Sunday, 27 May 2012

దండకములు

దండకము - 1
శ్రీరామ
     శ్రీమత్కృపాసింధు! హేదీనబంధూ! మహాదేవదేవా! ప్రభూ! రామచంద్రా! సదాలోకరక్షైకకార్యాబ్ధిమగ్నా! శుభాకార! సంఘంబునందున్న పాపంబు లన్యాయకార్యంబులన్ జూడుమా నేడు దేశంబులో నెల్లెడం దీవ్రవాదంబు విస్తార రూపంబు దాల్చెన్, మతోన్మాద మత్యుగ్రరీతిన్ విజృంభించె, స్వార్థంబె ముఖ్యంబుగా లోకులీనాడు విత్తార్జనంబే ప్రధానంబుగా బూని బంధుత్వభావంబులన్ రోసియున్నారు సంపత్తులే శాశ్వతంబా? యికే శాఖలో చూచినన్ లంచగొండుల్ సదన్యాయమూర్తుల్ (మహాన్యాయమూర్తుల్) విరాజిల్లుచున్నారు, సత్యంబు, ధర్మంబు, శాంతంబు, క్షేమంబు, యోగంబు లేమూలనో దాగె, వేదోక్త, శాస్త్రోక్తరీతుల్ భయంబందియుండెన్, పరాధీనమై పోవుచుండెన్ స్వధర్మంబు, చూడంగ దేశాధినేతల్ సదా స్వార్థమే పూనియున్నార లేమూలలో చూచినన్ స్కాములే దర్శనం బిచ్చుచుండంగ  ఈదేశమున్ రక్ష చేయంగ నింకెవ్వరున్నార లోదేవ! రావా మరోమారు త్రేతాయుగంబిందు కల్పించి రక్షించు, శ్రీరామరాజ్యంబు తెప్పించుమా యంచు ప్రార్థించుచున్నాడ, దండంబు లందించు చున్నాడ కాపాడు మీదేశమున్ రామచంద్రా! నమస్తే నమస్తే నమస్తే నమ:
 
దండకము - 2
శ్రీవైష్ణవీమాత

     శ్రీచక్రసంచారిణీ!  దైత్యసంహారిణీ!  లోకమాతా! జగద్వ్యాప్తఘోరాఘసంఘంబులం ద్రుంచగా మోహనాకారివై జమ్ముకాశ్మీర మందున్న కాట్రాఖ్యమై యొప్పు  గ్రామంపు గోత్రాగ్రభాగంబు నందుండి,  శ్రీవైష్ణవీ నామధేయంబుతో భక్తులన్ బ్రోచుచున్, సర్వసౌభాగ్యసంపత్తు లందించుచున్, పుత్రమిత్రాది సౌఖ్యంబులం గూర్చుచున్, తల్లివై గాచుచున్నావు, నీనామ సంకీర్తనల్ చేసినన్, నిన్ను పూజించి వర్ణించినన్, నీకథాలాపముల్ భక్తితో చేసినన్, నిన్ను దర్శించి నీయందు విశ్వాసముం జూపి ప్రార్థించు వారెల్లరున్ శాశ్వతానందముం బొంది మోక్షంబు సాధింపరే తల్లి! నీపాదపద్మంబులే మాకు దిక్కమ్మ, పాదాంబువుల్ తీర్థమమ్మా! హృషీకేశశక్రాది సర్వామరుల్ నీకృపాపాత్రులై  లోకరక్షాఢ్యతన్ బొంది యున్నారు, ముల్లోకముల్ నీయధీనంబులమ్మా! జగన్మాత! సద్బుద్ధి యందించి కాపాడవమ్మా! యికన్ వైష్ణవీ! మాతృమూర్తీ! నమస్తే నమస్తే నమస్తే నమ:

దండకము - 3
శ్రీ ఆంజనేయ
శ్రీయాంజనేయా! ప్రభూ! వాయుపుత్రా! మహద్దివ్యచారిత్ర! వీరాధివీరా! శుభాకార! శ్రీరామభక్తాగ్రగణ్యా! దశగ్రీవవంశాంతకా! లోకపూజ్యా! మహాత్మా! పరాకేలనయ్యా! మొరాలించవయ్యా! సమస్తాఘసంఘంబులంద్రుంచి శీఘ్రంబె కావంగ రావయ్య! నీయద్భుతంబైన చారిత్రమున్ భక్తితో బాడగా సర్వసౌభాగ్యముల్ గల్గు సందేహ మొక్కింత లేదయ్య! నిన్భక్తితో గొల్తు భాగ్యంబు గల్గించి రక్షించుచుం, దల్లివై ప్రేమనందించుచుం, దండ్రివై గాచుచున్, మిత్రరూపంబునం జేరి సన్మార్గముం జూపుచున్, భ్రాతవై ధైర్యముం బెంచి కాపాడవయ్యా! సదా నిన్ను ధ్యానింతు, పూజింతునయ్యా! కథాలాపముల్ జేతునయ్యా! మదీయాంతరంగంబు నందున్న దుర్బుద్ధులన్ ద్రుంచి, సద్భావసంపత్తులం జేర్చుమా, సాధుసంగంబులం గూర్చుమా, సర్వదా నీపదాబ్జాతముం దాకి యర్చించు సౌఖ్యంబు గల్పించి, నీయందు సద్భక్తి గల్గించవయ్యా! సదా సర్వదు:ఖాపహారీ! మహాకాయ! శ్రీయాంజనేయా! నమస్తే నమస్తే నమస్తే నమ:|

Monday, 21 May 2012

ప్రత్యేక ఛందస్సులో పద్యాలు

ప్రత్యేక ఛందస్సులో పద్యాలు

ఉత్సాహవృత్తము (16.05.2012)
( ఏడు సూర్య గణాలు+ఒక గురువు) 
(ఐదవగణం మొదటి అక్షరం యతిస్థానం)
(కేవలం హగణమే వాడరాదు)
భక్తజనులఁ జేరదీసి భాగ్యమందజేయుచున్,
శక్తియుక్తు లొసగుచుండి, సద్యశంబులిచ్చుచున్
భక్తి నింపి హృదులలోన బంధనాలు ద్రుంచుచున్
ముక్తినొసగు దానవీవు మోదమంద వైష్ణవీ!

