Monday, 30 April 2012

కవి సామ్రాట్ విశ్వనాథ

 
 కవి సామ్రాట్ విశ్వనాథ
కం.
శ్రీ"విశ్వనాథ" గురునకు
ధీవరునకు, "శోభనాద్రి"ధీనిధి కిలలో
సేవాతత్పరయై స
ద్భావముగల "పార్వతమ్మ"పట్టికి ప్రణతుల్. 
 సీ.
వరలలాటమునందు భస్మరేఖలుదాల్చి
          యటపైన కుంకుమం బలదినాడు,
హరితవర్ణంబులో నతి సుందరంబౌచు
          ఒప్పారు శాలువా గప్పినాడు,
బ్రహ్మతేజస్సుతో రాజిల్లు వదనాన
          దరహాస మొకయింత దాల్చినాడు,
సంస్కృతాంధ్రములందు సామర్థ్యభావంబు
          నేత్రద్వయంబులో నింపినాడు
తే.గీ.
ఆంధ్రదేశాన శిష్యుల కనుపమగతి
పాండితీ భిక్షనొసగిన పరమగురుడు
లోపమే లేని భారతీ రూపమతడు
విశ్వనాథకు దండాలు వేలవేలు.

సీ.
"బహుకావ్యకర్త"గా భవ్యకీర్తులు గాంచి
          "గజము నెక్కితి"వింక క్రమముగాను,
"జ్ఞానపీఠం"బంది మానితంబుగనాడు
          "వేయిపడగల"తో వినుతి కెక్కి,
"కళల ప్రపూర్ణు"డన్ ఘనతను సాధించి
          "కవుల సామ్రాట్టు"గా గణుతి బొంది,
"ఆంధ్రదేశంబున కాస్థాన కవి"గా న
          సంఖ్యాకమౌ "పురస్కారముల"ను
మిక్కుటంబుగ గొనినావు నిక్కమవుర!
"సత్యనారాయణార్య"! హే సచ్చరిత్ర!
విశ్వవిఖ్యాత కవివరా! విబుధవినుత!
"పద్మభూషణ"! నీకిదె వందనంబు
 సీ.
"ఏకవీరా"దులౌ యెన్నెన్నొ నవలలన్
          "వేయిపడగ"లన్ని విశదపరచి,
"కాశ్మీర నేపాళ ఘనరాజ చరితంబు"
          "లాంధ్రపౌరుష మాంధ్ర యశము" దెల్పి,
రమ్యమై వెలుగొందు "రామాయణాఖ్యం"పు
          "కల్పవృక్షము" నాటి ఘనతగాంచి,
"కిన్నెరసాని"కై   యన్నెన్నొ "పాటలు"
          పాడించి యన్నింట ప్రౌఢుడగుచు
అల్లసాని వారి యల్లిక జిగిబిగి,
నన్నయార్యు గుణము లెన్నొ గలవు
శిష్యులార! యనుచు చెప్పిచూపిన యట్టి
విశ్వనాథగురుడు, విజ్ఞవరుడు.Sunday, 22 April 2012

హర్యానా - కురుక్షేత్ర దర్శనం.

హర్యానా - కురుక్షేత్ర దర్శనం
కం.
శ్రీలకు నిలయం బైనది
పాలున్ పెరుగులకు తావు, బహుయశములకున్
శీలతకున్, సద్గుణముల
కాలంబనమైన దౌర! హరియాణము తాన్.
కం.
హరి, యానము చేయుటచే
"హరియాన"మటన్న నామ మందురు విబుధుల్
ధర నీ "హరియాణం"బిక
సురుచిర సంస్కృతికి తావు సుందరము గదా!
శా.
హర్యాణము దివ్యభూమి కనగా నిచ్చోటనే మాధవుం
డోహో పాండవపక్షమంది, యవివేకోన్మాద రోగార్తులై
మోహావేశితులైన కౌరవుల నున్మూలించగా క్రీడికిన్
సాహాయ్యం బొనరింప బూని నిలిచెన్ సద్ధర్మరక్షార్థమై.
ఉ.
వాహినితోడ వచ్చి, తనవారిని జూచి విరక్తుడై మహా
ద్రోహ మటంచు పోరుటకు రోసిన ఫల్గును జేరదీసి తా
నాహరి దివ్యవాక్యముల నప్పుడు గీతను బోధ చేయగా
నాహవరంగమందు తెగటార్చెను క్రీడి విరోధివర్గమున్.
తే.గీ.
సవ్యసాచిని చేకొని శార్ఙి యపుడు
దుష్టశిక్షణ గావించి దురిత మణచి
ధర్మరక్షణ చేసిన కర్మభూమి
సిద్ధ మలనాటి యాకురుక్షేత్ర మదిగొ.
సీ.
ఆకురుక్షేత్రమే అత్యద్భుతంబౌచు
          దర్శనార్థుల కెల్ల తనివి దీర్చు,
ఆకురుక్షేత్రమే అమితసౌఖ్యద మౌచు
          స్థిరనివాసుల కెల్ల సిరులు బంచు,
ఆకురుక్షేత్రమే చీకాకులను ద్రుంచి
          చేరువారల కిందు సేదదీర్చు,
ఆకురుక్షేత్రమే అఘసంఘములబాపి
          దివ్యత గూర్చును దేహములకు
విద్యలకు నిలయంబయి వెలయు నదియె,
అఖిల ధర్మాల కాటపట్టైన దదియె,
సత్యదీప్తికి నిలలోన సాక్ష్యమదియె
మునిజనాదుల కయ్యదె ముక్తిదంబు. 
కం. 
కలుషంబులు హరియించెడి
విలసన్నైర్మల్యయుక్త విస్తృత జలముల్
కలిగి వెలింగెడు నట శుభ
ఫలదంబు సరోవరంబు "బ్రహ్మా"ఖ్యంబై. 
ఆ.వె. 
స్నాన మాచరించి సానందచిత్తులై
దరిని వెలసియున్న దైవములను
దర్శనంబు చేసి ధన్యత గాంచంగ
వచ్చు నెల్ల వారు వైభవముగ. 
తే.గీ. 
ఆ సరోవర తటమున నందమైన
శిల్పమొక్కటి కన్పించు చిత్రగతుల
శరము సంధించి నిలిచిన నరుని ముందు
కమలనాభుని రథమందు గాంచ వచ్చు. 
కం. 
అచ్చటి "పనోరమా" కడు
ముచ్చటలను గొల్పుచుండు మోదకరంబై
అచ్చెరువు గల్గజేయును 
(ఖ)కచ్చితముగ జూడవలయు క్రమముగ దానిన్. 
సీ.
పనోరమలోన నతిసుందరంబైన
          వస్తుజాలము చూడవలయు నిజము
పరమాద్భుతంబైన భారతయుద్ధంబు
          దర్శించగల మింక దానిలోన,
సమరాంగణం బౌట జలదరించును మేను
          చేరి చూడగ వచ్చు శిల్పమదియ
చిత్రంబు లెన్నియో జీవమున్నట్టులే
          చోద్యమన్పించును చూపరులకు
భీష్ము, నర్జును, నటమీద భీమసేను,
నంత ధర్మజు,  నభిమన్యు నమితశౌర్యు
కర్ణ దుర్యోధనాదులన్ కదనభూమి
నచట గాంచగ వచ్చునత్యద్భుతముగ. 
తే.గీ. 
గుడులు నుద్యానవనములు బడులతీరు
వరకురుక్షేత్రనగరాన నరయదగును
ధరను మోక్షదమైన తత్పురికి మిగుల
ఖ్యాతిదంబౌచు నిలిచెను "జ్యోతిసరము."
కం. 
అందే కృష్ణుడు క్రీడికి
సుందరముగ బోధ చేసె శోకమడం(ణ)చన్
సందేహమేల? కనుడా
మందిరమే సాక్షియగుచు మైమరపించున్. 
తే.గీ.
సర్వభారకుడై యొప్పు చక్రి యపుడు
జగములకు సవ్యమార్గదర్శనము చేయు
పరమపావన మైనట్టి భవ్యగీత
బోధ చేసిన యాదివ్య భూమి యదియె.
హ.వేం. స. నా. మూర్తి.
22.04.2012Thursday, 19 April 2012

ఈశ్వరేచ్ఛ

ది.17.04.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో 
"పద్యరచన"  శీర్షికన ఇవ్వబడిన చిత్రాన్ని దృష్టియందుంచుకొని
వ్రాసిన ఖండిక
ఈశ్వరేచ్ఛ
చం.
ఇనకుల సంభవుండు మృగయేచ్ఛను బూని సరిత్తటీస్థలిన్
ఘనవనభూమి కేగి, నిశ గ(గ్ర)మ్మినవేళ నొకానొకండు ని
స్వనమది సోక వీనులకు సామజమంచు దలంచి శబ్దభే
దిని ఘనుడౌట వేసెనొక తీక్ష్ణశరం బపుడా దిశన్ వడిన్. 

