Thursday, 20 October 2011

మతము

మతసామరస్య వారోత్సవాల సందర్భంగా వ్రాసిన పద్యములు
మతము
ఛందము - ఆటవెలది.
మనిషి మనసులోన మమతానురాగాలు
ధర్మబుద్ధి గూర్చి ధరణిలోన
వాసిగొల్పునట్లు వసుధైక కౌటుంబ
భావనంబు పెంచవలయు "మతము".


కలహకారణంబు కారాదు మతమేది
కలసియుండుటెల్ల ఘనముగాదె
భరతజాతి మనది, సరియగు దృష్టితో
చూడవలయు జనుల సోదరులుగ.


మతములెన్నియైన మానవత్వంబొండె
దాని దాల్చ జన్మ ధన్యమగును
భావమెరిగి జనులు భాగ్యరేఖలనంది
మంచి బుద్ధితోడ మసల వలయు. 


పుణ్యభూమి యంచు పూర్వకాలమునుండి
ఖ్యాతి బడసి మిగుల నీతి గల్గు
భరతభూమిలోన బహుమత కలహాలు
తొలగిపోయి సమత వెలుగ వలయు. 


మతము పేర జరుగు మారణహోమంబు
మార్చె దానవునిగ మనిషి నిచట
మనువు నేర్పినట్టి మానవత్వము జంపు
మతము వలదు వలదు మనకదేల?


                 భావి భారత భాగ్యవిధాతలైన విద్యార్థులు
                                      ప్రతిహృదిలో సమతాభావం తిలకించాలి,
                                      ప్రతిమదిలో సమరసభావం పలికించాలి.

Sunday, 16 October 2011

నేటిభారతం

నేటి భారతం
(వర్తమాన దేశపరిస్థితులగూర్చి వ్రాసిన పద్యములు)
(ఛందము - ఉత్పలమాల)


ఏమి విచిత్రమో తెలియదీభరతావనిలోన దుష్టతా
ధూమము విస్తరిల్లినది, దుర్జనసంగతితోడ మానవుల్
నీమము దప్పి యుండిరిట నిత్యములయ్యె నధర్మకార్యముల్
సేమము మృగ్యమైనయది, చిందరవందరయయ్యె సౌఖ్యముల్.


పూర్వపు వైభవంబులవి పోయినవెక్కడ? దేశమంతటన్
పర్వములన్నియున్ కనగ భావవిహీనములయ్యె, సృష్టిలో
సర్వము పాపపూరితమసారమునయ్యె, సహిష్ణుతా
నిర్వహణంబు శూన్యమయి నీరసమయ్యెను వేదపాఠముల్.


సత్యము నామమాత్రమయి సర్వజనంబుల యంతరంగముల్
నిత్యము కల్మషంబులను నిండి యకారణ శత్రుభావముల్
హత్యలు, మానభంగములు నాసురకృత్యము లన్నిచోటులన్
నృత్యము చేయుచున్నయవి నిర్మలసఖ్యము కానరాదిలన్.


వేదవిచారశూన్యులయి విప్రులనేకులు భారతాన సం
పాదితభూసురత్వమును, బంధురవిజ్ఞత గోలుపోయి, దా
మోదరశంకరాది సురముఖ్యుల సేవలు విస్మరించి యు
న్మాదముతోడ నుండిరిట మత్సరగ్రస్తత ధర్మబాహ్యులై.


నాలుగుజాతులందు నిల నైతికవర్తన మంతరించె నే
డేలనొ, భారతానగల యేలికలందరు స్వార్థభావనా
జాలము చిత్తమందు గొనసాగ నగణ్యదురాగతంబులన్
దేలుచు సఖ్యముండిరిట దేశపురోగతి కడ్డుగోడలై. 


సత్యముబల్కువారలకు సర్వపరాభవదు:ఖసంతతుల్
నిత్యమసత్యభాషణము, నీమము దప్పిన వర్తనంబులున్
హత్యలు, దోపిడీలు, పరిహాసవచస్సులు బల్కుచుండి స
త్కృత్యము దూరువారలకు దివ్యసుఖంబులు నేడు జూడగన్.