పాదపవృత్తము (16.05.2012)
(భ,భ,భ,గగ)-యతి ఏడవ అక్షరం
నీదరి జేరితి నేనిక దేవా!
కాదనబోకుము కౌస్తుభధారీ!
నీదయ జూపుము నిత్యమటన్నన్
పాదపమౌనది వాదన లేలా? 

ద్రుతవిలంబిత వృత్తము
(న,భ,భ,ర - ఏడవ అక్షరం యతి)
కరుణ జూపుము కావుము వైష్ణవీ!
ధరను ద్రుంచుము దైన్యము శాంకరీ!
పరమసౌఖ్యము భాగ్యము లిచ్చటన్
నిరతమిమ్మిక నీసుతు లందరున్.

సుగంధి వృత్తము (17.05.2012)
(ఏడు హగణాలు+ఒక గురువు - ఐదవగణం మొదటి అక్షరం యతి స్థానం)
అందమైన పద్యమొక్కటైన చాలు చూడగా
వందనీయమౌచు వెల్గు భావయుక్తమైనచో
నందజేయుచుండు కీర్తి, హర్షదీప్తి కర్తకున్
వందలేల? భావసౌరభంబు లేని పద్యముల్. 

వేదమేమి చెప్పుచుండె విజ్ఞులార! గాంచుడీ
సోదరత్వభావమింత చూప గల్గు సౌఖ్యముల్
భేదమెందు గూడి యుండి ద్వేషబుద్ధి దాల్చుటల్
కాదు మంచి దన్నచో "సుగంధి"యౌను శ్రీహరీ!

పండితార్య! రోజుకొక్క పద్యలక్షణంబులన్
రండు నేర్చుకొండటంచు రమ్యమైన శైలిలో
నిండుగా మనంబులోన నిష్ఠబూని నిత్యమున్
దండిగా వచించు మీరు ధన్యులండి, సన్నుతుల్

పంచచామర వృత్తము ( 18.05.2012)
(జ,ర,జ,ర,జ,గ- పదవ అక్షరం యతి)
నిరంతరమ్ము భక్తితోడ నిర్మలాత్ములౌచు నా
పరాత్పరున్, సదాశివున్, కృపాలు చంద్రశేఖరున్
హరా! యటంచు గొల్చువార లద్భుతంబుగానికన్
పురాకృతాఘముక్తులౌచు పూజ్యులౌదు రెల్లెడన్.

మరింత జాగు చేయనేల మాన్యులార! రావలెన్
పరిశ్రమించ సాధ్యమౌను పంచచామరంబహో
పరాకులేక గూర్తుమింక పద్యరత్నమిప్పుడే
జరల్ జరల్ జగంబు లుంచి చక్కనైన రీతిలో. 

తోటక వృత్తము( 19.05.2012)
(నాలుగు సగణాలు-తొమ్మిదవ అక్షరం యతి)
హరినైనను శంకరునైన ప్రభూ!
కరుణామయ భక్తుల గావు మటం
చరుసంబున వేడుటకై భువిలో
వరమైనది తోటక పద్యమికన్.

వినయంబు సమార్జిత విద్యలకున్
ఘనభూషణమై చిరకాలయశం
బనయంబు సుఖంబు లనంతములౌ
ధనరాశుల నిచ్చును తథ్యమిలన్.

జగదంబవు నీవని శాంకరి! హే
యగజాత! దయాభరితాత్మికగా
నిగమంబులు పల్కును నీ ప్రజకున్
సుగుణంబు లొసంగుము చూపు దయన్.  

స్రగ్విణీ వృత్తము ( 20.05.2012)
ర,ర,ర,ర(7 వ అక్షరం యతి)
గోపికావల్లభా! కోరికల్ దీర్చుమా
కోపమింకేలనో? కూర్మి జూపించుమా
పాపముల్ ద్రుంచుమా భాగ్యముల్ పెంచుమా
నీపదాబ్జంబులే నిత్యమర్చించెదన్.


మీది సద్యత్నమో మిస్సనార్యా! కవీ!
మోదమందించె, దామోదరుం డెల్లెడన్
తా దయం జూపుచున్ ధన్యతం గూర్చుచున్
మీద సత్కీర్తులన్ మీకొసంగున్ సదా.


భుజంగప్రయాతం-21.05.2012 
(య,య,య,య-8వ అక్షరం యతి)

పరాకేలనయ్యా! కృపాపూర్ణ! దేవా!
వరాలిచ్చి మమ్మింక పాలించవయ్యా!
పరంధామ! శ్రీరామ! భాగ్యాబ్ధివంచున్
నిరూపించవయ్యా!మునీంద్రైకగమ్యా! 

శరీరంబు వెల్గొందు సత్వంబు హెచ్చున్
వరీయత్వభాగ్యంబు వైదుష్యమబ్బున్
చిరానందసౌఖ్యంబు సిద్ధించు మీదన్
మురారిన్ భజింపంగ మోక్షంబు గల్గున్.

రమాకాంత! గోవింద!  రాజీవనేత్రా!
క్షమాపూర్ణ! దైత్యారి! శ్యామాభ్రవర్ణా!
ఉమేశాదిముఖ్యామరోద్ధారధుర్యా!
నమస్సర్వలోకైకనాథా! నమస్తే.

వనమయూరము(ఇందువదన) -  22.05.2012
(భ,జ,స,న,గగ - తొమ్మిదవ అక్షరం యతి)


లేరె ఘనదైవములు లెక్కలకు జూడన్
రారు దయజూపుటకు రమ్యమగు రీతిన్
చేరి నిను గొల్చెదను సిద్ధముగ రామా!
రార మము గావగను రమ్యగుణధామా!