తే.గీ.
ఆర్తనాదంబు విన్పింప నచటికేగి
దశరథాధిపు డచ్చట దారుణమగు
బాణహతిచేత మిక్కిలి బాధ జెందు
నేల కొరిగిన సన్ముని బాలు గాంచె. 

కం.
ఆతడె శ్రవణకుమారుడు
సాతురుడై జలముగోరి సరయూనదికిన్
మాతాపితరులు పంపగ
నేతెంచి శరాగ్నిగూలె నీశ్వర మాయన్. 

కం. 
తను జేసిన దుష్కృత్యము
మనమును గుందంగజేయ మాటలడం(ణం)గన్
మునిబాలకు దుర్దశగని
ఘనతాపము జెంది నిలిచె క్షత్రియుడంతన్. 

కం. 
అంధులు జననీజనకులు
బంధువులా లేరు, నన్ను బాలుని శరమున్
సంధించి కూల్చి వారిని
బంధించితి వౌర! నీవు బాధలలోనన్. 

తే.గీ.
అనుచు వచియించు శ్రవణున కనియె రాజు
వినుము గజమంచు బాణము వేసినాడ,
ననఘ! నీయున్కి నేనిందు గనగ లేక
ఇట్టి పాపాని కేనొడి గట్టినాడ. 

తే.గీ.
కట్టి కుడుపును నాకింక చుట్టుకొనును
బ్రహ్మ హత్యాఖ్య మైనట్టి పాతకంబు
మునికుమారక! నీవారి ముందు కరిగి
విషయమును జెప్పి సర్వంబు విశద బరతు. 

కం. 
అని పలికిన దశరథునకు
ననఘుం డా మునికుమారు డనెనీ రీతిన్
కనగలవు నాదు జనకుల
వనభూమిని  కుటిని నీవు  వారతి వృద్ధుల్.


ఆ.వె.
అచటి కేగి వారి కాసాంతమును దెల్పి
యంజలించి యభయ మడుగ గలవు
దాహబాధతోడ తప్తులై యున్నార
లింక నీదు భాగ్య మెట్లు గలదొ. 


తే.గీ. 
బ్రహ్మహత్యాఘ మంటదు, బ్రాహ్మణుడను
గాను నేనింక వైశ్యుని మేనినుండి
యువిద శూద్రకు జన్మించి యుంటిగాన
చింత వలదింక మనమున సుంత యేని.


తే.గీ.
అనగ నాముని బాలుని తనువునందు
దిగిన బాణంబు నారాజు దీసి వేయ
కనులు మూసెను శ్రవణుడు కనగ నపుడు
చిత్తరువు వోలె నృపునకు చేష్టలుడిగె.Monday, 16 April 2012

చిత్రవ్యాఖ్య-పద్యరచన

ది.16.04.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో ఇవ్వబడిన చిత్రమునకు వ్రాసిన పద్యవ్యాఖ్య
రావణాసురుడంత రౌద్రరూపము దాల్చి
          వానరవీరులన్ వరుసతోడ
చెలరేగి గూల్చగా శ్రీరాముడాతని
          సంహరించగ వేగ సాగుచుండ
గరుడవాహనుడట్లు ఘనఘనాఘనతుల్య!
          భుజముపై గూర్చుండి పోరుమనుచు
హనుమ కోరినయట్టు లావీరు మూపెక్కి
          శరశరాసనమంది యరిని జూచి
త్రిపురసంహారి సాక్షాత్కరించినట్లు
క్రమము దప్పక దశకంఠు గదలనీక
సురలు బారులుదీరి ఖేచరులు జూడ
బాణవర్షంబు గురిపించె బహుళగతుల. 


ది. 17.04.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో ఇవ్వబడిన చిత్రమునకు వ్రాసిన పద్యవ్యాఖ్య

శరము చెలరేగి శ్రవణుని సంహరింప
శబ్దభేదియె రాజుకు శాపమయ్యె,
దశరథుండంత దు:ఖాగ్నితప్తుడగుచు
వాని జేరెను జీవచ్ఛవంబువోలె. 

ది. 18.04.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో ఇవ్వబడిన చిత్రమునకు వ్రాసిన పద్యవ్యాఖ్య 

పాపము చేసినావయిన భానుజ! దాశరథీశరాహతిన్
దీపిలె నీదుదేహమిక, దివ్యత చేకురు శాశ్వతంబుగా
నా పరమాత్ము డీగలుగు నంతట సద్గతు లంత మోక్షమున్
జూపునటంచు వాలికట సోదరుడున్ సతి చేసి రంజలుల్.
   
ది. 24.04.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో ఇవ్వబడిన చిత్రమునకు వ్రాసిన పద్య వ్యాఖ్య 
 
సీ.
ఒకచేత నసిబట్టి సకలారి సంఘాల
          నధిక తేజంబుతో నణచినావు,
ఒకచేత ఘంటంబు(లేఖిని) ఒప్పుగా ధరియించి
          కవివరేణ్యుల మించి ఘనత గాంచి,
ఆముక్తమాల్యదాద్యనుపమకృతులను
          బహు సమర్థతతోడ బలికినావు,
అష్టదిగ్గజములం చలరారు కవులతో
          సాహితీ సభలెన్నొ జరిపినావు
తే.గీ.
"దేశభాషల జూడంగ తెలుగు లెస్స"
యనెడు సూక్తికి సార్థక్యమందజేయు
"సాహితీ సమరాంగణ సార్వభౌమ!
విష్ణుసన్నిభ! నరసింహ కృష్ణరాయ!".


ది. 26.04.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో ఇవ్వబడిన చిత్రమునకు వ్రాసిన పద్య వ్యాఖ్య
చం. 
సురుచిరమై కనుంగవకు సుందరమౌ ఘనమేఘపంక్తియున్
హరిత మనోహరాకృతుల నద్భుతరీతి వెలుంగు వృక్షముల్
సరముల నిండియున్నవిక స్వాదుజలంబులశేష(తీవ)
మాధురీభరితములౌచు చూచుటయె భాగ్యమనందగు దృశ్యరాజమున్.ది. 26.04.2012 వ తేదీ   శ్రీ శంకరజయన్తి సందర్భంగా శంకరాచార్యుల వారి నుద్దేశిస్తూ శ్రీనేమాని వారి స్ఫూర్తితో
కం. 
శంకాలేశము లేదిక
శంకరులే పరమగురులు సాక్షాచ్ఛివులౌ(శంకరూపుల్)
సంకటహరణ సమర్థుల
కంకితభావంబుతోడ నర్పింతు నుతుల్. 


ది. 27.04.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో ఇవ్వబడిన చిత్రమునకు వ్రాసిన పద్య వ్యాఖ్య
మ.
ఘనుడాదిత్యుడు, పంచభూతములు సాక్ష్యంబౌచు వీక్షించగా
విను సత్యంబిది దాశరాజ! పలుకుల్ వేయేల? "యుద్వాహమున్
మనమందైనను దల్పబోను", కనుకన్ మాన్యన్, సుతారత్నమున్
నను గన్నట్టి మహాత్ముకిమ్ము దయతో నామాటలాలింపుమా!

(మూడు, నాలుగు పాదాలలో చిన్న సవరణతో)
మ.
ఘనుడాదిత్యుడు, పంచభూతములు సాక్ష్యంబౌచు వీక్షించగా
విను సత్యంబిది దాశరాజ! పలుకుల్ వేయేల? "యుద్వాహమం
చనబోనెప్పుడు, దాల్చబోను మదిలో", నార్యన్, సుతారత్నమున్
ననుగన్నట్టి మహానుభావునకు సన్మానంబుగా గూర్చుమా. 
ఆ.వె.
మాట దప్పబోను, మార్తాండ హిమకరుల్
గతులు దప్పవచ్చు గాని యనుచు
స్థిరత బూని నిల్చి దేవవ్రతుడు తాను
ప్రతిన బూనె నంత భళి యనంగ.

