పంపించె రయము మీర.

అతివనైనను దుర్మతి యగుచు మీరి
సజ్జనాళిని బాధించి సవనములకుఁ
గీడు కలిగింపఁ బూనిన నాడు దానిఁ
జంప దగునిందు లేదింత సందియంబు.

Friday 6 July 2012

శ్రీకృష్ణ దేవరాయలు


06.07.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో   
"పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన చిత్రమునకు 
వ్రాసిన పద్య వ్యాఖ్య 

 శ్రీకృష్ణ దేవరాయలు
సీ.
ఎవ్వాని లేఖిని నింపైన కావ్యాల
          సౌరభంబులు జాలువారుచుండు
నెవ్వాని యసిధార నిమ్మహీపతులందు
          శాత్రవులెదిరించ జంకుచుందు
రెవ్వాడు చూడంగ నీయిలాతలినెప్పు
          డర్థిసంఘంబుల కాత్మబంధు
వెవ్వాని గళములో నీశ్వరాంశజులైన
           కవివరేణ్యులపట్ల గౌరవంబు
ఆ.వె.
కానవచ్చుచుండు క్రమముగా నెల్లప్పు
డాత డఖిలజగతి నాంధ్రభోజు
డనగ నందియుండె నమితమౌ సత్కీర్తి
కృష్ణరాయవిభుడు విష్ణుసముడు.
సీ.
అష్టదిగ్గజములై యతులిత పాండితీ
          వైభవంబందిన వారి కచట
భువనవిజయమందు పూజల నొనరించి
          సాహిత్య సభలను జరుపుచుండి
గండపెండేరాది ఘనమైన సత్కార
          సేవల నవ్వారి సేదదీర్చి
తెలుగుభాషయె లెస్స దీనివంటిది లేదు
          భాషలఁ జూడంగ భరతభువిని
తే.గీ.
అనుచు బలుకుచు దశదిశ లందు నతడు
తెలుగు భాషను మేటిగా వెలుగ జేసి
ఆంధ్ర కర్నాట రాజ్యాల కధిపు డగుచు
కీర్తినందెను నరసింహ కృష్ణవిభుడు.
కం.
ఇరువురు దేవేరులతో
సరసుండై కూడియుండి సద్భక్తుండై
హరిసేవాతత్పరుడై
వరలిన నరసింహ కృష్ణ ప్రభునకు జేజే.
తే.గీ.
అవుర! యాముక్త మాల్యద నద్భుతముగ
తీర్చి దిద్దిన శ్రీకృష్ణ దేవరాయ!
ధరణి నీకీర్తి యాచంద్ర తారకముగ
నిలిచి యుండును రాజేంద్ర! నీకు నతులు. 




ది. 24.04.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో 
 "పద్యరచన" శీర్షికనఇవ్వబడిన చిత్రమునకు 
వ్రాసిన పద్య వ్యాఖ్య 
 
సీ.
ఒకచేత నసిబట్టి సకలారి సంఘాల
          నధిక తేజంబుతో నణచినావు,
ఒకచేత ఘంటంబు(లేఖిని) ఒప్పుగా ధరియించి
          కవివరేణ్యుల మించి ఘనత గాంచి,
ఆముక్తమాల్యదాద్యనుపమకృతులను
          బహు సమర్థతతోడ బలికినావు,
అష్టదిగ్గజములం చలరారు కవులతో
          సాహితీ సభలెన్నొ జరిపినావు
తే.గీ.
"దేశభాషల జూడంగ తెలుగు లెస్స"
యనెడు సూక్తికి సార్థక్యమందజేయు
"సాహితీ సమరాంగణ సార్వభౌమ!
విష్ణుసన్నిభ! నరసింహ కృష్ణరాయ!".

Thursday 5 July 2012

ఓం నమశ్శివాయ

ది. 05.07.2012 వ తేదీ 
"శంకరాభరణం" బ్లాగులో 
"పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి 
వ్రాసిన పద్యవ్యాఖ్య

ఓం న మ శ్శి వా య


ఓంకారాత్మక! పురహర!
శంకర! పరమేశ! నిన్ను సతతము భక్తిన్
శంకించక గొల్చెద రెవ
రంకితులై, గలుగు వారి కంతట జయముల్.