వచన కవిత్వం

 రక్షకభటుడు
శ్రీకాకుళం జిల్లా పోలీస్ అమరవీరుల సంస్మరణ ప్రత్యేక సంచిక "అంజలి" కోసం వ్రాసిన కవిత.


రక్షకభటునీ ఉదంతమండీ
లక్షితబుద్ధిని వినరండీ
     ఇంటాబైటా వీధులలోనా
     కార్యాలయముల సర్వాకారత
     ఎక్కడజూచిన తానేయగుచూ
     అఖిలజగత్తున కాత్మబంధువై
          తనసంసారము, ఘనసంతానము
          ఖాకీబట్టలకంకిత మిచ్చీ
          స్వార్థబుద్ధినీ త్యజియించీ
          సతతము సేవల సతమతమయ్యే
రక్షకభటునీ ఉదంతమండీ
లక్షితబుద్ధిని వినరండీ
     దుండగులెచ్చట దండిగ ఉంటే
     మెండుగ వారల దండించుటకై
     లాఠీదెబ్బల లావణ్యంబుగ
     దేహశుద్ధితో దీవించుటకై
          దేశపౌరులే తన సోదరులని
          దేశరక్షణమె తనకు కార్యమని
          ముదము మీరగా ముందుకుదూకే
రక్షకభటునీ ఉదంతమండీ
లక్షితబుద్ధిని వినరండీ
     సంఘసేవయే పరమార్థముగా
     సాధువర్తనమె సల్లక్షణమై
     దేశరక్షణమె దివ్యవరమనీ
     కర్తవ్యానికి కట్టుబడుటకై
          కాలత్రయమున త్రికరణశుద్ధిగ
          ప్రతిజ్ఞబూనిన పోలీసండీ
రక్షకభటునీ ఉదంతమండీ
లక్షితబుద్ధిని వినరండీ
     అవినీతులనూ అక్రమాలను
     దుష్టబుద్ధినీ దుర్మార్గమును
     నిర్మూలించగ నిజజీవితమే
     పణముగ బెట్టిన పోలీసండీ
రక్షకభటునీ ఉదంతమండీ
లక్షితబుద్ధిని వినరండీ
     సమాజభూజపు చీడపురుగులై
     అభివృద్ధులకే అడ్డుగోడలై
     తమభావాలకు మమతను వీడుతు
     కిల్బిషమయమౌ గీతిక పాడుతు
          దేశాన్నమ్మే ధీమంతులకు
          సింహస్వప్నము పోలీసండీ
రక్షకభటునీ ఉదంతమండీ
లక్షితబుద్ధిని వినరండీ
     మంచికి మమతకు మారుపేరుగా
     మానవీయతకు మరోపేరుగా
     దుష్కృత్యాలను, దోపిడీలను
     మాయాదైత్యుల మట్టుబెట్టుటకు,
          శాంతి యహింసలు సమాజమందున
          నెలకొల్పుటకై నడుము బిగించిన
రక్షకభటునీ ఉదంతమండీ
లక్షితబుద్ధిని వినరండీ
  ఇక వర్తమానమును వచియించినచో
     అవినీతులతో, అక్రమాలతో
     దౌర్జన్యాలతొ, దుర్బుద్ధులతో
     అధికాహంకృతి ఆసురగుణులౌ
     దుర్మార్గులతో, ద్రోహిగణముతో
          చేతులు కలిపీ స్వీయగౌరవము
          కాలరాయుచూ ఖాకీ బట్టల
          ఔన్నత్యంబును అణగద్రొక్కుచు
          కర్మఠరూపము కళంకితంబుగ
స్వార్థభావనకు సద్రూపముగా
కల్మషజాలము కడుపున నింపుక
          పోలిసుశాఖకు పూర్వార్జితమగు
          పూజ్యభావనలు పుడమిక్రిందకు
          అణచెడివారే అధికులు గలిగిన
రక్షకభటునీ ఉదంతమండీ
లక్షితబుద్ధిని వినరండీ
     తనకళ్ళెదుటే ధరణీవలయము
     ధర్మబాహ్యమై, దానవీయతకు
     నిలయంబై మరి నిలబడగా
          సకలజీవులకు జన్మదాతయై
          అఖిలజగంబుల కాధారంబగు
          అబలామణి నేడవమానాలకు
     గురియై, అవనతయై, బహుదు:ఖితయై
          రక్షణకోసం రాత్రీపగలూ
          అబలను నేనని యాక్రోశించగ
     చూచీ చూడక, కిమ్మనకుండగ
     రిపోర్టు లేదని, సపోర్టులేదని
     పెదవిని విప్పక ముదమున నుండే
రక్షకభటునీ ఉదంతమండీ
లక్షితబుద్ధిని వినరండీ
     ఈ పరిణామపు కారణమేమో,
     ఈవిధి వీరలు మారుటయేమో
     రక్షకభటులే భక్షకులనియెడి
     పత్రిక వార్తల ఫలమదియేమో
రక్షకభటునీ ఉదంతమండీ
లక్షితబుద్ధిని వినరండీ
     సత్యమహింసా సమానధర్మం,
     నిస్స్వార్థంబును, నిర్మలచిత్తము
     అంకితభావం, ఆత్మీయతయు
     సేవాగుణములు తనలో పెంచుక
          శాంతమూర్తులై సద్భావంతో
     కర్మభూమియౌ పుణ్యభూమియౌ
     భారతదేశపు పురోభివృద్ధికి
     రక్షకభటులే యాధారంబన
     కీర్తిమంతులై మెలగాలి,
     రక్షకభటులై నిలవాలి.
రక్షకభటునీ ఉదంతమండీ
లక్షితబుద్ధిని వినరండీ.
  