రథోద్ధతము ( 23.05.2012)
ర,న,ర,వ - ఏడవ అక్షరం యతిస్థానము
స్వగతం

ప్రేమతోడ నిను బిల్చుచుంటినో
రామచంద్ర! యిటు రమ్ము కావగా
మామకాఘములు మాడ్చివేయుచున్
నీమహాత్మతను నిల్పుమా యికన్.  1.


సత్యచారులయి సాధుశీలురై
నిత్యశాంతులయి నిర్మలాత్ములై
జాత్యతీతులగు శత్రుహీనులా
దిత్యతుల్యులయి తేజరిల్లరా.  2. 

కోరలేదెపుడు కోట్లసంపదల్
దూరలేదు నిను దుర్మదాంధతన్
నేరమేమిటిక? నీదుభక్తునిన్
చేరరావు మరి శ్రీరమాధవా!  3. 


జీవదాతయును చిత్స్వరూపియున్
పావనుండనెడు భావనంబుతో
నీవెదిక్కనుట నేరమా హరీ!
కావవేమి మధుకైటభాంతకా!  4.  

జ్ఞానశూన్యుడను కాముకుండనై
దీనబంధుడగు దేవదేవ! నిన్
కానరావనుచు కాఱులాడితిన్
నేను మూర్ఖుడను నిత్యసౌఖ్యదా!  5.

స్వాగత వృత్తము ( 24.05.2012)
ర,న,భ, గగ - ఏడవ అక్షరం యతి స్థానం
వర్తమానం

మంచివారలయి మానవులిందున్
పెంచి ప్రేమమును పేదలయందున్
పంచగావలయు భాగ్యము లెందున్
సంచితార్థములు సత్ఫలమందన్.   1.

సాటివారికిల సాయము చేయన్
కోటిసంపదలు కూడును గాదా!
ఓటలేక విపులోర్విని తానే
కూటయౌచు సిరిగోరుట మేలా?   2.

ఓటు కోసమని ఉర్విజనాలన్
పూటపూటగని పూజలతోడన్
నోటు జూపెదరు నూరును వేలున్
నేటి కాలమున నేతలు జూడన్.   3.

చేయు బాసలవి చిత్తపథంబున్
వాయువేగమున వైదొలగంగా
మేయుచుండుటయె మేలని వారల్
హాయినుందురిక అద్భుతరీతిన్.   4.

రాజకీయముల రంగులనింకన్
భూజనుల్ తమరు పోల్చగ మేలౌ
మోజులో పడక మోహము వీడన్
తేజరిల్లు భువి దివ్యత నందున్.     5.

మణిరంగ వృత్తము -(25.05.2012)
 ర,స,స,గ  -   ఆరవ అక్షరం యతి స్థానము.  
శివస్తుతి

పార్వతీపతి! పాపవిదారా!
సర్వరక్షక! సౌఖ్యవిధాతా!
శర్వ!ధూర్జటి! శంకర! దేవా!
గర్వ నాశక! కామిత మీవా.  1.

రక్షకుండవు రాజువు నీవై
దీక్షబూనుచు దివ్యజగాలన్
మోక్షదాయక! ముచ్చట గొల్పన్
శిక్ష చేయగ శీఘ్రము రావా.  2.

కాలకంఠుడ! కాంక్షలు దీర్చన్
ఫాలలోచన! భాగ్యము లీయన్
శూలపాణిగ శోభన మొప్పన్
నేలపైకిక నిత్యము రావా.  3.

నాగభూషణ! నాకికపైనన్
యోగశక్తిని యోగ్యతనిమ్మా,
భోగదాయక! భూజనులందున్
వేగమీయవె విజ్ఞత నీవున్.   4.

మధ్యాక్కర -  26.05.2012
2 ఇం+1సూ+2ఇం+1సూ 
(4 వగణం మొదటి అక్షరం యతి, ప్రాసనియమం ఉంటుంది) 
 త్రిమూర్తి స్తుతి

కరుణాత్మకుండంచు ఘనత గాంచెను రామచంద్రుండు
ధరనేలె ప్రజను సంతతిగ దలచుచు తండ్రియై తాను
నరులకాదర్శమై వెలుగు నవ్యమార్గములను జూపె
సురపూజితుం డా ప్రభునకు సుందరాంగున కివె నతులు.

కన్నులున్నవి మూడు కాలకంఠుడు తానింక ఘనుడు
మిన్నేరు జటలలోనుంచె, మెడను పాములు జుట్టె వినుడు
అన్నులమిన్నయౌ గౌరి కర్థదేహము నిచ్చె కనుడు
సన్నుతులొనరించి నరులు! సౌభాగ్యవంతులై మనుడు.

నాలుగు మోముల సామి, నానావిధంబుగా జంతు
జాలము సృష్టించు చుండు, చదువుల తల్లిని సర్వ
కాలము దాల్చెడి విభుడు, కామితార్థదు డింక లోక
పాలకుడౌ బ్రహ్మ కొరకు ప్రణతు లర్పించగా వలయు. 

ఇంద్రవజ్ర ( 28.05.2012)
త, త, జ, గగ - ఎనిమిదవ అక్షరంతో  యతిమైత్రి 
 రామస్తుతి

శ్రీరామ! రామా! యని చిత్తమందున్ 
ధీరాత్ముడౌ రాముని దేవదేవున్
నీరేజతుల్యాక్షుని నీలవర్ణున్
ధారాధరాభాంగుని దల్తు నెందున్.


శ్రీజానకీ సుందర చిత్తచోరా!
రాజేంద్ర! దైత్యాంతక! రాఘవేంద్రా!
జేజేల నర్పించెద శీఘ్ర మింకన్
రాజెల్లు రక్షింపగ రామచంద్రా!