రులైనను సురలైనను
నిరతము నీనామ జపము నిష్ఠం జేయన్
కరమరుదగు సత్పదమును
పరమేశా! గూర్తు వెపుడు భాగ్యవిధాతా!

దిలో దృఢముగ నమ్ముచు
సదయాత్ముడవైన శర్వ! సాధ్వంబువులన్
ముదమందుచు నభిషేకము
లుదయాదిగ నీకు జేయ నున్నతిగల్గున్.

శివ! యురము, శిరము, కన్నులు
భవ! మనమును, వాక్కు లింక పదములు కరముల్
ధ్రువముగ వీనులు గూర్చుచు
సవినయముగ జేతు నీకు సాష్టాంగనతుల్.


వాసము కాశీనగరిని
చేసిన వారలకు మోక్షసిద్ధి యవశ్యం
బో సర్వేశ్వర! యిత్తువు
నీసరి దేవతలు గలరె నిఖిల జగాలన్.

మపాశపు భయమైనను
సమయింపగ జేసి గాచి సకల శుభంబుల్
క్రమతన్ భక్తులకొసగెద
వమలిన సద్యశములిచ్చి యనవరతంబున్. 

 శ్రీ వేంకటేశ్వరస్వామి
మంగళ మహాశ్రీ వృత్తము

వందనము చక్రధర! వందనము దేవనుత! 
                                వందనము భక్తజనబంధూ!
వందనము శ్రీరమణ! వందనము విశ్వనుత! 
                                వందనము భవ్యగుణసింధూ!
వందనము లద్రిధర! వందనము దైత్యహర! 
                                వందనము తిర్మలగిరీశా!
నందసుత! నిన్గొలుతు,  నన్ గరుణ గాంచుము 

                                ప్రణామములు మంగళమహాశ్రీ"


Wednesday 4 July 2012

భగత్ సింహ్

ది. 04.07.2012 వ తేదీ 
"శంకరాభరణం" బ్లాగులో 
"పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి 
వ్రాసిన పద్యవ్యాఖ్య
 

 భగత్ సింహ్
శా.
స్వాతంత్ర్యోద్యమమందు దేశమునకున్ 
                                      భక్తాగ్రగణ్యుండుగా
నేతృత్వంబు వహించి మ్లేచ్ఛకృతముల్ 
                                      నిందించి దేశీయులం
దాతండందరికిందు ధైర్యవిభవం 
                                      బందించె, వీరుండుగా
ఖ్యాతింబొందిన భక్తసింహునకు 
                                      నేనర్పింతు జోహారులన్.
ఆ.వె.
భగతసింహ! వీర! భారతావనియందు
స్వేచ్ఛ నందజేసి సిరులు బంచు
కొరకు నీవు చేయు నిరతయత్నముఁ జూ  డ
నిరుపమాన మౌర! నీకు నతులు.
 
ఆ.వె.
దేశహితముఁ గోరి ధీరత్వమును బూని
యుద్యమించి ముందు కురికి తుదకు
పరమభాగ్య మనుచు ప్రాణంబులనుసైత
మర్పణంబు చేతు వనఘ! నీవు. 

 ఆ.వె.
నిష్ఠ బూని చేయు నీబలిదానంబు
మరువరాని దెపుడు మహితచరిత!
సతము భరతభువిని సంస్మరణీయమై
ప్రణతులందుచుండు భగతసింహ!
 
ఆ.వె.
భారతీయులౌచు స్వాతంత్ర్యజీవన
వరము నంది యున్న వారి కెల్ల
నీదు దివ్యచరిత మాదర్శ మైయొప్పు
వందనంబు లయ్య! భగతసింహ!
 

Tuesday 3 July 2012

వేదవ్యాసుడు

ది. 03.07.2012 వ తేదీ 
"శంకరాభరణం" బ్లాగులో 
"పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి 
వ్రాసిన పద్యవ్యాఖ్య



వేదవ్యాసమునీంద్రసత్తమునకున్, విద్యాసముద్రుండుగా
వేదంబుల్ విభజించి చూపి క్రమతన్ విశ్వప్రజానీకముల్
మోదంబంద పురాణసంచయమిలన్ మున్నెవ్వడందించెనో
ఆ దివ్యాత్ముని కంజలింతు సతమున్ హర్షాతిరేకంబునన్.