 
ది. 28.04.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో ఇవ్వబడిన చిత్రమునకు వ్రాసిన పద్య వ్యాఖ్య
మ. 
క్రూరాత్మా! విను నీకు మూడె(సుఖమందబోవు) క్షితిజన్,             
                                                గొంపోవుచున్నాడవా?
యీ రామామణి లోకమాత, నిలుమా యీరీతి నీధామమున్
చేరంబోగలవా యటంచు మిగులన్ చింతించి వేగంబుగా
వారింపన్ ధృతిబూని దాకె నపుడున్ వానిన్ జటాయుండికన్.
 మ.
దశకంఠుండను, దానవుండ, ఘనుడన్ ధైర్యప్రతాపంబులన్
దిశలెల్లం బరికించి చూచిన నికన్ దీటెవ్వరున్నారు? నీ 
వశమా, నన్నడగించుటంచు కినుకన్ వైచెన్ విహంగాగ్రణిన్
నిశిసంచారుడు నిర్జరారి యసితో నిందాప్రసంగంబులన్. 

ది. 29.04.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో ఇవ్వబడిన చిత్రమునకు వ్రాసిన పద్య వ్యాఖ్య
తక్షకాహి విషపు దావానలంబున
జనకుడంతమౌట వినన మీద
మునుపు చేయుచుండె జనమేజయాఖ్యుండు
సర్పయాగ మచట నేర్పుమీర.

సర్పకులములన్ని సత్వంబు నశియించి
మహితమైన మంత్ర మహిమ వలన
ఒకటి రెండు గాదు  సకలాహిసంఘాలు
వరుసగట్టి యజ్ఞవాటి కపుడు.

చేరి పడుచునుండె నేరుగా హోమాగ్ని
గోరినట్లు వాటి తీరు గనుడు
తక్షకుండు తాను ధైర్యంబు గోల్పోయి
నాకలోక మందు నక్కి యుండె.

సిద్ధ మచట మఘవు సింహాసనంబును
చుట్టి దాగి యుండె, చోద్య మపుడు
యాగశాలలోని యాజ్ఞికవరులంత
"ఇంద్రయుతుడ! వ్యాళ మిలకు రమ్ము".

అనుచు బల్కి వార లాహుతులీయంగ
చిత్రమేమొ గాని సేంద్రుడగుచు
తక్షకుడను పాము ధరణికి నేతెంచి
యాగ వహ్ని లోన వేగ మపుడు.

పడుచు నుండ బోవ పరమదయాళుండు
ఘోర మాప దలచి చేరి నిలిచి
స్వస్తివచనశీలి యాస్తీకు డదిగని
దయను జూపు మనియె ధరణి పతికి. 

సాధువర్తనుండు జనమేజయుండంత
శాంతమూర్తియగుచు శ్రద్ధతోడ
ప్రణతులొసగి యాగ పరిసమాప్తిని జేసె
జగములన్ని మిగుల సంతసించ.  

ది. 01.05.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో ఇవ్వబడిన చిత్రమునకు వ్రాసిన పద్య వ్యాఖ్య
తనయను గాంచుమో యనఘ! తాపససత్తమ! నాకమేగెదన్
మనమలరంగ బెంచుమిక మత్తనుజాతను గాధినందనా!
యని వచియించు మేనకకు నా మునివర్యుడికేమి పల్కకే
తనగతి నేగినాడు భవితవ్యము దేవుని కప్పగించుచున్.  

ది. 11.05.2012 వ తేదీ  
శంకరాభరణం బ్లాగులో ఇవ్వబడిన చిత్రమునకు 
వ్రాసిన పద్య వ్యాఖ్య  
ఆర్యా!
నమస్కారములు, చిత్రంలో ఇద్దరు మహానటులు కనిపిస్తున్నారు.

ఒకరు రంగారావు, మరొకరు రామారావు.
సీ.
అత్యద్భుతంబైన హావభావముతోడ
          పాత్రానుగుణ్యమౌ భాషతోడ,
నటనలో లీనమై నవరసభావాల
          ననయంబు చూపించు ఘనులు వారు,
అభినయోచితమైన ఆహార్యమును దాల్చి
          పాత్రలో జీవించి భవ్యమైన
యశమును సాధించి యఖిలాంధ్ర హృదయాల
          నుఱ్ఱూతలూగించి యున్నవారు
తే.గీ.
రంగరాయుండు, తారక రామరావు
నటుల నుత్తములే కాదు, నవ్యగతులు
నేర్పియుండిరి జగతికి నిష్ఠతోడ
వారి కొసగెద నింక జోహారు లిపుడు. 

ఇక చిత్రంలో ప్రధానంగా కనిపిస్తున్న ఘటోత్కచుడు:
ఉ.
మేటివిరా! భళీ! యపుడు మేలొనరించగబూని యా జగ
న్నాటక సూత్రధారి యదునందను డంప, సుయోధనాదు లా
రాటము చెందుచుండ మధురంబగు రూపము దాల్చి యందు నీ
పాటవ మంత జూపుచు శుభప్రదుడైతివిగా ఘటోత్కచా! ది. 12.05.2012 వ తేదీ  
శంకరాభరణం బ్లాగులో ఇవ్వబడిన చిత్రమునకు 
వ్రాసిన పద్య వ్యాఖ్య  

సీ.
గౌతమార్యుని పత్ని యీతన్వి శ్రీరామ!
          జంభారి కల్మషచర్యవలన
భర్తృశాపమునంది పాషాణరూపాన
          జవసత్వములు పోయి చట్టుబడియె
నీపాదధూళిచే నిజరూపమును దాల్చి
          యవనతయై యున్న దంజలించి
మగువగా రాతిని మార్చిన నీకీర్తి
          జగతిలో వెలుగొందు శాశ్వతముగ
ఆ.వె.
అను మౌనివర్యు డా యహల్యను జూపి
రామచంద్రు తోడ రమ్యముగను
పలికి, యామె గాంచి కలకంఠి! శుభములు
గలుగుగాత! యనియె గాధి సుతుడు. 
కం. 
శ్యామా! పరమదయాగుణ
ధామా! రఘువంశసోమ! దశరథరామా!
మా మా సన్నుతులందుచు
కామితములు దీర్చి మమ్ము కాపాడుమయా!

ది. 21.06.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో ఇవ్వబడిన చిత్రమునకు వ్రాసిన పద్య వ్యాఖ్య 
 
 
ఓ కలహంసమా! వినుమ, ఒప్పుగ నేడు మహోపకారమున్
నాకు నొనర్చినావుగద, నన్ను సఖీమణిగా మనంబునన్
జేకొని, నాదు సమ్మతిని చేర్చు నరేంద్రుని కిప్పుడే తగన్
నీకొనరింతు వందనము నీవికఁ జూపుము మాకు సంగతిన్.

ఆ రమణీయరూపసుగుణాన్వితు నా యసమానవిక్రమున్
గోరితి నాథుగా నికను కోరిక దీర్చుము, రాజశేఖరున్
చేరగ బంపు మిచ్చటకు శీఘ్రమె, నాకు స్వయంవరంబు తా
కూరిమి నిండ తండ్రియిదె గూర్చును, రాదగు దానికాతడున్. 


ది. 07.07.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో ఇవ్వబడిన చిత్రమునకు వ్రాసిన పద్య వ్యాఖ్య 

ముసిముసి నగవులతో నీ
పసిబిడ్డ వెలుంగు చుండె భాగ్యాంబుధియై
వసుధన్ యశముల నందుచు
వసియించి సుఖించు గాత! వత్సరశతముల్. 

 ది. 08.07.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో ఇవ్వబడిన చిత్రమునకు వ్రాసిన పద్య వ్యాఖ్య
                

తెల్లని మల్లెలఁ జూచిన
నుల్లంబులు సంతసిల్లి యుత్సాహమగున్
చల్లని సద్భావంబది
యెల్లరకును గలుగుచుండు నిమ్మహిలోనన్.


(13.07.2012)
 

తండ్రి రూపమండ్రు తనయుండు జగతిలో
శ్రద్ధబూను చుండి జనకవరుని
గూడి యందమొప్ప కులవిద్యలనునేర్చు
పుత్రు డెల్లవేళ పొందు యశము. 

 (14.07.2012)
నారాయణ! పీతాంబర!
క్షీరోదధి విశ్రమించు చిన్మయరూపా!
ఈరేడు జగములేలెడు
వీరా! మముగావుమయ్య వేవేలనతుల్.
 
(18.07.2012) 
ఈ సింహాన్ని చూస్తుంటే అది ఇలా అంటున్నట్లుగా భావన కలుగుతున్నది.

భూజనులారా! నావలె
నే జంకును లేక మీర లిమ్మహిలోనన్
రాజిల్లుడు సద్యశ మ
వ్యాజానందమును పొంది యనవరతంబున్.