వ్రాయాలని ఉంది
వ్రాయాలని ఉంది
సత్కవితారచనం చేయాలని ఉంది
       మధుర మనోహర దృశ్యాలను తిలకించి,
     మదీయ మనోభావాలను మేళవించి,
     నవరసభావాలొలికించి, 
     సమరసభావం పలికించి
     సురుచిర సుందర శబ్దాలతో
     సరససుకుమార పదలాలిత్యంతో
వ్రాయాలని ఉంది
సత్కవితారచనం చేయాలని ఉంది
     జననియు, పిమ్మట జన్మభూమియును
     స్వర్గముకన్నను సర్వోత్కృష్టములను భావనతో
ధర్మభూమియని, కర్మభూమియని
మునులకు, ఋషులకు, ఘనచరితులకు,
షట్ శాస్త్రాలకు, సద్ధర్మాలకు,
వేదచతుష్టయసారంబులకు,
భగవద్గీతకు, బహుగ్రంథాలకు,
సమతకు, మమతకు, సకలమతాలకు
నిలయం బిదియని నిర్మలహృదితో
     శుభకామనతో సద్భావనతో
     అతిసుందరముగ నస్మద్దేశపు
     ఖ్యాతిని దెల్పగ లేఖిని గైకొని
     శ్రీకారంబును చుట్టిన క్షణమున
అఖిల జగంబుల నబలలనందరి
నతివేగంబున బలిగొను సుందరి
వికృతరూపము, విశ్వాకారము
కన్యాశుల్కపుటగ్రజ తానట
వరకట్నంబది, పెనుభూతంబది
     ఎదురై నిలిచిందేమిటిదంటూ
     దేశకీర్తనము తగదని యంటూ
వ్రాయాలని ఉంది
సత్కవితారచనం చేయాలని ఉంది
     ఎం.ఏ. బీ.ఏ. లెన్ని చదివినా
     ధ్రువపత్రాలవి యెన్ని దొరికినా
     తినుటకు తిండీ కట్టుబట్టలూ
     దొరకక యిలలో జనజీవనమది
     వర్తమానమున దుర్భరమవ్వగ
బ్రతుకు తెరువుకై బాటయిదంటూ
అన్యాయాలను ఎదిరించుటయే,
అక్రమాలపయి విక్రమించుటయె
ధర్మపథంబది తమదని యంటూ
     శపథం పూనియు సరణిని మార్చిన
     తీవ్రవాదులం మేమని పలికే
సోదరులెదురై నిలిచా రేమిటిదంటూ
దేశకీర్తనము తగదని యంటూ    
     వ్రాయాలని ఉంది
     సత్కవితారచనం చేయాలని ఉంది
కర్మశాలలను, కార్యాలయముల
రచ్చబండలను, రక్షిత స్థలముల
వివిధప్రాంతముల విశ్వాకారత
దర్శనమిస్తూ ధరణీతలమున
     మూలముతానని శూలపాణియై
     తాండవమాడే ధనపిశాచమది