నీవే జగత్త్రాతవు, నీవె మాకున్
భావింప సర్వంబయి భక్తకోటిన్
శ్రీవైభవంబిచ్చి విశిష్టశక్తిన్
కావంగ రమ్మింక సుఖంబు లీయన్.


మాతండ్రివై మాతవు భ్రాతవౌచున్
సీతాపతీ! రావలె చిత్స్వరూపా!
చేతంబు శుద్ధమ్ముగ జేసి మాకున్
నీతిం బ్రసాదించుచు నిల్చి కావన్.

రామా! శుభాంగా! రణరంగభీమా!
స్వామీ! జగత్పాలకచక్రవర్తీ!
నామార్చనం బెప్పుడు నమ్మి నీకున్
నీమంబునం జేసెద నిష్ఠతోడన్.

ఉపేంద్రవజ్ర ( 29.05.12)
జ,త,జ,గగ (ఎనిమిదవ అక్షరం-యతి)
గణేశస్తుతి 
ముదాకరుండాతడు మోదకంబుల్
సదా నివేదించుచు శంక లేకన్
పదద్వయిం దాకుచు వక్రతుండున్
ముదంబునం గొల్తును మోక్షకాంక్షన్.


చతుర్థినాడెంతయు శ్రద్ధతోడన్
మతిన్ బ్రసాదించు నుమాకుమారున్
నితాంతభక్తిన్ గరుణించ మంచున్
శ్రితార్థికామప్రదుఁ జేరి గొల్తున్.

మహోరువిఘ్నంబులు మాయమౌ నా
మహేశపుత్రున్ మహిమప్రయుక్తున్
మహోదరున్ సుందరమంగళాంగున్
సహాయ మర్థించుచు సన్నుతించన్.


సమస్తకార్యంబులు సాగుచుండున్
శమించి విఘ్నంబులు సవ్యరీతిన్
ప్రమాదముల్ గల్గవు భాగ్యమబ్బున్
ప్రమోదముం గూడును భక్తకోటిన్.

గణేశ! లంబోదర! కామ్యదాతా!
ప్రణామ మోదేవ! శుభస్వరూపా!
క్షణంబునం గూల్చుచు గర్వరాశిన్
గుణాన్వితుం జేయుము కూర్మితోడన్. 

ఉపజాతి ( 30-5-2012)
ఇంద్రవజ్ర+ఉపేంద్రవజ్ర = తతజగగ+జతజగగ 
స్వాతంత్రోద్యమం

స్వారాజ్యముం గోరుచు శాంతమూర్తుల్
భరించి కష్టంబులు భవ్యరీతిన్
నిరంతరాత్యద్భుత నిష్ఠతోడన్
వారెందరో పోరిరి వందనీయుల్  1.


పరాధినేతృత్వపు పాపకృత్యా
లరాజకత్వంబు లనాదరంబుల్
దురాగతంబుల్ బహుదుష్టబుద్ధుల్
పోరాడి వారింపగ బూని రంతన్.  2.

శ్రీగాంధి యన్నింటను శ్రేష్ఠుడౌచున్
మృగాకృతిం దాల్చిన మ్లేచ్ఛకోటిన్
భగీరథుండాతడు పారద్రోలెన్
భోగంబు లందించెను పుణ్యభూమిన్.  3.

ఇంద్ర వంశ వృత్తము ( 31.05.2012)
త,త,జ,ర (ఎనిమిదవ అక్షరంతో యతి)
అయ్యప్పదీక్ష
అయ్యప్పదీక్షల్ పరమాద్భుతంబుగా
నెయ్యంబునుం జూపుచు నిర్మలాత్ములై
శయ్యాది సౌఖ్యంబులు సంస్మరించ కే
కయ్యంబులం బూనక కర్మనిష్ఠులై   1.

అత్యంత భక్తిన్ పరమాత్ము దల్చుచున్
సత్యంబునుం బల్కుచు సాధుశీలురై
నిత్యంబు పూజాదులు నిర్వహించగా
నత్యాదరంబుల్ ధర నందుచుండెడున్.   2.

సంతోషముల్ గల్గును, సర్వపాపముల్
సాంతంబుగా నాశమునంది, కీర్తులున్
సొంతంబులై గూడును శోభలందెడున్
చెంతన్ మహైశ్వర్యము చేరుచుండెడున్.    3.

వంశస్థ వృత్తము ( 01.06.2012)
జ,త,జ,ర (ఎనిమిదవ అక్షరంతో యతి)
పరోపకారం
పరోపకారంబున భాగ్యసంతతుల్
చిరాయురారోగ్యపు సిద్ధులెల్లెడన్
మరిన్ని సౌఖ్యంబులు మాన్యదీప్తులున్
నిరంతరం బందుట నిక్కమీ భువిన్.   1.
జలంబులం గూర్చును సర్వదా నదుల్
ఫలంబులందించును భవ్య వృక్షముల్
చలించకన్ గోవులు సాధు దుగ్ధముల్
నిలింపులై యిచ్చును నిత్యమీ భువిన్.   2.
శరీరమందించుట శక్తియుక్తులన్
పరాత్పరుం డా భగవాను డిచ్చుటల్
పరోపకారార్థమె, స్వార్థదూరులై
కరంబు దీనార్తులఁ గావగా వలెన్.    3.

వసంత తిలక ( 02.06.2012)
త,భ,జ,జ,గగ -  8/11వ అక్షరం యతిస్థానం 
9 వ అక్షరం యతి పాటిస్తే "మదనరేఖ" అవుతుంది

శ్రీరామచంద్ర! సుగుణాకర! చిద్విలాసా!
కారుణ్యమూర్తి! భవతారక! కంజనేత్రా!
వీరాధివీర! భువనావన! వేదవేద్యా!
ఘోరాఘనాశక! సుఖంబులు గూర్చుమయ్యా!  1.