"యత్ర నార్యస్తు పూజ్యన్తే" అను సంస్కృత శ్లోకానికి తెలుగు అనువాదం. 
శ్రీ నేమాని పండితుల వారి స్ఫూర్తితో
బారులు దీరెద రమరులు
నారిని పూజించు చోట,  నానా సుఖముల్
నారిని అవమానించగ
దూరముగా తొలగిపోవు, దు:ఖము గలుగున్. 


ది.12.06.2012  వ తేదీ  
"శంకరాభరణం" బ్లాగులో ప్రచురించ బడిన 
పెద్దనగారి ఉత్పలమాలికను చూచి స్పందిస్తూ 
వ్రాసిన ఉత్పలమాలిక.


ఆతడు పెద్దనార్యుడిక నాంధ్ర కవిత్వపితామహుండునై
శ్రోతలు, పాఠకుల్, కవులు సుందరమంచు వచించునట్లుగా
కైతలు సంస్కృతాంధ్రములఁ గమ్మగఁ జెప్పి కవీంద్రకోటికిన్
రీతులు నేర్పె నా కవివరేణ్యుడు చూడగ కృష్ణదేవరా
ట్చేతము హర్షదీప్తముగఁ జేయ సుశబ్దసుమాల మాలతోఁ
బ్రీతిగ గండపెండెరము పెద్దవటంచు నృపాలు డంతటన్
జోతలు చేసి పాదమున సుస్మితుడై తొడిగెన్, మహాత్ముడా
తాతకు వందనంబులివె ధన్యుడు సార్థకనామధేయుడున్.

 

Sunday, 15 April 2012

శుభాకాంక్షలు

శ్రీయుతులు కంది శంకరయ్యగారి కుమారుని వివాహ సందర్భముగా శుభాకాంక్షలు
(వరుడు చి. క్రాంతి కుమార్, వధువు. చి.ల.సౌ. కల్పన)

శ్రీలు గురిపించి సద్యశశ్శ్రీల నొసగి,
సుందరంబైన సంతతి నందజేసి,
యిందిరాధవుడాశీస్సు లిచ్చుగాత
క్రాంతి కల్పనలకెపుడు ఘనముగాను. 

శంకరాత్మజు డందించు సకలదుడయి
శంకరాత్మజు కన్నింట జయము సిరులు
క్రాంతి కికపైన సుఖము సత్సంతతులను
కల్పనాఖ్యను పత్నిగా గనుట చేత.  

శ్యామలీయం బ్లాగు నిర్వాహకులు శ్రీ శ్యామలరావు గారి షష్ఠిపూర్తి మహోత్సవ సందర్భముగా  అందించిన శుభాకాంక్షలు 
ది. 03.05.2012.

శ్రీమత్పరమేశ్వరుడీ
శ్యామలరాయార్యవర్యుఁ జక్కగ బ్రోచున్
కామిత సుఖముల నిచ్చుచు
భూమిన్ సద్యశము లొసగి పూర్ణాయువుతోన్.

"చి. వెంపటి పాండురంగ తరుణ చంద్ర" 
(శ్రీ వెం. ఆంజనేయులు, శ్రీమతి స్వర్ణ గార్ల పుత్రుడు) 
ఉపనయన సందర్భముగా 
ఆశీస్సులు.
చి. వెంపటి పాండురంగ తరుణచంద్రస్య 
ఉపనయనమహోత్సవం పురస్కృత్య
"శుభాశీ: పద్య కుసుమావలి:" 

శ్రీ వేంకటేశస్సదయార్ద్ర చిత్త:,
సమస్త విద్యా సుగుణ ప్రదశ్చ,
సుధీయుతం వేంకటపాండురంగం
వటుం చ విద్వచ్చతురం కరోతు||
     ఆంజనేయాత్మజం బాలం
     స్వర్ణలక్ష్మ్యాశ్చ సత్సుతమ్,
     తరుణం చన్ద్రనామాఢ్యం
     గాయత్రీ పాతు సర్వదా||
శ్రీరామచన్ద్రశ్శశిశేఖరశ్చ
వాగీశవాణీగిరిజేందిరాద్యా:,
బ్రహ్మోపదిష్టస్య వటో: దిశన్తు
దీర్ఘాయురారోగ్య మనన్త సౌఖ్యమ్||
     పాండురంగ! వటో! ధీమన్!
     వేమ్పట్యన్వయదీపక!
     అనిశం జప, గాయత్రీం 
     విద్యాబుద్ధ్యాది హేతవే||
విద్యావినయసంపత్తి:
యశో విత్తం చ వైభవమ్
వటో! రంగాఖ్య! హే వత్స!
పశ్య సర్వత్ర సర్వదా||
పుష్య కృష్ణ పఞ్చమీ, ఇన్దువాసర:
ది.24.01.2011

చి.ఈమని వేంకట సుబ్రహ్మణ్యేశ్వర మోహన శర్మణ:
(చి.ఈమని సూర్యనారాయణ, చి.ల.సౌ.శ్రీలక్ష్మిదంపతుల కుమారుడు)
ఉపనయన మహోత్సవం పురస్కృత్య 
శుభాశీ: కుసుమావలి:

శ్రీ వేంకటేశస్సదయార్ద్ర చిత్త:,
సమస్త విద్యా సుగుణ ప్రదశ్చ,
సుధీయుతం వేంకటమోహనాఖ్యం
వటుం చ విద్వచ్చతురం కరోతు||
     ఈమన్యన్వయజం బాలం 
     శ్రీలక్ష్మీ సూర్య సత్సుతమ్
     సుబ్రహ్మణ్యేశశర్మాణం
     గాయత్రీ పాతు సర్వదా||
శ్రీరామచన్ద్రశ్శశిశేఖరశ్చ
వాగీశవాణీగిరిజేందిరాద్యా:,
బ్రహ్మోపదిష్టస్య వటో: దిశన్తు
దీర్ఘాయురారోగ్య మనన్త సౌఖ్యమ్||
     సుబ్రహ్మణ్య వటో! ధీమన్!
     ఈమన్యన్వయ దీపక!
     అనిశం జప గాయత్రీం 
     విద్యాబుద్ధ్యాది హేతవే||
విద్యావినయ సంపత్తి:
యశోవిత్తం చ వైభవమ్
వటో! మోహనశర్మన్! త్వం
గాయత్ర్యా ప్రాప్తుమర్హసి|| 
జ్యేష్ఠ శుక్ల ఏకాదశీ, భానువాసర:
ది. 12.06.2011

చి.  పసుమర్తి శ్రావణ్ 
(శ్రీ. బ్రహ్మానందం గారు, శ్రీమతి శ్రీలక్ష్మి గార్ల పుత్రుడు) 
ఉపనయన సందర్భముగా వ్రాసిన 
ఆశీ: పద్యములు.
ఉ.
శ్రీదుడనంత కామదుడు చిన్మయ రూపుడు శంకరుండు, దా
మోదర వాగధీశ సురముఖ్యులు యిందిర శారదాంబికల్
మేదిని సర్వ విద్యలను, మించు యశంబుల నందజేసి తా
మాదర మొప్ప యీ వటున కన్నిట సౌఖ్యము లిత్తురెప్పుడున్.
కం.
శ్రీ వేంకటేశు డెప్పుడు
యీ వటువున కొసగుగాత! యింపుగ నెందున్
శ్రీవిద్యా శుభ కీర్తులు
భావింపగ సకల శాస్త్ర పాండిత్యంబున్.
కం.
శ్రీలక్ష్మీప్రియనందన!
తాలిమి గాయత్రి గొల్చి, ధరలో నికపై
శ్రీలంది సర్వసుఖములు
మేలగు విఖ్యాతి తోడ మెలగుము నీవున్.
కం.
బ్రహ్మోపదేశమందిన
బ్రహ్మానందాత్మజాత! బహు విద్యలలో
బ్రహ్మాండ విస్తృతంబగు 
బ్రహ్మజ్ఞానంబు నంది భాగ్యము గనుమా!
ఆ.వె.
వినయశీలి వగుచు విజ్ఞత గాంచుచు
విద్యలరసి ధర్మవేత్త వగుచు
వసుధలోన శ్రవణ! పసుమర్తి వంశంపు
గౌరవంబు పెంచి ఘనుడ వగుము.  

చి.రామకృష్ణ 
(చి. విజయ కుమార్, సుబ్బలక్ష్మి దంపతుల పుత్రుడు) 
ఉపనయన సందర్భముగా వ్రాసిన 
శుభాశీ:పద్యరత్నములు.
శ్రీదుండౌ గౌరీపతి
యాదిజుడా వాగధీశు డజుడన్నింటన్
వేదాధారుడు శ్రీపతి
సాదరముగ బ్రోతురెపుడు సద్విద్యలతోన్.