ఎదురై నిలిచిందేమిటిదంటూ
దేశకీర్తనము తగదని యంటూ    
     వ్రాయాలని ఉంది
     సత్కవితారచనం చేయాలని ఉంది
స్వర్గద్వారము చక్కగ జూపెద,
సకల సిద్ధులను తృటిలో నిచ్చెద
దేవుని దూతను తిరముగ నమ్ముడు,
శక్తిమంతుడను సర్వంబమ్ముడు
     మీమానంబులు, మీధనసంచయ
     మంతా నాకే అర్పించండని
     సంగత్యాగిని, స్వామిని నేనని
     మూర్ఖజనాలను మోసగించుచూ
మాయలు మర్మాలెన్నో చూపుచు
     బ్రతుకు తెరువుకై పద్ధతి మార్చిన
     కాషాయంతో వేషం కూర్చిన
     కుహనాసాధువు కోపంగా గని
ఎదురై నిలిచాడేమిటిదంటూ
దేశ కీర్తనము తగదని యంటూ
     వ్రాయాలని ఉంది
     సత్కవితారచనం చేయాలని ఉంది
అధికారార్థం బఖిల జనానికి
సేవలు చేశా సిరులను పంచా
ఎన్నికలొస్తే ఎట్లాగైనా
లబ్ధినందుటకు లక్షలు పంచా
     కోట్లు గడించుట కనీస ధర్మం,
     నోట్లను పొందుట జీవిత మర్మం
నిజమిది యందుకె  నిధులన్నిటిని
స్వాహా చేయుట సరియగు పనియని
     ప్రతి ఉదయంబున ప్రతిజ్ఞ బూనే
     నేత యతండట నను గర్జించీ
     మూర్ఖుడ వీవని నను తర్జించీ
ఎదురై నిలిచాడేమిటిదంటూ,
దేశకీర్తనము తగదని యంటూ
     వ్రాయాలని ఉంది
     సత్కవితారచనం చేయాలని ఉంది
విస్పష్టంబుగ, విస్తారంబుగ
అంచెలంచెలుగ పంచభూతములు
     హేళన చేయగ యీవిధి యిట్టుల
     దేశకీర్తనము చేయుట యెట్టుల?
జగాలనలమిన మృగతుల్యములగు
అకారపంచక మభిధానములగు
     అన్యాయంబులు, నక్రమంబులును
     అధర్మకార్యాలవినీతులును
     అవిద్య మొదలగు నఖిల రుగ్మతలు
     బహుభూతంబులు బహు దుర్మతులు
అదృశ్యమయ్యెడి యాక్షణమెప్పుడు?
జగాలనన్నిట జనని భారతియె
బహుశ్రేష్ఠంబని ప్రశంసలందే
మధుర క్షణములు మరి యవి యెప్పుడు?
     కవి హృదయం పులకించేనా?
     వాంఛిత మృదుభావాలను పలికించేనా?
వ్రాయాలని ఉంది
సత్కవితారచనం చేయాలని ఉంది