నీనామసంస్మరణ జేతును నిర్మలాత్మన్
దానాదులున్ స్తవము లెప్పుడు ధర్మబుద్ధిన్
మానంగబోను సుఖదాయక! మంగళాంగా!
రా, నన్ను గావుమినవంశజ! రాఘవేంద్రా!  2.

Friday, 18 May 2012

శ్రీ వైష్ణవీ మాత


శ్రీ వైష్ణవీ మాత
ఛందము - శార్దూలము 

శ్రీమాతా! నిగమస్తుతా! భగవతీ  ! సిద్ధిప్రదా! బుద్ధిదా!(శ్రీచక్రసంచారిణీ!)
శ్రీమత్పావనదివ్యభవ్య చరితా! చిద్రూపిణీ! శ్రీమయీ!
మామా పాపములన్ హరించి మదిలో మాకిన్ని సద్భావముల్
నీమంబుల్ గలిగించి కావుము సదా, నీకంజలుల్ వైష్ణవీ!  1.

శ్రేయంబుల్ గలిగించ "జమ్ము యను కాశ్మీర"ప్రదేశంబునన్
హాయిం గొల్పగ వాసముంటివి గదా, అంబా! జగన్మోహినీ!
నీయందెవ్వడు భక్తిఁజూపి సతమున్ నీనామ సంకీర్తనల్
చేయం బూనునొ వాని కబ్బు నిలలో శ్రీ లెప్పుడున్ వైష్ణవీ!  2.

మాతా! శాంకరి! జ్ఞానశూన్యుడ నికన్ మందుండ నీ కేవిధిన్
చేతంబుల్లసిలంగ గూర్చగలనో శ్రీసూక్తులందంబుగా
రీతుల్ ఛందము రానివాడనుగదా, రేయింబవల్ నిత్యమున్
జోతల్ చేసెద భక్తితోడ కరుణన్ జూపించుమా వైష్ణవీ!   3.

నీచారిత్రము మాధురీభరమహో! నీసత్కథాలాపముల్
వాచాలత్వము ద్రుంచివేసి ఘనతన్ వాగ్వైభవాన్వీతమౌ
వీచీ పంక్తుల నందజేసి క్రమతన్ విజ్ఞాన మందించుచున్
ప్రాచీనత్వము కట్టబెట్టును గదా, వాగీశ్వరీ! వైష్ణవీ!  4.

నీవే సర్వఫలప్రదాత్రివిగదా, నీనుండియే సృష్టులున్
గావింపంబడు, వృద్ధినొందు, లయమౌ కైవల్యసంధాయినీ!
ఆవైకుంఠుడు, సృష్టికర్త, శివుడాహా! నీ పదచ్ఛాయనే
భావింపందగు మార్గదర్శకముగా  భాగ్యప్రదా!  వైష్ణవీ!  5.

జమ్మూప్రాంత సమీపమందు ఘనమౌ సద్గోత్రవర్గంబుపై
అమ్మా! యీశ్వరి! లోకరక్షణకునై యాశ్చర్యముం గొల్పుచున్
సమ్మోదంబున నిల్చినావు జననీ! సన్మార్గముం జూపుచున్
మమ్మెట్లైనను గావగా వలయు నోమాహేశ్వరీ! వైష్ణవీ!  6.

తల్లుల్ దండ్రులు బంధువర్గమనుచున్ తాదాత్మ్యతం జెంది యో
తల్లీ! మానవుడెల్లెడం దిరుగుచున్ దైన్యత్వముం బొందుచున్
కల్లోలంబులఁ జిక్కుచుండె కనుమా, కారుణ్యముం జూపి మా
కెల్లన్ నీపదకంజదర్శనసుఖం బీయం దగున్ వైష్ణవీ!  7.

ధన్యుండై వెలుగొందు వాడు ఘనుడై త్వద్భక్తు డీ సృష్టిలో
నన్యం బొండు తలంచబోక సతతం బార్ద్రాత్ముడై నీకథల్
మాన్యత్వంబున చెప్పుచున్న, వినినన్ మాతా! దయాంభోనిధీ!
దైన్యత్వంబు నశించి సత్వయుతుడౌ  తత్త్వాత్మికా! వైష్ణవీ!  8.

నిన్నున్ నమ్మితి నీపదాబ్జములకున్ నిత్యాభిషేకంబులన్
మన్నింపందగునమ్మ! పూజలెరుగన్, మందుండ నజ్ఞుండనై
యున్నాడన్ కను, నీ సుతుండ నిదిగో, ఓయమ్మ! ధన్యాత్ముగా
నన్నేరీతి యనుగ్రహింపగలవో, నారాయణీ! వైష్ణవీ!  9.

దేవీ! నీ చరణామృతాబ్ధిలహరుల్ తీర్థంబులై దేహమం
దావేశించిన కల్మషంబులను స్వాహాచేసి దివ్యత్వమున్
సేవాభావము గల్గజేసి జనులన్ శ్రీమంతులన్ జేయు, నా
కేవేళన్ భవదీయసంస్తవసుఖం(చరణాంబుసేవనసుఖం) 
                                                  బిప్పించుమా వైష్ణవీ!  10.                    