కృష్ణాజినధారీ! శివ
కృష్ణా!  సుబ్బాంబజాత! కృషినన్నింటన్
కృష్ణయజుశ్శాఖాగమ
నిష్ణాతుడ వౌచు గనుము నిర్మల యశముల్. 

గాయత్రియె నిను గాచును
గాయత్రియె సుఖములొసగు, ఘనవైభవముల్
శ్రేయంబులు సమకూర్చును
గాయత్రిని గొల్వుమోయి! క్రమతను కృష్ణా!

త్రిజగన్మాతను గొల్వగ           
విజయాత్మజ! రామకృష్ణ! విమల యశంబుల్
విజయంబులు జీవనమున
నిజమిది మరి గల్గుచుండు నీకెల్లపుడున్.

జననీ జనకుల మనముల
వినయాత్ముడవౌచు నేర్చి విస్తృత విద్యల్
తనయోత్సాహము గూర్చుము
ధనకనకములంది కృష్ణ ధరనెల్లెడలన్. 

సంస్కృత శ్లోకాలలో ఈ చిరంజీవికే 
ఆశీశ్శుభాకాంక్షలు.
శ్రీమద్గణేశ స్సదయార్ద్రచిత్త:
భాన్వాది కేత్వన్త గ్రహాశ్చ నిత్యం,
చిరాయురారోగ్య సుఖాని దత్వా
పాయాద్వటుం శ్రీశ్రుతకీర్తి ముఖ్యై:||
          సర్వవిద్యాప్రదాతారౌ
          దేవౌ మాధవ శంకరౌ
          బుద్ధ్యా చ, విద్యయా పాతాం
          రామకృష్ణ మిమం వటుమ్||
సుబ్బలక్ష్మీసుతం బాలం
రెండుచింతల వంశజం
కృష్ణం పాతు సదా బ్రహ్మా
దత్వా సత్కీర్తి రాయుషీ ||
          సుతం చ విజయాఖ్యస్య
          నూత్న యజ్ఞోపవీతినం,
          గాయతీ పాతు సా మాతా
          రామకృష్ణ మముం వటుమ్||
హేరామకృష్ణాఖ్య వటో! భవాంస్తు
సచ్ఛీలవిద్యాభ్యసనేన నిత్యం
జన్మ ప్రదాత్రోశ్చ సుపుత్రహర్షం
దదాతు తే చాత్ర చిరాయురస్తు||

ది.  04.07.2012 వ తేదీ 
శ్రీ మంగళ్ సింహ్ యు.డి.సి. 
వీడ్కోలు సందర్భంగా అందించిన  
శుభాకాంక్షలు.
శ్రీమన్మంగళ సింహాఖ్య
ధీమన్తం లిపికాగ్రణిం
సర్వదో మాధవ: పాయా
ద్దత్వా సత్కీర్తి సంపద:||

కార్యాలయాధినాథత్వే
దక్షత్వం కార్యకౌశలం,
ప్రాప్స్యసి త్వం సదా నూనం
సర్వత్ర విజయం భువి||


 

Saturday, 14 April 2012

శ్రీ గణేశస్తుతి

శ్రీ గణేశ స్తుతి
ఛందము - ఉత్సాహ

జయ గణేశ! శంకరాత్మజాత! విఘ్ననాశకా!
భయవిదార!యఘవిదూర! భాగ్యదాయకా! ప్రభో(ప్రభూ)
జయము సిరులు యశములొసగి సత్వమందజేసి నీ
దయను జూపి కావు మేకదంత! నీకు సన్నుతుల్.


భవుని ముద్దుబిడ్డవయ్య, భాగ్యమందజేయుమా,
శివశివా! యనంగ మాకు సిద్ధులన్ని గూర్చుమా,
భవభవా! యటంచు గొల్చు భక్తజనుల బ్రోవుమా
శివకుమార! నిన్ను జేరి శిరసు వంచి మ్రొక్కెదన్. 

ఏకదంత! విఘ్నరాజ! యిభముఖా! శుభంకరా!
నీకనేక నతులొనర్తు నిత్య మెల్లవేళలం
దేకవింశతి దళపూజ లేకనిష్ఠ చవితికిన్
లోకరక్షకా! సమస్తలోకనాయకా! విభూ!

ఇభముఖంబు, వక్రతుండ మేకదంత మాదటన్
శుభదనాగయజ్ఞసూత్ర! శూర్పకర్ణయుగ్మమున్
విభవమొసగు సుముఖముద్ర విస్తృతోదరంబులే
యభయమందజేసి గాచు నఖిలభక్తకోటులన్.

ధనములేల? సుఖములేల? ధరణినేలు శక్తులున్
ఘనతయేల? హయములేల? కరులవేల? గణపతీ!
జనులకింక నీపదాంబుజాతదివ్యపూజలే
మునులకైన, ఘనులకైన ముక్తినొసగు మార్గముల్. 
హ.వేం.స.నా.మూర్తి.

శ్రీ వైష్ణవీ మాత
ఛందము - శార్దూలము 

శ్రీమాతా! నిగమస్తుతా! భగవతీ  ! సిద్ధిప్రదా! బుద్ధిదా!
శ్రీమత్పావనదివ్యభవ్య చరితా! చిద్రూపిణీ! శ్రీమయీ!
మామా పాపములన్ హరించి మదిలో మాకిన్ని సద్భావముల్
నీమంబుల్ గలిగించి కావుము సదా, నీకంజలుల్ వైష్ణవీ!  1.

శ్రేయంబుల్ గలిగించ "జమ్ము యను కాశ్మీర"ప్రదేశంబునన్
హాయిం గొల్పగ వాసముంటివి గదా, అంబా! జగన్మోహినీ!
నీయందెవ్వడు భక్తిఁజూపి సతమున్ నీనామ సంకీర్తనల్
చేయం బూనునొ వాని కబ్బు నిలలో శ్రీ లెప్పుడున్ వైష్ణవీ!  2.

మాతా! శాంకరి! జ్ఞానశూన్యుడ నికన్ మందుండ నీ కేవిధిన్
చేతంబుల్లసిలంగ గూర్చగలనో శ్రీసూక్తులందంబుగా
రీతుల్ ఛందము రానివాడనుగదా, రేయింబవల్ నిత్యమున్
జోతల్ చేసెద భక్తితోడ కరుణన్ జూపించుమా వైష్ణవీ!   3.

నీచారిత్రము మాధురీభరమహో! నీసత్కథాలాపముల్
వాచాలత్వము ద్రుంచివేసి ఘనతన్ వాగ్వైభవాన్వీతమౌ
వీచీ పంక్తుల నందజేసి క్రమతన్ విజ్ఞాన మందించుచున్
ప్రాచీనత్వము కట్టబెట్టును గదా, వాగీశ్వరీ! వైష్ణవీ!  4.

నీవే సర్వఫలప్రదాత్రివిగదా, నీనుండియే సృష్టులున్
గావింపంబడు, వృద్ధినొందు, లయమౌ కైవల్యసంధాయినీ!
ఆవైకుంఠుడు, సృష్టికర్త, శివుడాహా! నీ పదచ్ఛాయనే
భావింపందగు మార్గదర్శకముగా  భాగ్యప్రదా!  వైష్ణవీ!  5.

జమ్మూప్రాంత సమీపమందు ఘనమౌ సద్గోత్రవర్గంబుపై
అమ్మా! యీశ్వరి! లోకరక్షణకునై యాశ్చర్యముం గొల్పుచున్
సమ్మోదంబున నిల్చినావు జననీ! సన్మార్గముం జూపుచున్
మమ్మెట్లైనను గావగా వలయు నోమాహేశ్వరీ! వైష్ణవీ!  6.

తల్లుల్ దండ్రులు బంధువర్గమనుచున్ తాదాత్మ్యతం జెంది యో
తల్లీ! మానవుడెల్లెడం దిరుగుచున్ దైన్యత్వముం బొందుచున్
కల్లోలంబులఁ జిక్కుచుండె కనుమా, కారుణ్యముం జూపి మా
కెల్లన్ నీపదకంజదర్శనసుఖం బీయం దగున్ వైష్ణవీ!  7.

ధన్యుండై వెలుగొందు వాడు ఘనుడై త్వద్భక్తు డీ సృష్టిలో
నన్యం బొండు తలంచబోక సతతం బార్ద్రాత్ముడై నీకథల్
మాన్యత్వంబున చెప్పుచున్న, వినినన్ మాతా! దయాంభోనిధీ!
దైన్యత్వంబు నశించి సత్వయుతుడౌ  తత్త్వాత్మికా! వైష్ణవీ!  8.