ఉగాది ఎప్పుడు?

ఉగాది పండుగ వచ్చిందంటూ
ఆనందాలను తెచ్చిందంటూ
     సంతోషంతో సద్భావంతో
     సుమధుర సుందర పదజాలంతో
నూత్నవత్సరమ! స్వాగతమంటూ
దశదిశలా యిక శోభనమంటూ
     కవితలల్లుకొని, మమత నింపుకొని,
     కవులంతా మరి  వేదికలెక్కీ
     దివిజావళికిక దీటుగ మ్రొక్కీ
     నూతనహాయన వైభవంబులను
     భావిజీవితపు సౌఖ్యంబులనూ
కీర్తిస్తే మరి సరిపోతుందా?
     స్వాగతగీతిక పాడుతు పోతూ
     కవితానాట్యాలాడుతు పోతూ
     ప్రజలంతా యిట కలిసుండాలని,
     సమతా మమతా కలిగుండాలని
ఉపన్యసిస్తే సరిపోతుందా?
     స్త్రీస్వాతంత్ర్యం సిద్ధించాలని
     దేశాభ్యుదయం పెంపొందాలని
          నిండు సభలలో
          మెండు స్వరంతో
ఆక్రోశిస్తే సరిపోతుందా?
     ప్రతిగ్రామంలో, ప్రతిరాష్ట్రంలో
     దేశమంతటా, విశ్వం నిండా
            వీధులు
            పేటలు
            రచ్చబండలూ
     ఎక్కడచూచిన మారణహోమం
     ఏచోటైనా స్వార్థపుధూమం
     ధనం చూచుకొని, మదం పెంచుకొని
     దుష్టశక్తులను కూడగట్టుకొని,
     అన్యాయంతో, అక్రమాలతో
     పేదలరక్తం పిండిత్రాగుతూ
     బడాబాబులై మనుషులుండగా
ఉగాది యెక్కడ? యుగాది యెక్కడ?
     జాతిభావములు, భాషాభేదము
     లక్రమకృత్యాలన్యాయంబులు
     ఎచ్చట చూచిన పెచ్చరిల్లుతూ
     సంకోచింపక విజృంభింపగ
ఉగాది యెక్కడ? యుగాది యెక్కడ?
     మనిషిని మనిషియె మదమత్సరుడై
     పశుసమానుడై భక్షణసేయగ,
     ఇంటా బైటా దేశమంతటా

     స్వతంత్రపవనాలదృశ్యమవ్వగ
     శాంతి యహింసలు మృగ్యములవ్వగ
ఉగాది యెక్కడ? యుగాది యెక్కడ?
     పగలైనా మరి రాత్రైనా
     ధైర్యవంతులై నడివీధులలో
     స్త్రీలంతాయిక స్వేచ్ఛగ తిరిగే
ఉగాది యెప్పుడు? శుభాది యెప్పుడు?
     దేశమంతటా నలుమూలలో
     ఎక్కడచూచిన ఎక్కడవిన్నా
          పెనుభూతాల్లా
     పాతుకుపోయిన తీవ్రవాదములు,
     మనసులు నిండిన మతదురంతములు
     ఆసాంతంగా అదృశ్యమయ్యే
     శాంతి యహింసలు ప్రకటితమయ్యే
ఉగాది యెప్పుడు? శుభాది యెప్పుడు?
     పురాణతతులకు పుట్టినిల్లుగా
     చతుర్వేదముల జన్మభూమిగా
     ఖ్యాతి వహించిన భరతావనిలో
     అఖిలధర్మముల కాటపట్టుగా
     మునులకు జనులకు మోక్షదాయిగా
     పేరుగడించిన పుణ్యభూమిలో
సత్యం, ధర్మం, సమతాభావం
జనముల మనముల సద్భావం
దూరంగా కనుమరుగై పోవగ
క్రౌర్యం, ద్వేషం, కుటిలత్వంబులు

వైషమ్యంబులు, విమతత్వంబులు
నిత్యసత్త్వమున నాట్యములాడగ
     ఉగాది యెక్కడ? యుగాది యెక్కడ?


ఉగాది
నేడే ఉగాది, సుభాను సంవత్సరాది
సమతా మమతల సద్భావాది,
కవితా భవితల నవయుగాది,
మనకందరికీ ఈ యుగాది            కావాలి
సకల సత్కార్యాలకు శుభాది
సత్యం, శివం, సుందరాది             భావాలను
ప్రతిహృదిలో పలికించే సదాది
కర్షకజనులకు నవ సస్యాది
హర్షిత హృదులకు భవభోగాది
సాధు జనాలకు సత్సంగాది
ముదిత మనాలకు శుభమోక్షాది
కవిగురుజనులకు శుభశబ్దాది
ఛాత్రగణానికి సత్ శీలాది
సర్వజనాలకు బహు పర్వాది
ఆప్యాయతానురాగాలకు పునాది
ఈసారైనా మారాలి మతోన్మాది          కావాలి
సర్వమత సమరసాస్వాది
ఈ సమయం అతి శుభసమయం
ఈ వత్సరమంతా సుఖాల మయం
మీ జీవనమతి సుందరం
మీ మనసది యొక మందిరం           కావాలని
ఆకాంక్ష, శుభకామన.