Wednesday, 16 May 2012

కుచేలుడు

ది.13.05.2012 వ తేదీ 
"శంకరాభరణం" బ్లాగులో పద్యరచన శీర్షికన ఇవ్వబడిన  చిత్రానికి 
వ్రాసిన పద్యవ్యాఖ్య
 
కుచేలుడు
సీ.
అధికసంతతి సాకు విధమెద్దియో కాన
          రాదాయె నింక నో ప్రాణనాథ!
దారిద్ర్యమింటిలో తాండవించుచు నుండె
          క్షుద్బాధ దేహంబుఁ గూల్చుచుండె,
భోజనహీనులై(దూరులై) పుత్రు లల్లాడంగ
          చూడలేకున్నాను సుతుల గతులు
ఏజన్మపాపమో ఈ రీతి వికటించె
          తెలియకున్న దికేమి పలుకుదాన
తే.గీ.
రమ్యగుణశాలి లోకైక రక్షకుండు,
బాల్యమిత్రుండు, సంపూర్ణ భాగ్యదాత,
కృష్ణపరమాత్మ సాక్షాత్తు విష్ణువందు
రతని దర్శించి సాహాయ్య మడుగ దగును.
ఆ.వె.
అనుచు ధర్మపత్ని యారీతి పలుకంగ
తన్మయత్వమంది ధరణిసురుడు
పరమభక్తితోడ భగవాను దర్శించ
ద్వారకాధినాథుఁ జేరినాడు.
సీ.
ప్రాణమిత్రుని రాక పరమహర్షముగూర్చ
          ద్వారంబు కడకేగి గారవించి,
ఆ కుచేలునితోడ యాలింగనంబంది
          సింహాసనాసీను జేసి యపుడు
అతిథి దైవముగాన నర్ఘ్యంబు లర్పించి
          పాదంబు స్పృశియించి పాద్యమిచ్చి
భూసురుల్ చూడంగ భోజనప్రియు లంచు
          పక్వాన్న మందించె బ్రాహ్మణునకు
తే.గీ.
సకలలోకైకనాథుడౌ చక్రి యిట్లు
సత్కరించిన తీరుకు సంతసించి
ప్రణతు లర్పించెనే గాని పత్ని కాంక్ష
చెప్ప నోరాడలేదు కుచేలునకును. 
కం.
సర్వాంతర్యామి గదా,
సర్వేశ్వరుడైన చక్రి సంతోషముతో
నుర్వీసురునకు నొసగెను
సర్వైశ్వర్యంబు లింక సద్వైభవముల్.
మత్తకోకిల
కోరి చేరగ భక్తబృందము కోర్కెలన్నియు దీర్చుచున్
వారి యుల్లము లుల్లసిల్లగ వైభవంబులు గూర్చుచున్
ధీరతన్ గలిగించు చుందువు దివ్యతేజమొసంగుచున్
శౌరి! నీకివె వందనంబులు శార్ఙి! యాగమసన్నుతా!
కం.
కరుణాసాగర! ధీరా!
సరసాత్మక! దీనబంధు! సర్వోద్ధారా!
వరగుణ! యదుకులవీరా!
నిరతము మము గావుమయ్య! నిఖిలాధారా!

Wednesday, 9 May 2012

మోహిని

ది.10.05.2012 వ తేదీ  
"శంకరాభరణం" బ్లాగులో  
"పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి వ్రాసిన 
పద్యవ్యాఖ్య
మోహిని
సీ.
తొల్లి మత్స్యంబౌచు ఎల్లవేదంబులన్
          కాపాడి యున్నట్టి ఘనుడతండు,
సకల సురాసురుల్ సాగరంబున జేరి
          అమృతంబు కాంక్షించి యందులోన
మంథరాద్రిని నిల్పి మహిమాన్వితుండైన
          వాసుకిన్ త్రాడుగా చేసినపుడు
కూర్మరూపంబుతో కోరనచ్చట జేరి
          గిరిని దాల్చిన యట్టి సురవరుండు
తే.గీ.
సిరిని చేపట్టి యలరించు సరసుడగుచు
దానవారులు ప్రార్థింప దయను జూపి
అమృత మందింతు వీక్షింపు డని యటంచు
సౌరులొలికించు నతివగా మారెనపుడు. 
కం.
మోహినియై చూపరులకు 
మోహంబును గల్గజేసి మురహరు డనఘుం
డాహరి యమృతపు భాండం
బాహా! యరచేత బూని యచ్చట నిలిచెన్.
కం.
జేజే మోహనరూపా!
జేజే కమలాయతాక్ష! జేజే శార్ఙీ!
జేజే యసుర నిహంతా!
జేజే భువనైకనాథ! జేజేలు హరీ!
కం.
హరి! నీనామము దలచిన
హరియించును పాపచయము లానందమగున్.
"హరిహరిహరి" యని యందును
కరుణను జూపించి మమ్ము గావు మనంతా!


శ్రీ గురజాడ అప్పారావు

ది. 09.05.2012 వ తేదీ "శంకరాభరణం" బ్లాగులో 
"పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన 
"గురుజాడ అప్పారావుగారి" చిత్రానికి 
వ్రాసిన పద్యవ్యాఖ్య.
శ్రీ గురజాడ.
శా.
శ్రీమంతంబగు తెల్గునేల కిలలో శ్రేయంబు లందించు హే
ధీమన్! శ్రీ గురజాడవంశతిలకా! దివ్యాంశసంభూత! యీ
భూమిన్నిల్చు త్వదీయనిర్మలయశ: పుజంబు సంస్కారరూ
పా! మాన్యా! కొనుమంజలుల్ శతము లప్పారాయ విద్వన్మణీ!
సీ.
దేశాన్ని ప్రేమించు, దీప్తులెల్లెడ చాటు
          జగతిలో శ్రేష్ఠంబు జన్మభూమి,
దేశానికర్థంబు దేశవాసులెగాని
          మట్టికాదనుమాట మదిని నిల్పి
సొంతలాభం బింక కొంతైన మానుచు
          నరుడ! తోడ్పడవోయి పొరుగులకును
అన్నదమ్ముల వోలె యఖిలాంధ్ర జనులార!
          మతభేదములు మాని మసలుకొనుడు
ఆ.వె.
దేశవాసులార! యాశాలతను బూని
కలసి మెలసి యుండు డిలనటంచు
సోదరత్వబోధ లాదరంబుగ జేసె
సకల జగతికి గురజాడ నాడు. 
కం.
కన్యాశుల్కము మాన్పగ
నన్యాయము ద్రుంచఁ బూని యద్భుతకృతులన్
ధన్యుండై యొనరించెను
మాన్యుడు గురజాడ చూడ  మహితాత్ముడిలన్.
కం.
గురజాడకు నరయంగా
సరిసములెవ్వారు లేరు సకలజగాలన్
నిరతము సంఘంబున సం
స్కరణమునన్ మగ్నుడైన ఘనుడాతండున్. 
ఆ.వె.
సార్థకం బొనర్చె సంఘసేవను జన్మ
ధన్యజీవి యతడు ధరణిలోన
స్మరణయోగ్య మింక సకలాంధ్రజగతికి
నా మహానుభావు నామ మెపుడు. 