నిన్నున్ నమ్మితి నీపదాబ్జములకున్ నిత్యాభిషేకంబులన్
మన్నింపందగునమ్మ! పూజలెరుగన్, మందుండ నజ్ఞుండనై
యున్నాడన్ కను, నీ సుతుండ నిదిగో, ఓయమ్మ! ధన్యాత్ముగా
నన్నేరీతి యనుగ్రహింపగలవో, నారాయణీ! వైష్ణవీ!  9.

దేవీ! నీ చరణామృతాబ్ధిలహరుల్ తీర్థంబులై దేహమం
దావేశించిన కల్మషంబులను స్వాహాచేసి దివ్యత్వమున్
సేవాభావము గల్గజేసి జనులన్ శ్రీమంతులన్ జేయు, నా
కేవేళన్ భవదీయసంస్తవసుఖం(చరణాంబుసేవనసుఖం) బిప్పించుమా వైష్ణవీ!  10.
Friday, 13 April 2012

అంబేడ్కర్

 "భారతరత్న" అంబేడ్కర్


అస్పృశ్యతాభూత మావహించిన వేళ
                     గళమెత్తి పల్కిన ఘనుడు తాను,
నిష్ఠతో రాజ్యాంగ నిర్మాణమొనరించి
                     దారిజూపించిన ధన్యజీవి,
అవమాన భారాల నంతరంగమునందు
                    దాచియుంచిన యట్టి ధర్మమూర్తి,
అల్పవర్గంబుల కండగా నిల్చుచు
                   దైన్యత దొలగించు ధైర్యయుతుడు
దీప్తులొలుకంగ భారతదేశమునకు
సేవయొనరించు నిస్స్వార్థ జీవి యతడు
రమ్యగుణశాలి, భారతరత్న మనగ
పేరు వడసిన నేత యంబేడ్కరుండు. 

నిత్యదరిద్రవాయువులు నిర్భరజీవన మావహించినన్
సత్యతగోలుపోక సుఖశాంతుల నంతట పంచి పెట్టి తా
నత్యధిక ప్రయాసమున నందర కన్నిట సౌఖ్యదాయి యౌ
సత్యసుశాసనంబులను సాధన జేసి రచించె నక్కటా!

సరియగు రాజ్యాంగంబును
భరతావనికందజేయు భాగ్యవిధాతా!
ధరపై శాశ్వతముగ నీ
కరమర లేకుండగల్గు నధిక యశంబుల్.
                                       అంబేడ్కర్ జయంతి సందర్భముగా----         
 
 

Monday, 9 April 2012

హనుమ

శ్రీ గణేశాయనమ:            శ్రీ సరస్వత్యై నమ: 
 శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ: 
శ్రీమదాంజనేయాయ నమ: 
శ్రీవేంకటేశాయ నమ:
శ్రీహనుమ
(శ్రీరామచంద్రాపుర హనుమత్ శతకము)
ఛందము - తేటగీతి.
శ్రీకపీశ్వర! హనుమంత! శీఘ్రగామి,
చిన్మయానంద! హరిభక్త! మన్మనోబ్జ
భృంగరాజమ! నాకు సత్సంగమిమ్ము
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  1.

శ్రీదుడార్ద్రాంతరంగుండు చిన్మయుండు,
జనకునాజ్ఞల నడవుల సంచరించు
రామచంద్రుండు నీస్వామి రాఘవుండు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  2.

తొలుత విఘ్నేశు గజవక్తృ దలచి పిదప
సకల లోకేశు శ్రీరామచంద్రు దలతు,
ఈశు పరమేశు శంకరు నిందుధరుని
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  3.

ఇంక కులదేవు నా వేంకటేశు దలచి,
యాదిదేవుని సకలదు నజుని గొల్చి
చదువులకు తల్లి శ్రీవాణి చక్క దలతు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  4.

లలితహృదయను జగదంబ లక్ష్మి గొలిచి
సర్వమంగళ బార్వతి శరణు జొత్తు,
నతుల నీరీతి సకలదేవతల దలచి
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  5.

ముళ్ళపూడ్యన్వయాబ్ధికి మూలమైన
నాదు గురువును నారాయణాఖ్య ఘనుని
దలచి శతకంబు(స్తవములు) నీపైని బలుక జూతు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  6.

అమలహరివంశచంద్రుని విమలచరితు
వేంకటేశ్వరు తనయుండ, వినయశీల
జనని సామ్రాజ్యలక్ష్మియు సాధుచరిత
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  7.

పూజ్యుగౌతముగోత్రాన బుట్టినాను
సత్యనారాయణాఖ్యుడ సాధుగుణుడ
పాపహరణము చేసి కాపాడవయ్య,
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  8.

కావ్యనిర్మాణమొనరింప కవిని గాను,
భావపూరిత విరచనఫణితి నెరుగ
నిన్ను దలపంగబూనితి నియతితోడ
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  9.

నిత్యు శాశ్వతు నినుగొల్చి, నిన్నువేడి         
పలుకబూనితి నీపైని పద్యశతము
పూర్తిచేయింతు వేరీతి పుణ్యమూర్తి!
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  10.

పలుక నావద్ద శబ్దసంపత్తి లేదు 
మహితపదముల స్తోత్రనిర్మాణమందు
దిట్టగానింక నాకోర్కి దీర్చుమయ్య,
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  11.

దేవ! శైశవదశయందు దినకరమణి
నాకసంబున గాంచి నీవాకలిగొని
ఫలముగాబోలునని మ్రింగబట్టినావు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  12.

తొల్లి యబ్ధిని లంఘించి బల్లిదుడగు
రావణాసురు బెదిరించి, లంకగాల్చి
కాంచి రమ్మన కాల్చిన ఘనుడవవుర!
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!   13.

భవ్య కృష్ణానదీతట దివ్యభూమి
భక్తజనముల రక్షించి ముక్తి నొసగ
వాసమేర్పడి యున్నట్టి వాడవీవు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  14.

సకలసౌభాగ్యసంపత్తి, సాధుకీర్తి
పుత్రపౌత్రాది యశముల పొందు నరుడు
దేవ!  నీదయ గలిగినం దిరముగాను
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  15.

సౌమ్యురాముని సుగ్రీవసఖుని జేసి
వీరవానరు వాలి జంపించి నీవు
సేమ మతివను సుగ్రీవు జేర్చినావు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  16.

లలితహృదయను సీతను లంకనుండి
కువలయాధిపు రాముని కొరకు దెత్తు
వదలుడిక చింత వానర బంధులనెడు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  17.

సీతఁగనుగొన రాముని దూత వగుచు
వార్థి యోజనశతమును వానరేంద్ర!
దాటి లంకను జేరిన మేటివవుర!
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  18.

రామకార్యార్థివై నీవు రయముతోడ
నబ్ధిలంఘింప మైనాకు డనియెగాదె,
యనఘ! నాపైని విశ్రాంతి నందుమయ్య,
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  19.

కాలమల్పము, కడుభార కార్యమిదియు
విశ్రమించుట గిరిరాజ! వీలుగాదు
సత్యమిదియని ముందుకు సాగినావు,
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!        20.

రాము నభిరాము రఘుకుల సోము దలచి
క్షణములోననె సీతను గాంచి వత్తు
దైన్యమిక యేల నాజన్మ ధన్యమనవె,
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!   21.

అకట! ఛాయను గ్రహియించి యబ్ధిపైన
దివిని జరియించు వారి బాధించుచుండు
జలధి వసియించు సింహికఁజంపినావు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  22.

సురస నినుజూచి భక్షింప జూడ నపుడు
మొదట యోజన విస్తృతి, పిదప సూక్ష్మ
దేహమును దాల్చి ముఖమునఁదిరిగినావు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  23.

సూక్ష్మరూపాన లంకలో చొరబడగను
సకలలోకేశుడగునిను జంపజూ
ముష్టిఘాతాన లంకిణి మోదినావు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  24.

శోభనంబుగ సీత నశోక వనిని
శింశుపముక్రింద నీవు దర్శించి యపుడు
వినయమున వంగి ప్రణతులర్పించినావు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!      25.

శోకసంతప్తయగుచు నశోకవనిని
శింశుపమునీడఁ జేరిన సీతకపుడు
వీరు నినుజూడ దు:ఖము దూరమయ్యె
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  26.