     
    

Saturday, 1 October 2011

మత్స్యోదంతము


మత్స్యోదంతము
(చేపల కథ)
(గద్య కథకు పద్యాను కృతి) 
పూర్వకాలమందు పుష్పక మను చెర్వు
కలదు దానియందు కాలమతియు
సుమతి, మందమతియు సుఖ్యాతనామాల
మత్స్యమిత్రులుండు మైత్రితోడ.

సుమతి సార్థకనామంబు శోభనంబు
అకట! యేదేని యాపద నంది నపుడె
గాంచు సద్భావభాగ్యంబు కాలమతియు
మంద మతియౌర! నిజముగ మందబుద్ధి.

భేదము లేకిక మత్స్యాల్
మోదంబున జేరియుండు ముచ్చట గొల్పన్.
రాదేది వాటి మధ్యను
వాదెప్పుడు జూడ మిగుల వాక్యము లేలా?

అంత నొకపరి వేసవి యెంతొ తీవ్ర
తరముగను గాసె లోకాలు దైన్యపడగ,
చెట్లు చేమలు పైరులు చేవ జచ్చి
కనలిపోవుచునుండ దా గాంచి సుమతి.

తనమిత్రులతో నను దాన్
వినుడో సన్మిత్రులార! వేసవి జూడన్
కనకన నిప్పులు రాల్చుచు
ఘనతాపము గూర్చు చుండె కనుడీ మీరల్.

ఇంతకు మున్నె జాలరులు యిచ్చటికేగిరి వారలొండొరుల్
సంతసమంది పల్కిరిటు చక్కగ చెర్వున నీళ్ళు లేమి తా
మెంతయొ మోదమందుచును నిచ్చటి నీరము కొద్దికాలమం
దింతయు నింకిపోవు నపుడిచ్చట చేపల బట్టగా దగున్.
              కావున
ఇట నుండగ రాదికపై         
నెటులైనను నేగ వలయు నెందేనిపుడే
పటుతరమగు యాలోచన
నటు నిటు యోచించి గనుడు యస్మన్మిత్రుల్.

బాగగు యాలోచన దా
న్సాగెను మన్మదిని యిపుడు శ్రద్ధగ వినుడీ
వేగంబున మనమందర
మాగక యీకాల్వవెంట నఛ్ఛోదంబున్.

ఎట్టులైన గాని నేరీతి నైనను
చేర వెళ్ళ వలయు, వేరు మార్గ
మేది లేదు, వినుడు యింకేది యైనను
తెలియ వచ్చెనేని తెల్పుడనియె.

సుమతి మాటల కెంతయొ చోద్యమంది
కాలమతి యను నేమేమి? బేలవలెను
యింత చింతేల? భయమేల? సుంత వినుమ,
కాంతు మార్గంబు నాపద గల్గెనేని.

మందమతియేమొ మిత్రుల మాటలసలె
విననిదానియు బోలె నేమనదు కనదు
ధరణిని వినాశకాలము దాపురింప
హితుల మాటలు మరియేల మతికి నెక్కు.

వారిద్దరి కృత్యము గని
యారేయినె సుమతి చేరె నచ్ఛోదంబున్
నీరము తా గతియించగ
వారంతట వలలతోడ వచ్చిరి బెస్తల్.

సరసులోని చేపలనరమర లేకుండ
పట్టి విసరినారు గట్టుపైకి
మందమతియు కాలమతియును తటముపై
విసరి వేయ బడిరి వేగిరాన.

కాలమతి యంత శవముగా గదలకుండ
కొంత సేపుండ వారలు గూడ దాని
వదలివేసిరి మృతమని, పిదప తాను
సరసి జేరెను వెనువెంట సంతసాన.

మందమతికేమి తోచక మారుమారు
ఎగిరి పడుచుండ తటముపై మిగుల జూచి
చేత జాలరి యొకరుండు చిదిమి పట్టి
బుట్టలోపల వైచెను దిట్ట యనగ.

భావి కష్టతతిని భావన సేయుచు
కష్టతరణ మపుడె గాంచు సుమతి
సుమతి మాట వినని కుమతియు మందుండు
ప్రాణహీనుడగును బాధపడుచు.