సురుచిరశబ్దసంయుతము, సుందరభావగుణాన్వితంబు, స
త్వరపురుషార్థసిద్ధిదము, భాగ్యవివర్ధనకారకంబుగా
కురుచరితంబు కావ్యముగఁ గూరిచినట్టి మహామహుండికన్
సురసముడైన వ్యాసునకు శుద్ధమనస్కున కంజలించెదన్.

పంచమవేదమై నిలిచె భారతకావ్యము జ్ఞానసంపదన్
బెంచెడిదై కవీంద్రులకు విజ్ఞత గూర్చెడిదౌచు నన్నిటన్
మించినదై వెలింగినది మేటిగ దాని సృజించువాని నే
నంచితమైన భక్తి తనివారగ వ్యాసుని ప్రస్తుతించెదన్. 

వ్యవస్థ మారేనా

ది. 02.07.2012 వ తేదీ 
"శంకరాభరణం" బ్లాగులో 
"పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి 
వ్రాసిన పద్యవ్యాఖ్య
 
సీ.
సౌధరాజమునందు సౌఖ్యంబులనుగాంచి
          వైభవంబులఁ దేలు వారలొకరు
పూరిగుడిసెలోన భోజనంబునకైన
          భాగ్యమందని పేదవారలొకరు
పిత్రార్జితంబైన విత్తంబు చేకొని
          నిరతసంతోషులౌ సరసులొకరు
పిన్న పెద్దలటంచు భేదమించుకలేక
          సభ్యులందరు గూడి సర్వగతుల
నెండ వానలు చూడక నెల్లవేళ
లందు కష్టంబునకునోర్చి యన్ని పనులు
చిన్మయానందమూర్తులై చేయుచుండు
వారలొకకొంద రరయంగ భారతమున.
చం.
అరువదియైదు వత్సరములద్భుతరీతి గతించిపోయె నీ
భరతభువిన్ స్వకీయపరిపాలనమంది, స్వతంత్రభారతిన్
సరియగు నార్థికోన్నతుల ఛాయలు పేదలజీవితాలలో
నరయగ లేము, కారణము లందరికిన్ విదితంబులే గదా!
తే.గీ.
విద్య నేర్వంగ వలసిన వేళలోన
బాలికలు సైత మింతటి భారమైన
పనులు చేయుట కటకటా! భావ్యమగునె?
తమకుటుంబము పోషించ దలచి యౌర!
తే.గీ.
ఆటపాటలలో కాల మందమొప్ప
గడుపగలయట్టి భాగ్యంబు కానరాదు
కఠినతరమైన దారిద్ర్య కారణమున
బాలికలకైన నీరీతి భరతభువిని.
తే.గీ.
సమత చేకూర గలుగునా సంఘమందు
నార్థికాభ్యుదయముగల్గి యందరకును,
బాల కార్మికసరణులీ భారతమున
నంతరించునె? సౌఖ్యంబు లందగలవె?

Sunday 1 July 2012

రవీంద్రుడు

ది. 01.07.2012 వ తేదీ  
"శంకరాభరణం" బ్లాగులో  
"పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి 
వ్రాసిన పద్యవ్యాఖ్య
రవీంద్రుడు
శా.
చేతం బుల్లసిలంగ జేయు పదరాజింగూర్చి యందంబుగా
జాతీయంబగు గీతరాజమును దేశైశ్వర్య (దేశైక్యాను)  
                                                           సంధాయిగా
ఖ్యాతిం బెంచెడిదానిగాఁ బలికె నాహా! సత్కవీశుండు నే
జోతల్ సేతు రవీంద్రనాథునకు సుశ్లోకుండునౌ మౌనికిన్.
తే.గీ.
ఉన్నతంబైన భావంబు లెన్నొ చేర్చి
గీతములు గూర్చి యలరించు రీతి నాత
డంజలించుచు సత్కీర్తి నందుచుండి
విశ్వకవియౌచు నిలిచిన విజ్ఞవరుడు.
తే.గీ.
పుణ్యభూమిగ పదునాల్గు భువనములను
ఘనత నందిన భారతావనికి భక్తి
నీత డందించె శాంతినికేతనంబు
వినయమున జేతునిక రవీంద్రునకు నతులు.