అసురవాగ్బాణధాటికి నసువుబాయ
యత్నమొనరించు సీతమ్మ కనఘ! నీదు
రామనామపు గానంబె రక్షయయ్యె
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  27.రామలక్ష్మణులున్నారు సేమమచట,
పరమపురుషుండు రఘుపతి బంటు నేను   
వానరుండను దు:ఖము వదలుమనవె
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  28.

నిన్ను గొంపోవ రాముడాపన్నివారి
వేగరానుండె దు:ఖమ్ము విడువుమింక
తల్లి! వినుమంచు సీతనోదార్చినావు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  29.

అమ్మ! సీతమ్మ! వినుము నీయాజ్ఞయేని
కనుమ నినుజేర్తు రాముని కడకు నిపుడె
విశ్వసింపుమయంటివి, విశ్వవినుత!
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  30.

సీత నినుజూచి హనుమంత! చిన్నికోతి
వెట్టు గొనిపోదు వనగ నన్నింత దవ్వు
దివ్యకాయంబు చూపితి భవ్యఫణితి
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  31.

పరమశూరుడవయ్యును బాలు భంగి
అంబ జానకి ఘనమైన యాజ్ఞగొనవె
భక్షణముసేయ ఫలముల వనమునందు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  32.

సుందరంబౌచు వెలుగునశోకవనిని
ధ్వంసమొనరించు సమయాన దానవులను
మించి యుత్సాహివై సంహరించి నావు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  33.

ఇంద్రజిత్తుండు బ్రహ్మాస్త్రమేయ నపుడు
వైరి ముందట సామాన్యు పగిది నీవు
పట్టుబడినావు రావణు బలము దెలియ
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  34.

దివ్యదేహుని నిను నిరోధింపవచ్చు
నక్షసుతుగని యతి శీఘ్ర మాహవమున
నమరపురికంపి విజయంబు నందినావు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  35.

దుష్ట! రావణ! రాఘవు దురితదూరు
మథనపెట్టుట నీకు సేమంబుగాదు,
వినుము నిజమిది సీతను విడువమనవె
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  36. 

పూజ్యు రాముని సాదరపూర్వకముగ
గొలిచి జగదంబ నర్పించి నిలుతువేని
నీకు శుభమగు నంటివి, నిర్మలమతి
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  37.

తుచ్ఛవానరుడవటంచు తోకబట్టి
చీరలెన్నియొ చుట్టుచు చిచ్చుబెట్ట
ఘనత కపివర్య! లంకను గాల్చ లేదె!
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  38.   

క్షణములోపల వాలంబు కరము బెంచి
కనకమయమగు లంకను గాల్చి యంత 
నసురసేనల గర్వంబు నణచినావు
 రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  39.
  

దుష్ట రావణువలనను కష్టతతిని
మునిగియున్నట్టి సీతకు మోదమలర
నంగుళీయక మర్పించి తయ్య నీవు
 రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  40.

ధీరగుణశాలి! వానరవీర! శూర!
రుద్రవీర్యసముద్భవ! భద్రమూర్తి
కరుణ మముజూడు మోదేవ! ఘనముగాను
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  41.

మారుతాత్మజ! హనుమంత! మహితతేజ!
రుద్రవీర్యసముద్భవ! భద్రమూర్తి!
యనుచు దలచిన సంకటహరణమగును
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  42.


కనగ నాటల బాల్యంబు గడచిపోవు
దేవ! సంసార వాంఛల యౌవనంబు
నిల్చి నీరూపు గనినిను గొల్చుటెపుడు?
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  43.
భార్య, పుత్రులు, సంసారభారజలధి
మునిగి పోయితి దయజూపి ముక్తియొసగి
కాచి కాపాడు మోదేవ! ఘనుడవీవె
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  44.


తల్లి, తండ్రియు, నాథుండు, దాన భ్రాత
సఖుడ విష్టుడ వికనేమి సర్వమీవె,
నన్ను కరుణించి కాపాడు మన్న! వినుమ
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  45.


ఇల్లు, యిల్లాలు, సంపత్తి పిల్ల జెల్ల
శాశ్వతంబులు గావయ్య సత్యమతిని
నిన్ను దలచిన కాలంబె నిత్యమగును
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  46.


వేయి పేరుల స్తోత్రాల వివిధగతుల
నిన్నుపూజించి, సేవించి నీదుమూర్తి
కరము దర్శింప సంకటహరణమగును
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  47. 


అలఘుసేనను జేర్పంగ జలధిపైన
చెంతనున్నట్టి వానరసేన తోడ
సేతునిర్మాణ మొనరింప జేసి నావు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  48.


రావణానుజు మనములో భావమెరిగి
రయము తోడుత భగవాను రాము జేర్చి
ధర విభీషణు మిక్కిలి ధన్యు జేయు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  49.


మారుతాత్మజ! భవదీయ మహిమ దెలియ
లేక నిను దూషణంబుల నిమ్నగతిని
బలుకు రావణు బోధించి నిలిచినావు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  50. 

మున్ను రణమున సౌమిత్రి మూర్ఛవోవ
దివికి లంఘించి సంజీవి దెచ్చి యపుడు
దేవ! లక్ష్మణు గాపాడినావు గాదె,
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!51.

వీణవోలెను యవలీల ద్రోణగిరిని
చేత ధరియించి యకట సంజీవి దెచ్చి
భగవదభిరాము సంతోషబరచినావు 
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  52.

మకరరూపిణియగు నచ్చరకును వేగ
శాపమోచనమొనరించి సవ్యమతిని
ధన్యురాలను జేసిన ధర్మమూర్తి! 
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  53.

కార్యవిఘ్నము గలిగించు కాలనేమి
నంతమొనరించి యమపురి కంపినావు
విమత సంహారమందు నీ సములు లేరు
 రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  54.
అనఘ! కపివీర! సంగ్రామమందు నీదు
రూపు గనినట్టి యసురులు వీపుజూపి
కదలిపోలేదె, మిక్కిలి కదనభీతి
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  55.
సకలకల్మషహరము నీ చరణయుగము
నమ్మి యనునిత్యమర్చించు నరుడు సతము
హాయి నిహపర సౌఖ్యంబు లందగలడు
 రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  56.
నిత్యు నిన్నీశు గొల్వక నిముసమైన
తుచ్ఛసంసారసుఖముల నిచ్ఛతోడ
తేలిపోవును మనుజుండు బేలయగుచు
 రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  57.

ఈశ్వరాత్మజ! హరిదాస! విశ్వవినుత!
హరిహరాద్వైతభావంబు నందమొప్ప
తెలియజేతువు లోకాన దివ్యచరిత!
 రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!   58.

మారుతాత్మజ! నీనామమహిమచేత
సారహీనపు సంసారజలధినుండి
ముక్తులగుదురు జనులు నీభక్తులిలను
 రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!   59.

రోమరోమమునందు శ్రీరామనామ
మకట! నీరూపు సుందర మద్భుతంబు
చదువ, వర్ణింప నేరికి శక్యమగును? 
 రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!   60.

పతితపావను డఖిల సంపత్ప్రదాత,
రమ్య గుణశాలి, రాక్షసరాజహంత,
రామచంద్రుండు నీస్వామి రాఘవుండు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  61.

దశరథాత్మజ! రఘువీర! ధర్మమూర్తి!
సకలలోకేశ! శ్రీరామచంద్రయనుచు
సతము జపియించువారలు సఖులు నీకు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  62.

రామ! రఘురామ! దశరథరామ! యనుచు
రామనామంబు సర్వదా నీమమొప్ప
జపము సేతుము మాయందు కృపను జూపు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ! 63.

ఆంజనేయుండు మహనీ్యు డమలచరితు
డనుచు లోకంబు నీముందు వినతులగుచు
ప్రణతులర్పింతు రెల్లెడ భక్తితోడ
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ! 64.

ఎల్లవేళల రఘునాథు నెదను నిల్పి
గుండెలను జీల్చి చూపవె కూర్మితోడ
రామలక్ష్మణస్వాములన్ రామదాస!
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  65.

ఎచట రాముండు కొలువుండు నచట నీవు
అంజలి ఘటించి యుండెద వందమొప్ప
అకట! నీభక్తి గాంచగ నద్భుతంబు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!   66.

నాగవల్లీయ పత్రాల నవ్యగతిని
నతుల నర్పించి నామార్చనంబు సేయ
పొసగ జనులకు శుభముల నొసదెదీవు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  67.

కేసరాత్మజ! భవదీయ కీర్తనంబు
వాసి గొల్పెడి గాథాశ్రవణము, నీదు
విమల సేవయె పండుగ వినుము నాకు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!   68.