ముత్యాల సరాలు.

నేడు మిక్కిలి భక్తితో గుర
జాడ కంజలి చేసి నిల్తును
తోడు నీడై సంఘమంతకు
నాడు నిల్చెను తాన్.


స్వార్థభావన విడిచి పెట్టుట
సంఘసేవకు నడుము కట్టుట
నిజముగా గురజాడ కంజలి
సత్యమియ్యదియే.


Monday, 7 May 2012

పిలుపు


ఉ.
భారత భావిపౌరులగు బాలకులార! యనన్య సాధ్యమౌ
కారణజన్మ మీ భరత ఖండమునందు లభించె గావునన్
ధీరత నీ ధరాస్థలిని దీవ్యదనంత సుఖప్రదంబుగా
గూరిచి గావ బూనుడిక కూర్మిని నేటి సభాముఖంబుగన్. 
ఉ. 
వేదచతుష్టయంబులవి విశ్వవిభూతికి కారణంబు లీ
మేదినిలో జనించినవి, మించు యశంబుల గూర్చు శాస్త్రముల్
మోదము నందగా నిచట మున్ను భవంబును బొందియుండె న
య్యాదిమ మౌని వర్గమిక నందిరి జన్మము భారతావనిన్.
ఉ.
వానిది భాగ్యవైభవము, వానిది సార్థక జీవనం బికె
వ్వాని హృదంతరంబిలను భారత మాతృక శాంతి దుగ్ధముల్
పానము చేసి, తన్మయత భారతి విస్ఫుట సాధుగీతికల్
గానముజేసి ధన్యతను గాంచునొ  వాడు మునీంద్ర తుల్యుడౌ.
ఉ.
ఇట్టు(ట్టి) విశిష్టమై వెలుగు నీ భరతావనిలో గనంగ నే
పట్టున జూచినన్ మతము, భాగ్యవిహీనత, దౌష్ట్యవర్ధనల్
బిట్టుగ నుగ్రవాదములు, భిన్నత బెంచెడి ప్రాంత భేదముల్
ముట్టడి జేసి దేశమును ముక్కలు చేయగ బూనె హా విధీ!
ఉ.
రండు ప్రతిజ్ఞ బూనగను రమ్యశుభోదయవేళ నిప్పుడీ
పండిత బృంద సంయుత సభాస్థలి నిర్మలభావపూతమౌ
నిండు మనంబుతో నిలను నిత్య మనోహరజేసి కావగా
మెండుగ బద్ధకంకణత  మీరలు సంతత సత్యసంధులై.
కం.
ఎటు చూచిన మతమౌఢ్యం
బెటు గన్నను స్వార్థపరత యిలలో నేడున్
పటుతర శాంతి సమీరము
కటకట! కరువయ్యె గాదె కాంచుడు మీరల్.
రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా 
విద్యార్థులనుద్బోధిస్తూ వ్రాసిన పద్యములు
26.01.2002
జ.న.వి.వెన్నెలవలస, శ్రీకాకుళం
Sunday, 6 May 2012

సతీ సావిత్రి

ది. 07.05.2012 వ తేదీ "శంకరాభరణం" బ్లాగులో 
పద్యరచన శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి 
వ్రాసిన పద్యవ్యాఖ్య.
సతీసావిత్రి
సీ.
జనకున కలనాడు జగదంబ గూర్చిన
          వరదాన మహిమచే భవమునొంది,
ఆటపాటలతోడ అలరించి మురిపించి
          అన్నింట సంతసం బందజేసి
భర్తగా దలచిన వాని కాయువు జూడ
          చిరము గాదనుపల్కు లెరిగి యుండి
పరిణయం బాడి యా పతిసేవ జేయుటే
          వ్రతముగా బూనిన పరమ సాధ్వి
తే.గీ.
అపుడు సద్భక్తి జూపించి యముని నుండి
పతికి పూర్ణాయువును బొంది సుతుల గాంచి
మహి నతివలకు మేటియై బహుళయశము
బడయు సావిత్రి నీకివె ప్రణతులమ్మ!
చం.
వరమహిళాశిరోమణికి, భర్తకు నెల్లెడ తోడునీడయై
ధరపయి మృత్యుదేవతకు తన్మయతన్ గలిగించి, స్వామికిన్
సురుచిరమైన జీవనము చూపిన సాధ్వికి, దివ్యశక్తికిన్
పరమపతివ్రతాసతికి(మణికి) భక్తినొనర్తు ప్రణామముల్ మదిన్

Saturday, 5 May 2012

తిరుపతి వేంకట కవులు

ది. 06.05.2012 వ తేదీ  
"శంకరాభరణం" బ్లాగులో ఇవ్వబడిన 
"తిరుపతి వేంకట కవుల" చిత్రానికి 
వ్రాసిన పద్య వ్యాఖ్య.
కం.
శ్రీమత్తిరుపతి వేంకట
నామాఢ్యుల కాకవిత్వ నైష్ఠికుల కికన్
ధీమతులకు జేయుదము ప్ర
ణామము కవిమిత్రులార! నమ్రత తోడన్. 
కం.
తిరుపతి వేంకట కవులకు
నిరతము సాహిత్యసేవ నెరపుచు ఘనులై
దిరిగిన కవియుగ్మంబున
కరుసంబుగ జేతు నుతుల ననవరతంబున్. 
కం.
ఏనుగు లెక్కిరి మరి స
న్మానములకు లెక్కలేదు మహిలో మాన్య
శ్రీనిధులై యలరుచు నవ
ధానము లొనరించునట్టి ధన్యులకు నతుల్. 
కం.
భాషాద్వయమున మేమే
భాషించగ ఘనులమింక బహురీతులలో
రోషంబున్నను రండిక
వేషంబులకేల? యనెడు విజ్ఞులకు నతుల్. 
కం.
శతసంఖ్యను కావ్యంబుల
నతిదక్షతతోడ బలుకు ననఘాత్ములకున్
జతగా నుండెడు వీరికి
స్తుతిశతములు చేయవలయు సురుచిరభక్తిన్.