సతము దశరథరాముని స్మరణ చేసి
రామ నామంబె యన్నింట రమ్యమనుచు
బలికి లోకులకు తెలియ బరచినావు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  69.

నిన్నె సేవింతు నినుగొల్తు నీదు చరణ
యుగళి నర్చింతు నిరతమ్ము మిగులభక్తి
దయను జూపించి కాపాడు ధైర్యమొసగి
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  70.

ముదము గొల్పెడి దివ్యంపు మోము గల్గి
పారిజాతాఖ్య తరువున వాసముండు
మేరునగతుల్యవిగ్రహ! ధీర! శూర!
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  71.

అంజనీసుత! యరిహంత! ఆంజనేయ!
జానకీశోకనాశన! జయ సుధీంద్ర!
వాయునందన! శుభమూర్తి! వానరేంద్ర!
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  72.

రామనామము విన్నంత రయముతోడ
సంతసంబంది భక్తుల చెంత జేరి
రాము భజియింతు వా పరంధాము నీవు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!   73.

వేదవేదార్థచయముల వేత్తవయ్యు
భగవదభిరాము రాముని భక్తుడవయి
దేవ! నీదగు వినయంబు దెల్పినావు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!   74.


తీర్థయాత్రలు వేయేల? తిరముగాను
నిలిచి, నినుగొల్చి, త్వత్పాద నిర్మలాంబు
త్రాగుటేమాకు మోక్షప్రదాయి గాదె
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  75.


వివిధ చూర్ణములవియేల? విమల మతిని
జనుడు నినుగొల్వ, భవదీయ చరణరజము
పావనము చేయు దేహంబు భవ్యగతిని
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!   76.

పరమపూరుష! కపివీర! పవనతనయ!
సూక్ష్మరూపాన నొకపరి చోద్యమేమొ
విశ్వరూపత నొకట గన్పింతువీవు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!   77.

రోమరోమము నందు నాస్వామి గలడు
చూడుడని బల్కి రండిక చూపుదనుచు
గుండెలను జీల్చి నిలుతువు నిండుహృదిని
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  78.

దశరథాత్మజు డఖిలుండు దానవారి,
అంబ వైదేహి సకలలోకైకమాత
వీరి దలచుట పాప సంహారి గాదె
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!     79.

దివిజమార్గాన గిరి నీవు తెచ్చునపుడు
దానవుండని భరతుండు బాణమేయ
సొక్కి భువిదిగి భరతుని చూచినావు
 రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    80.

సకలవేదార్థ వేత్తవు, సాధుశీలి
వమల గుణుడవు వ్యాకరణాదులందు
సములు లేరందు రిలనీకు విమలమతికి
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    81.

ఉదయ మధ్యాహ్న కాలాల ముదముతోడ
నాథ! కపివర్య! సాయంతనంబులందు
నిఖిల సంకట హర్తను నిన్ను గొల్తు
 రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    82.

ఈశ! నీకంటె ఘనులెవ్వరిలను చెపుమ,
పరమపావనమైన నీభక్తి హనుమ!
కరము వర్ణింపజాల నీఖ్యాతి వినుమ
 రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    83.

సకల జగముల నేలెడి స్వామి వీవె
వాసి గొల్పగ దయజూపి వరము లీవె
పతితపావన! మమ్ము కాపాడ రావె
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!     84.

సకలసంకటహరణ! నీ చరణయుగళి
పరమ మిత్రుని కన్న, సంపదలకన్న
మిన్న, సరిలేదు దానికి మేటి యదియ
 85.
సకలలోకైకనాథ! నీచరణయుగము
భక్తి గొలిచిన వానికి శక్తియుక్తు
లనఘ! హరిపద మవలీల నబ్బగలదు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    86.


సకలసంకటహరణ! నీ చరణయుగళి
గట్టిగా నమ్మి కొలిచెడి ఘనుని కిలను
కనగ సంసార బంధాలు తునిగిపోవు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    87.వాయునందన! భవదీయ వైభవంబు
వర్ణనము సేయ కవులకె వశముగాదు
సుంత నేర్వనివాడ నే నెంతవాడ
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    88.


వైభవమొసంగు సకల సంపదలగోర,
ననఘ! ఘనకీర్తి, వస్తువాహనములడుగ,
విమలమతిజేసి కరుణ చూపించవయ్య
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    89.


తనయులనుబొంది, యర్థికి దానమిచ్చి,
యజనములుచేయ పుణ్యంబు లబ్బునేమి?
జనుడు నినుగొల్వడేనియు జగతిలోన
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    90.


దేవ! నిన్నె నమ్మితిని నీ సేవజేయ
రాగ వలదన్న, నేనేడ కేగగలను?
దీనబాంధవ! దయజూపు దీను పయిని
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    91.


అన్న! సంపద లేవేళ నడుగబోను,
కువలయాధిపతిత్వంబు గోరబోను,
చిన్ని తమ్ముడ నన్ను రక్షించవయ్య
 రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    92.

పరగ ద్వాపరయుగమందు వజ్రదంష్ట్ర!
సత్యభామను మరిసుదర్శనుని గరుడు(ఖగుని)
గర్వ మణగించి గాతువు సర్వవంద్య!
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    93.

వివిధలోకేశ! వానరవీర! జయము
దీనబాంధవ! పరమేశ! దేవ!జయము
పింగళాక్షుడ! హనుమంత! పిదప జయము
 రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    94.

సర్వరోగహరణ నీకు సాధు జయము,
రామదాసుడ! హే పరంధామ! జయము
సాగరోత్తారకప్రభు! జయము జయము
 రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    95.

పరమపూరుష! సకలసంపత్ప్రదాత!
జాంబవత్ప్రీతివర్ధన! స్ఫటికతుల్య
దేహ! మైనాకపూజిత! దేవదేవ!
 రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!   96.

భవ్యరామాయణాఖ్య కల్పతరువునకు
నీవ యాధార మనునది నిజము దేవ!
నిన్ను గనకున్న రాముండు ఖిన్నుడౌను
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!     97.

పంచవక్తృడ! బలవంత! కాంచనాభ!
భక్తవత్సల! లక్ష్మణా ప్రాణదాత!
సింహికాప్రాణభంజన! సిద్ధపురుష!
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    98.

విశ్వదీపితమైన నీ విక్రమంబు
ధాటినిగని యత్నించియు తాళలేక
అసురవీరులు చేరిరి యముని పురికి
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    99.

శక్తి గలిగియు శ్రీరామభక్తుడగుట
రావణాసురుడాదులౌ రాక్షసులను
స్వామి యాజ్ఞను పాటించి,  చంపలేదు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    100.

గరుడగమన! సురవినుత! కపివరేణ్య!
సతతసుఖదాత! హరిభక్త! సాధుచరిత!
పవనతనయుడ! సకలద! పరమపురుష!
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!     101.

స్వామి! సీతను సింధూర మేమిటనగ,
రామకల్యాణ మనియన రయముతోడ
నంత, యొడలంత సింధూర మద్దుకొనవె!
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    102.

వాక్కునందున నిల్చి హే వానరేంద్ర!
మంచి పద్యాలు శతము వ్రాయించినావు,
ప్రణతుల శతంబు నర్పింతు పావని! గొను
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    103.

జ్ఞానశూన్యుడనైన నజ్ఞాని చేత
పద్యశతకము నాచేత పలుక జేయు
నీదు యతులితమహిమ వర్ణింప దరమె?
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!     104.

నాథ! పలుకంగ వ్యాకరణంబు రాదు,
సర్వలక్షణఛందము నేర్వలేదు,
ఒప్పుతప్పులె కలబోసి చెప్పినాను
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    105.

నీమ మొకకొంత తెలియని పామరుండ,
కోపపూరిత హృదయుండ పాపమతిని
దయను జూపించి కాపాడు జయ సుధీంద్ర!
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!     106.

 నిఖిలజగములు వెదికిన నిన్నుబోలు
దైవమే లేదు, నాకింక తల్లి దండ్రి
యన్న, బంధువు లొకరేమి యన్ని నీవె,
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    107.


వాయునందన! కపివర్య! వజ్రదంష్ట్ర!
సర్వలోకేశ! వందన శతము నీకు
ప్రణతులను గొని మమ్ము కాపాడవయ్య,
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    108.

స్వగ్రామం "సంగళ్ళపాలెం" సమీపస్థమగు 
"రామచంద్రాపురం" లోని   
"శ్రీమదభయాంజనేయస్వామి"  
యనుగ్రహ,ప్రోత్సాహలతో రచితము. 
శ్రీస్వామికే అంకితము.