Wednesday, 2 May 2012

శ్రీ కందుకూరి వీరేశలింగము

"శ్రీ కం దు కూరి వీ రే శ లిం గ ము"
నామాక్షర పద్యమాలిక
("శంకరాభరణం" బ్లాగులో ది. 02.05.2012 తేదీ
 "పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన వీరేశలింగం గారి చిత్రానికి వ్రాసిన 
పద్యవ్యాఖ్య.
ఛందము - కందము.

శ్రీకరుడై సంఘంబున
  మూకలుగా నిండియున్న మూఢాచారా
  లేకాగ్ర చిత్తధరుడయి
  పోకార్చిన ఘనుడు తాను పుణ్యాత్ము డికన్. 

కంటకతుల్యములై పలు
  తంటాలను తెచ్చుచుండి ధరణీతలమం
  దంటిన బాల్యవివాహా
  లింటింటికి చేయు కీడు నీతడు తెల్పెన్(మాన్పెన్.)

దురితంబుల నెల్లెడలం
  బరిహారము చేయుచుండి, పడతుల కిలలో
  సురుచిర జీవనమునకై
  నిరతము శ్రమియించినట్టి నిర్మలు డతడున్. 

కూరిమి తనువున నిండిన 
  ధీరుడు వీరేశలింగ ధీశాలి (యికన్) యహో
  కారణజన్ముం డాతడు
  వేరెవ్వరు సాటి లేరు విశ్వము నందున్. 

వీరను వారను భేదం
  బారయు నజ్ఞానిజనుల కనవరతంబున్
  కోరుచు నుద్బోధించెను
  మీరిట్టులు చేయ దగదు, మీరకుడనుచున్. 

రేలుంబవ లనునిత్యం
  బాలోచన చేసి స్త్రీల కద్భుతరీతిన్
  మేలొనరించెడి విద్యా
  శాలలు స్థాపింప జేయు సజ్జను డతడున్. 

తవిధముల యత్నించిన
  గతిలేని వితంతులైన కర్మఠుల కిలన్
  హితకారిణి యను సంస్థను
  వెతలం ద్రుంచంగ నిల్పు విజ్ఞుం డతడే. 

లింగాకారుని దలచిన
  కంగారై తొలగిపోవు కల్మష మట్లున్
  వంగడములు సుఖదములౌ
  నంగీకృతులౌచు వీరి యనుసరణమునన్. 

ద్యంబున తిక్కనయై
  పద్యంబున ప్రోడ యగుచు బహుకావ్యంబుల్
  హృద్యంబుగ రచియించిన
  విద్యావంతునకు జేతు వినయాంజలులన్. 

మునులను మించిన వాడత
  డనవరతము సంఘసేవ కంకిత మగుచున్
  తనువుకు ధన్యత గూర్చిన
  ఘనచరితుడు కందుకూరి కవిసత్తముడున్. 
హ.వేం.స.నా.మూర్తి.


Tuesday, 1 May 2012

సర్పయాగం

 ది. 29.04.2012 వ తేదీ "శంకరాభరణం" బ్లాగులో పద్యరచన శీర్షికన  ఇవ్వబడిన చిత్రానికి వ్రాసిన పద్యవ్యాఖ్య. 
సర్ప యాగం
ఛందము - ఆటవెలది.

తక్షకాహి విషపు దావానలంబున
జనకుడంతమౌట వినిన మీద
మునుపు చేయు చుండె జనమేజయాఖ్యుండు
సర్పయాగ మచట నేర్పు మీర.

సర్పకులములన్ని సత్వంబు నశియించి
మహితమైన మంత్ర మహిమవలన
ఒకటి రెండు గాదు, సకలాహిసంఘాలు
వరుసగట్టి యజ్ఞవాటి కపుడు

చేరి పడుచు నుండె నేరుగా హోమాగ్ని
గోరినట్లు వాటి తీరు గనుడు 
తక్షకుండు తాను ధైర్యంబు గోల్పోయి
నాకలోకమందు నక్కియుండె. 

సిద్ధ మచట మఘవు సింహాసనంబును
చుట్టి చేరి యుండె, చోద్య మపుడు
యాగశాలలోని యాజ్ఞికవరు లంత
"ఇంద్రయుతుడ! వ్యాళ మిలకు రమ్ము".

అనుచు బల్కి వార లాహుతు లీయంగ
చిత్రమేమొ గాని సేంద్రు డగుచు
తక్షకుడను పాము ధరణికి నేతెంచి
యాగ వహ్నిలోన వేగ మపుడు,

పడుచు నుండ బోవ పరమ దయాళుండు
ఘోర మాపదలచి  చేరి నిలిచి
స్వస్తివచనశీలి యాస్తీకు డదిగని
దయను జూపు మనియె ధరణిపతికి.

సాధువర్తనుండు జనమేజయుండంత
శాంతమూర్తి యగుచు శ్రద్ధ తోడ
ప్రణతులొసగి యాగ పరిసమాప్తిని జేసె
జగములన్ని మిగుల సంతసించ.